వానాకాలం సాగుకు యాక్షన్‌ ప్లాన్‌

ABN , First Publish Date - 2022-05-16T06:30:37+05:30 IST

వానాకాలం సాగుకు వ్యవసా య శాఖ యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేసింది.

వానాకాలం సాగుకు యాక్షన్‌ ప్లాన్‌

 6.80 లక్షల ఎకరాల్లో పత్తి, 4.80 లక్షల ఎకరాల్లో వరి 

 ఇటీవల వానలకు కొన్ని ప్రాంతాల్లో దుక్కులు సిద్ధం 

 జూన్‌లో తొలకరి చినుకులు రాగానే సాగుకు రైతుల సన్నాహాలు 

నల్లగొండ, మే 15: వానాకాలం సాగుకు వ్యవసా య శాఖ యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేసింది. గత సీజన్‌ మాదిరిగానే అధిక భాగం పత్తి, వరి పంటలే ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో పత్తి, వరి విత్తనాలతోపాటు ఎరువులను కూడా అందుబాటులో ఉంచే విధంగా వ్య వసాయ శాఖ సన్నాహాలు చేయడంతోపాటు అందుకనుగుణంగా ఏర్పాట్లను కూడా చేస్తోంది. ఈసారి ఏం పంటలు వేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా నియంత్రణ విధించే అవకాశాలు లేకపోవడంతో రైతు లు తమ సాంప్రదాయంగా వస్తున్న వరి, పత్తి పంటలను వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షంతో కొన్ని చోట్ల దుక్కులను కూడా సిద్ధం చేసుకున్నారు. ప్లవ్‌ వేసి దుక్కులను దున్నారు. ఇక జూన్‌ నెలలో తొలకరి చినుకులు రాగానే సాగు చేసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అం దుబాటలో ఉన్న విత్తనాలతోపాటు ఎరువులను సేకరిస్తున్నారు. ప్రధానంగా పత్తి, వరి విత్తనాలతోపాటు కొంత మేరకు కంది విత్తనాలను కూడా కొనుగోలు చేయడానికి రైతులు నిర్ణయించుకున్నారు. గత ఖరీఫ్‌ లో పత్తి పెద్ద ఎత్తున సాగు చేసినప్పటికీ దిగుబడి తక్కువగా వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ రైతులు మరోసారి తెల్లబంగారం వైపు చూస్తున్నారు. నష్టాలు,లాభాలతో సంబంధం లేకుండా పత్తిని వేయాలని నిర్ణయించారు. పత్తి దిగుబడి తక్కువగా వచ్చినప్పటికీ రేటు ఈసారి క్వింటాకు రూ.11వేల నుంచి రూ.12వేల వరకు ధర పలికింది. చాలామంది రైతులు క్వింటాకు రూ.8వేలనుంచి రూ.8,500 ధర పలికినప్పుడు అత్యధికంగా పత్తిని విక్రయించుకున్నారు. 


ఈసారి కూడా పత్తి, వరి పంటలే అధికం

వచ్చే వానాకాలంలో అత్యధికంగా జిల్లాలో పత్తి, వ రి పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. పత్తి 6లక్షల80వేల ఎకరాల్లో సాగు కానుండగా, వరి 4లక్షల80వేల ఎకరాల్లో సేద్యం కా నుంది. ఈ నేపథ్యంలో విత్తనాలన్నింటినీ అందుబాటు లో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అందుకనుగుణంగా ఏర్పాట్లను చేస్తున్నారు. గతేడాది వానాకాలంలో ప్రత్యామ్నాయ పంటలకు ఎలాంటి విత్తన రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రభుత్వం నుంచి లభించకపోవడంతో వరి, పత్తి పంటలను సాగు చేసిన విషయం తెలిసిందే. మళ్లీ అలాంటి పరిస్థితులే ఈ సీజన్‌లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని భావించిన వ్యవసాయ శాఖ అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించింది. నైరుతి రుతుపవణాలు ఈసారి ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈనేపథ్యంలో అకాల వర్షాలకు దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు తొలకరి చినుకులు పడితే దుక్కులు దున్నడమే కాకుండా విత్తనాలను సరైన కార్తెబలం ఆధారంగా విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. వరి, పత్తితోపాటు కంది పంటలను జిల్లాలో 15వేల ఎకరాల వరకు వేసే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయశాఖ భావిస్తోంది. జిల్లాలో నీటి వనరులు కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో వరి సేద్యం పెరుగుతోంది. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వతోపాటు ఏఎమ్మార్పీ, డిండి, మూసీ ప్రాజెక్టులతోపాటు మేజర్‌, మైనర్‌ ప్రాజెక్టులకింద పెద్దఎత్తున వరి సాగు కానుండడంతో అందుకనుగుణంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. 


