ప్రమాదాలకు అడ్డాగా నల్లకుంట చౌరస్తా

ABN , First Publish Date - 2022-05-27T04:47:15+05:30 IST

ల్లా కేంద్రంలోని రాజీవ్‌మార్గ్‌లో ఉన్న నల్లకుంట చౌరస్తా రోడ్డు ప్రమాదాలకు అడ్డాగా మారింది.

ప్రమాదాలకు అడ్డాగా నల్లకుంట చౌరస్తా
గద్వాల పట్టణంలోని నల్లకుంట చౌరస్తా

- ప్రతీ రోజు రెండు, మూడు సంఘటనలు

- ఆందోళన చెందుతున్న వాహనదారులు

గద్వాల క్రైం, మే 26 : జిల్లా కేంద్రంలోని రాజీవ్‌మార్గ్‌లో ఉన్న నల్లకుంట చౌరస్తా రోడ్డు ప్రమాదాలకు అడ్డాగా మారింది. స్పీడ్‌ బ్రేకర్లు లేకపోవడం, వాహన దారులు వేగంగా, అజాగ్రత్తగా వాహనాలు నడపడం అందుకు కారణమని స్థానికులు చెప్తున్నారు. గతంలో విజయమెస్‌ దగ్గర యూటర్న్‌ ఉండేది. ప్రస్తుతం దానిని మూసివేయడంతో ఆదే రోడ్డు చివరలో ఉన్న నల్లకుంట చౌరస్తా మీదుగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. చౌరస్తా నుంచి గంజి రోడ్డు, శ్రీనివాసకాలనీ రోడ్డు, కొత్తబస్టాండ్‌, కృష్ణ వేణి చౌరస్తా, పాతబస్టాండ్‌, గవర్నమెంట్‌ హాస్పిటల్‌ వైపు వెళ్లే రోడ్డున్నాయి. ఆ దారుల్లో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటం, చౌరస్తాలో వాహనదారులు అతివేగంతో, అజాగ్రతగా మళ్లుతుండడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. హాస్పిటల్‌ రోడ్డులోనే లారీల అడ్డా కూడా ఉండడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇటీవల ఉమిత్యాల తండాకు చెందిన ఓ మహిళ బైక్‌పై రాజీవ్‌మార్గ్‌వైపు వెళ్తుండగా, కృష్ణవేణి చౌరస్తాకు వైపు వెళ్తున్న బైక్‌ ఢీకొన్నది. దీంతో ఆమెతో పాటు, ఆమె బంధువు గాయపడ్డారు. ఇటీవలే ఓ ఆర్టీసీ బస్సు కూడా వాహనదారుడిని ఢీకొన్నది. 


స్పీడ్‌ బ్రేకర్లను ఏర్పాటు చేయాలి

సురేందర్‌ యాదవ్‌, శ్రీనివాస్‌కాలనీ : నల్లకుంట చౌరస్తాలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు ట్రాఫిక్‌ను గమనించకుండా వేగంగా మళ్లుతుండడంతో ప్రమాదాలు జరుగుతు న్నాయి. ప్రతీ రోజు రెండు, మూడు ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ట్రాఫిక్‌ పోలీసులు స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి.


ట్రాఫిక్‌ పోలీస్‌ అందుబాటులో ఉండాలి 

వెంకటాద్రినాయుడు : నల్లకుంట చౌరస్తాలో ట్రాఫిక్‌ పోలీస్‌ అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. రాజీవ్‌మార్గ్‌తో పాటు ఇతర వైపుల నుంచి వస్తున్న వారు కూడా వాహనాలను జాగ్రత్తగా జడపాలి. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించేలా పోలీసులు చర్యలు తీసు కోవాలి. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేయాలి.


ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం

విజయభాస్కర్‌, ట్రాఫిక్‌ ఎస్‌ఐ : నల్లకుంట చౌరస్తాలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం. ఆర్‌ అండ్‌ బీ అధికారులతో చర్చించి ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేస్తాం. చౌరస్తాలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ విధుల్లో ఉండేలా చర్యలు తీసుకుంటాం. వాహనదారులు కూడా జాగ్రత్తలు పాటించాలి. 

Updated Date - 2022-05-27T04:47:15+05:30 IST