ఏసీబీ డీఎస్పీ అల్లాబక్ష్‌ మృతి

ABN , First Publish Date - 2021-09-17T07:25:32+05:30 IST

తిరుపతి ఏసీబీ డీఎస్పీ అల్లాబక్ష్‌ (48) అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు.

ఏసీబీ డీఎస్పీ అల్లాబక్ష్‌ మృతి
అల్లాబక్ష్‌ (ఫైల్ ఫొటో)

తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 16: తిరుపతి ఏసీబీ డీఎస్పీ అల్లాబక్ష్‌ (48) అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు. చాలా కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనారోగ్య సమస్యలు మరింత తీవ్రతరం కావడంతో గురువారం వేకువజామున మృతిచెందారు. ఆయన భౌతిక కాయాన్ని ఎంఆర్‌పల్లెలోని పోలీసు పరేడ్‌ మైదానానికి తరలించారు. అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, అదనపు ఎస్పీలు సుప్రజ, ఆరీఫుల్లా, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది నివాళులర్పించారు. ఆయన భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పోలీసు శాఖ తరపున సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. అంకితభావంతో ఆయన విధులు నిర్వర్తించారని, మంచి అధికారిగా గుర్తింపు పొందారని ఎస్పీ తెలిపారు. క్రమశిక్షణ, నిజాయితీతో పనిచేయడంతోపాటు కిందిస్థాయి సిబ్బందితో స్నేహపూర్వకంగా మెలిగారంటూ ఆయన పనితీరును గుర్తు చేసుకున్నారు. 


రాయచోటిలో అంత్యక్రియలు

కడప జిల్లా రాయచోటికి చెందిన అల్లాబక్ష్‌ 1992 బ్యాచ్‌లో పోలీసు శాఖకు ఎంపికయ్యారు. అప్పట్నుంచి జిల్లాలోని వివిధ ప్రదేశాల్లో, అనేక హోదాల్లో పనిచేశారు. తిరుపతి ఏసీబీ డీఎస్పీగా పనిచేస్తూ అసువులు బాశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వెస్ట్‌ డీఎస్పీ నరసప్ప, ఏఆర్‌ డీఎస్పీ నందకిషోర్‌, ఆర్‌ఐలు రెడ్డప్పరెడ్డి, చద్రశేఖర్‌, తదితర అధికారులు, సిబ్బంది ఆయనకు నివాళులర్పించినవారిలో ఉన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీసు గౌరవవందనంతో అల్లాబక్ష్‌ అంత్యక్రియలు ఆయన స్వస్థలం కడప జిల్లా రాయచోటిలో నిర్వహించారు. 



Updated Date - 2021-09-17T07:25:32+05:30 IST