వైద్యులకు వసతి గృహ యోగమెన్నడో!

ABN , First Publish Date - 2022-05-23T06:11:17+05:30 IST

వైద్యులు స్థానికంగా ఉండాలంటే నివాస గృహాలు అందుబాటులో ఉండాలని భావించిన గత టీడీపీ ప్రభుత్వం 2018 ఆఖరులో ఐటీడీఏ ద్వారా చింతపల్లి సబ్‌ డివిజన్‌లో గృహ సముదాయం నిర్మాణానికి రూ.70 లక్షల నిధులు మంజూరుచేసింది.

వైద్యులకు వసతి గృహ యోగమెన్నడో!
అసంపూర్తిగా దర్శనమిస్తున్న వైద్యుల వసతి గృహ సముదాయం

 రెండేళ్లుగా నిలిచిన గృహ సముదాయ నిర్మాణ పనులు

- బిల్లుల మంజూరులో జాప్యమే కారణం

- ఎట్టకేలకు బిల్లులు వచ్చినా తదుపరి పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్‌ అనాసక్తి


చింతపల్లిలో వైద్యుల నివాస గృహ సముదాయం రెండేళ్లుగా అసంపూర్తిగా దర్శనమిస్తోంది. బిల్లులు మంజూరుకాక పనులను కాంట్రాక్టరు నిలిపివేశారు. ఎట్టకేలకు బిల్లులు మంజూరైనా పనులు ముందుకుసాగడం లేదు. పనులను పునఃప్రారంభిస్తే ఆ బిల్లులకు మరెంత కాలం వేచి ఉండాలోననే భయంతో కాంట్రాక్టర్‌ పనులు చేపట్టడం లేదని తెలిసింది. దీంతో ఇవి ఎప్పటికి పూర్తవుతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

చింతపల్లి, మే 22: వైద్యులు స్థానికంగా ఉండాలంటే నివాస గృహాలు అందుబాటులో ఉండాలని భావించిన గత టీడీపీ ప్రభుత్వం 2018 ఆఖరులో ఐటీడీఏ ద్వారా చింతపల్లి సబ్‌ డివిజన్‌లో గృహ సముదాయం నిర్మాణానికి రూ.70 లక్షల నిధులు మంజూరుచేసింది. అదే ఏడాది ఈ పనులను కాంట్రాక్టర్‌ ప్రారంభించారు. 2019 ఫిబ్రవరిలో గత ప్రభుత్వం పునాదుల బిల్లు రూ.13 లక్షలు మంజూరుచేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా వసతి గృహం నిర్మాణాలకు ఎటువంటి ఆటంకం తెలపకపోవడంతో కాంట్రాక్టర్‌ నిర్మాణా లను యఽథావిధిగా కొనసాగించారు. 2019 నవంబరు నాటికి అదనంగా రూ.18 లక్షలు పెట్టుబడి పెట్టి రెండు అంతస్థుల భవనం నిర్మించారు. ప్రస్తుతం మరో రూ.39 లక్షలతో మూడో అంతస్థు శ్లాబ్‌, గోడలు, టైల్స్‌, విద్యుత్‌, తలుపులు, కిటికీలు ఏర్పాటు చేయాల్సి వుంది. అయితే ప్రభుత్వం  రెండో విడత బిల్లు రూ.18 లక్షలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులను నిలిపివేశారు. బిల్లుల కోసం గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్‌ అధికారుల ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికి నిధులు విడుదల కాకపోవడంతో రెండేళ్లగా వైద్యుల వసతి గృహం పనులు పునఃప్రారంభించలేదు. 

కాంట్రాక్టర్‌ వెనుకడుగు

రెండేళ్ల నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో వైద్యుల వసతి గృహ సముదాయం నిర్మాణాలకు సంబంధించిన బకాయి రూ.18 లక్షల నిధులను మంజూరుచేసింది. అయితే రెండో విడత బిల్లులు చెల్లించేందుకు రెండేళ్ల సమయం పట్టిందని, వడ్డీలు కట్టుకునేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, పెట్టుబడులు పెట్టి భవనం నిర్మాణాలు పూర్తిచేసినా బిల్లులు వస్తాయో, రావోననే సందేహాన్ని కాంట్రాక్టర్‌ వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్‌ ముందుకు రావడంలేదు. అలాగే ప్రభుత్వం నిర్మాణాలకు సంబంధించి కేటాయించిన గడువు సమయం కూడా 2021తోనే ముగిసిపోయింది. 

వసతి సమస్యను ఎదుర్కొంటున్న వైద్యులు

చింతపల్లి సబ్‌ డివిజన్‌ కేంద్రంలో వైద్యుల గృహ సముదాయం నిర్మాణాలు పూర్తికాక పోవడం వల్ల వైద్యులు వసతి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తున్నది. చింతపల్లి, జీకేవీధి మండలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న వైద్యులు చింతపల్లి మండల కేంద్రంలో గృహాలను అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. కొంత మంది వైద్యులకు చింతపల్లిలో అన్ని వసతులు కలిగిన అద్దె గృహాలు కూడా లభించడంలేదు. ఒకవేళ పూర్తి సౌకర్యాలు కలిగిన గృహం లభించినా నెలకు రూ.ఏడు వేల నుంచి రూ.పది వేల అద్దె చెల్లించాల్సి వస్తుంది. 

----

ప్రభుత్వం భరోసా ఇస్తే పనులు పూర్తి చేస్తాం

ప్రభుత్వం బకాయి నిధులు మంజూరుచేస్తామని భరోసా కల్పిస్తే వైద్యుల వసతి గృహ సముదాయ నిర్మాణాలు పూర్తి చేస్తాం. భవనం నిర్మాణాలకు ఇచ్చిన గడువు కూడా పూర్తయింది. నిర్మాణాల గడువు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వాలి. ప్రస్తుతం నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగిపోయాయి. భవన నిర్మాణాలు పూర్తిచేసేందుకు ఎంత ఖర్చు అవుతుందో  నూతనంగా ప్రణాళిక సిద్ధంచేసి, అవసరమైన నిధులు మంజూరుచేయాలి. 

- బీఏ రాజు, కాంట్రాక్టర్‌


Updated Date - 2022-05-23T06:11:17+05:30 IST