Abn logo
Apr 8 2020 @ 04:50AM

రెండు వారాలుగా నిలిచిపోయిన చింతపండు క్రయవిక్రయాలు

ఇళ్లల్లో పేరుకుపోయిన సరకు

కరోనా వైరస్‌తో ఏజెన్సీలో సంతలు బంద్‌

లాక్‌డౌన్‌తో మన్యానికి రాని మైదాన ప్రాంత వ్యాపారులు

సంతలు లేక, వ్యాపారులు రాకపోవడంతో అమ్ముకోలేని దుస్థితి

ఎక్కువ రోజులు నిల్వ ఉంటే రంగు మారిపోతుందని ఆవేదన

వ్యాపారులకన్నా తక్కువకు జీసీసీ ధర నిర్ణయం

అయినా రెండు వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని వెల్లడి

నిత్యావసర సరకుగా పరిగణించి, రవాణాకు అనుమతి ఇవ్వాలని వినతి 


అనంతగిరి, ఏప్రిల్‌ 7: ఏజెన్సీలోని గిరిజనులకు ప్రస్తుత సీజన్‌లో చింతపండు ప్రధాన ఆదాయ వనరు. ప్రతి వారపు సంతలో చింతపండు క్రయవిక్రయాలు జోరుగా సాగుతుంటాయి. కానీ కరోనా వైరస్‌ ప్రభావం చింతపండు రైతులపై తీవ్రంగా పడింది. వారపు సంతలను నిర్వహించ వద్దని అధికారులు ఆదేశాలు జారీచేయడం, లాక్‌ డౌన్‌ కారణంగా అత్యవసర సరకుల రవాణాకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో గిరిజనులు చింతపండు అమ్ముకోలేకపోతున్నారు. కొద్దిరోజుల నుంచి వడగళ్లతో అకాల వర్షాలు పడుతుండడం, ఇళ్లల్లో నిల్వ చేసుకునే వెసులుబాటు అంతగా లేకపోవడంతో చింతపండు పాడైపోతున్నదని వాపోతున్నారు.

  

గ్రామాలకు సమీపంలోని అడవుల్లో చింతపండు సేకరించి, దగ్గరలో వున్న సంతల్లో లేదా గ్రామాలకు వచ్చే వ్యాపారులకు అమ్ముకుంటూ గిరిజనులు ఆదాయాన్ని పొందుతుంటారు. గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వర్షాలు సమృద్ధిగా పడడంతో ఈ ఏడాది చింత చెట్లు బాగా కాశాయి. దిగుబడులు సైతం ఆశాజనకంగా ఉన్నాయి. దీనికితోడు సంతల్లో ధర కూడా సంతృప్తికరంగా ఉంది. లాక్‌ డౌన్‌ ముందు వరకు సంతల్లో కిలో (పిక్కతో) రూ.50 నుంచి రూ.60కు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రబలడంతో దాని వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం మార్చి నాలుగో వారం ఆరంభం నుంచి లాక్‌డౌన్‌ విధించింది. మన్యంలో ఏ ఒక్క సంతనూ నిర్వహించవద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు.


మైదాన ప్రాంతం నుంచి నిత్యావసర సరకులు మినహా మరే ఇతర వాహనాలు మన్యానికి రావడానికి వీలు లేదంటూ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో మైదాన ప్రాంతం నుంచి పెద్ద వ్యాపారులు ఏజెన్సీకి రావడం లేదు. గిరిజనులు సంతలో అమ్ముకుని వీలులేకుండా పోయింది. స్వయంగా మైదాన ప్రాంతంలోని మార్కెట్లకు తీసుకువెళ్లి అమ్ముకునేటంత అవగాహన కూడా లేదు. మరోవైపు జీసీసీ కూడా చింతపండు కొనుగోళ్లు ప్రారంభించలేదు. గిరిజన గ్రామాల్లో వుండే చిన్నవ్యాపారులు...స్థానికంగా గిరిజనుల నుంచి చింతపండు కొనుగోలు చేసి, పెద్ద వ్యాపారులకు అమ్ముతుంటారు. వీరి వద్ద ఇప్పటికే చింతపండు నిల్వలు పేరుకుపోవడం, మైదాన ప్రాంతం నుంచి పెద్ద వ్యాపారులు రాకపోవడంతో వీరు కూడా స్థానికంగా కొనుగోళ్లు ఆపేశారు. దీంతో గిరిజనులు చింతపండు ఎలా అమ్ముకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు.


ఒకటీఅరా వ్యాపారులు ప్రధాన రహదారుల పక్కనున్న గ్రామాల్లో చింతపండును కొనుగోలు చేసి, నిత్యావసర సరుకులతో ఏజెన్సీకి వస్తున్న వాహనాలు తిరిగి మైదాన ప్రాంతానికి వచ్చేటప్పుడు వాటిల్లో లోడ్‌ చేసి తెచ్చుకుంటున్నారు. ప్రధాన రహదారులకు దూరంగా, మారుమూలనున్న గ్రామాల్లోని గిరిజనులు చింతపండు అమ్ముకోలేకపోతున్నారు. ఇళ్లల్లో నిల్వ చేసే పరిస్థితి లేదని, ఎక్కువ రోజులు వుంటే రంగు మారిపోయి కనీస ధర లభించదని గిరిజనులు వాపోతున్నారు.


జీసీసీ అరకొర కొనుగోళ్లు

చింతపండు కిలో(పిక్కతో) రూ.31కు కొనుగోలు చేయాలని గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నిర్ణయించింది. కానీ లాక్‌డౌన్‌కు ముందు సంతల్లో కిలో రూ.50 నుంచి రూ.60లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్థానికంగా వుండే చిన్న వ్యాపారులు నాణ్యమైన చింతపండు కిలో రూ.40కు, రెండో రకాన్ని రూ.35లకు కొనుగోలు చేస్తున్నారు. చింతపండుకు డిమాండ్‌ వున్న సమయంలో ప్రైవేటు వ్యాపారులకన్నా జీసీసీ తక్కువ ధర నిర్ణయించడం ఏమిటని గిరిజనులు అంటున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం జీసీసీ అధికారులు ఎక్కడా చింతపండు కొనుగోలు చేయడం లేదు. పైగా ఏజెన్సీలో సుమారు 50 వేల క్వింటాళ్ల చింతపండు దిగుబడి వస్తుంది. జీసీసీ రెండు వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది.


జీసీసీ తీరు వల్ల ప్రైవేటు వ్యాపారులు కూడా ధరలు తగ్గించే అవకాశం వుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీసీసీ అధికారులు తమ వద్ద కొనుగోలు చేయకపోయినా ఫర్వాలేదని, కానీ కిలో రూ.31 ధరగా నిర్ణయించి తమకు నష్టం కలిగిస్తున్నారని వారు అంటున్నారు. నిత్యావసర సరుకుల రవాణాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున, వ్యాపారులు గ్రామాల్లోకి వచ్చి చింతపండు కొనుగోళ్లు జరపడానికి, ఇక్కడి నుంచి మైదాన ప్రాంతానికి తరలించడానికి అధికారులు అనుమతులు ఇవ్వాలని గిరిజనులు కోరుతున్నారు.


Advertisement
Advertisement
Advertisement