పెరోల్‌పై బయటకొచ్చి.. కానిస్టేబుల్ భార్యను పొడిచి చంపిన నిందితుడు

ABN , First Publish Date - 2020-04-04T23:44:11+05:30 IST

జైళ్లలో కరోనా వైరస్ విస్తరించకుండా అడ్డుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొందరు

పెరోల్‌పై బయటకొచ్చి.. కానిస్టేబుల్ భార్యను పొడిచి చంపిన నిందితుడు

నాగ్‌పూర్: జైళ్లలో కరోనా వైరస్ విస్తరించకుండా అడ్డుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొందరు ఖైదీలను పెరోల్‌పై విడుదల చేసింది. అలా విడుదలైన ఓ ఖైదీ శనివారం ఓ కానిస్టేబుల్ భార్యను పొడిచి చంపాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిందీ ఘటన. ఉదయం 10:30 గంటల సమయంలో కానిస్టేబుల్ అశోక్ మూలే కుమారుడు, తన స్కూల్ మేట్ అయిన నవీన్‌ను కలిసేందుకు నిందితుడు నవీన్ గొటాఫోడ్ (27) నందన్‌వన్ ప్రాంతంలోని వారింటికి వెళ్లాడు. అయితే, తన కుమారుడిని కలిసేందుకు కానిస్టేబుల్ భార్య సుశీల (52) అభ్యంతరం చెప్పింది. కలవడానికి వీలు లేదని తెగేసి చెప్పింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు నవీన్ వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడిచేశాడు. గమనించిన ఆమె కుమారుడు నవీన్ నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, అతడిపైనా దాడికి దిగాడు. రక్తపు మడుగులో కుప్పకూలిన సుశీలను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.  


నిందితుడు నవీన్ ఓ వాహన దొంగతనం కేసులో అరెస్టై జైలుకు వెళ్లాడు. ఇటీవల పెరోల్‌పై బయటకు వచ్చాడు. నిందితుడిపై ఓ మర్డర్ కేసు కూడా ఉందని జాయింట్ కమిషనర్ రవీంద్ర కదమ్ తెలిపారు. ఇలాంటి కరడుగట్టిన నేరస్తుడితో కానిస్టేబుల్ కుమారుడితో పరిచయంపై దర్యాప్తు చేస్తున్నట్టు సీపీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2020-04-04T23:44:11+05:30 IST