అందుబాటులో ఎరువులు, విత్తనాలు

జిల్లాలో ప్రస్తుతం 8వేల మెట్రిక్‌ టన్నుల యూరియా బఫర్‌ స్టాక్‌ సిద్ధంగా ఉంది. దీంతో పాటు మరో 12వేల మెట్రిక్‌ టన్నుల యూరియా డీలర్లు, వ్యాపారుల వద్ద ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. డీఏపీని కూడా ప్రణాళిక బద్ధంగా సిద్ధంగా ఉంచనున్నట్లు వ్యవసాయ శాఖ స్పష్టం చేస్తోంది. డీఏపీ మరొక 20వేల మెట్రిక్‌ టన్నులను రైతులకు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇకపోతే ఈసారి కూడా పచ్చిరొట్ట విత్తనాలు అయిన జీలుగ, జనుముకు తప్ప ఇతర విత్తనాలకు ప్రభుత్వం రాయితీ ఇచ్చే అవకాశాలు లేవు. సహకార సంఘాలు, డీసీఎంఎస్‌, ఆగ్రోస్‌ ద్వారా జీలుగ విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. ఇక వరి విషయానికొస్తే దొడ్డురకంలో ఎంటీయూ-1010 రకం, సన్నాలలో బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్‌-15048, జేజీఎల్‌-24423, ఎంటీయూ-1061 అధికంగా సేద్యం చేయనున్నారు. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ 4,100 క్వింటాళ్ల వరి విత్తనాలను సిద్ధంగా ఉంచింది. 


ముందే రైతుబంధు అందేనా..

ప్రభుత్వం ఈసారి రైతుబంధును వానాకాలం ప్రారంభం ముందే రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని ముందుగా అనుకున్నప్పటికీ మళ్లీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఆర్థికశాఖకు ఈసారి ముందుగానే రైతుబంధు అందేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. జిల్లాకు సుమారు 4లక్షల30వేల మంది రైతులకు రూ.651కోట్లకుపైగా రైతుబంధు వస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కొత్త పాస్‌పుస్తకాలు అధికమైతే అందుకనుగుణంగా రైతుబంధు నిధులను పెంచే అవకాశాలున్నాయి. ఈ నెలాఖరు వరకు కొత్తగా పాస్‌ పుస్తకాలు అందుకున్న వారికి రైతుబంధు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మొత్తానికి వానాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖతోపాటు రైతులంతా సాగువైపు దృష్టిసారించారు. 


ప్రణాళికను సిద్ధం చేశాం : సుచరిత, జేడీఏ, నల్లగొండ 

జిల్లాలో వ్యవసాయశాఖ వానాకాలం సాగుకు సంబంఽధించి యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేసింది. 4 లక్షల80వేల ఎకరాల్లో వరి, 6లక్షల80వేల ఎకరా ల్లో పత్తితో పాటు 15వేల ఎకరాల్లో కందులు సాగవుతాయని అంచనా వేశాం. అదేవిధంగా రైతుల కు సీజన్‌ ప్రారంభానికి ముందే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లుచేశాం. జిల్లాలో 8వేల మెట్రిక్‌ టన్నుల యూరియా బఫర్‌ స్టాక్‌ను సిద్ధంగా ఉంచాం. అదేవిధంగా ఎరువుల వ్యాపారులు, డీలర్ల వద్ద కూడా స్టాక్‌ ఉంది. 

Updated Date - 2022-05-16T06:30:37+05:30 IST