బ్రాండ్‌బాజా..!

ABN , First Publish Date - 2020-06-07T07:14:31+05:30 IST

ఓవైపు సంపూర్ణ మద్య నిషేధం దిశగా అడుగులు అంటూనే మరోవైపు స్థానికంగా అడ్డమైన బ్రాండ్ల మద్యాన్ని విక్రయించి ప్రభుత్వం సొమ్ము చేసుకుంటోంది.

బ్రాండ్‌బాజా..!

విజయవాడ, ఆంధ్రజ్యోతి : ఓవైపు సంపూర్ణ మద్య నిషేధం దిశగా అడుగులు అంటూనే మరోవైపు స్థానికంగా అడ్డమైన బ్రాండ్ల మద్యాన్ని విక్రయించి ప్రభుత్వం సొమ్ము చేసుకుంటోంది. ఇంకోవైపు అధికార పార్టీ నేతలేమో స్థానికంగా దొరకని మెక్‌డోవెల్స్‌, ఇంపీరియల్‌ బ్లూ వంటి ఖరీదైన బ్రాండ్లను ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తెచ్చి, ఇక్కడ అధిక ధరలకు అమ్మి, కోట్ల రూపాయలు జేబులో వేసుకుంటున్నారు. శుక్రవారం పెనమలూరు నియోజకవర్గంలో జరిగిన ఉదంతమే దీనికి నిదర్శనం.


రూ.కోట్లలో అమ్మకాలు

రాష్ట్రంలో మద్య నిషేధం పేరుతో పాపులర్‌ బ్రాండ్లను అందుబాటులో లేకుండా చేయడంతో స్థానికంగా గిరాకీ ఏర్పడింది. దీంతో జిల్లావ్యాప్తంగా పలువురు అధికార పార్టీ నేతలు అక్రమ మద్యం వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. అలాంటి వారిలో పెనమలూరు నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేత ముఖ్య అనుచరుడూ ఉన్నారు. సదరు అనుచరుడిది ఉప్పులూరు. ఈయన సుమారు 6 నెలలుగా పెద్ద ఎత్తున అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనే సుమారు రూ.5 కోట్ల విలువైన మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. శుక్రవారం పట్టుబడిన మద్యం కూడా ఈయనదేనని తెలుస్తోంది. అయితే, అధికార పార్టీ నేత ఒత్తిడితో ఆయన్ను పక్కకు తప్పించి మరో చోటా నాయకుడిని నిందితుడిగా చూపారన్న ఆరోపణలు వస్తున్నాయి.


అధికార పార్టీ నేత అనుచరుడు జిల్లాలోని ఓ ఆలయ పాలకమండలి సభ్యుడిగా ఉన్నారు. ఆయన భార్య కంకిపాడు ఎంపీపీ అభ్యర్థి. ఇవన్నీ అధికార పార్టీ నేత ఆశీస్సులతోనే లభించినట్లు సమాచారం. ఈయన కనుసన్నల్లో పెనమలూరు నియోజకవర్గంతో పాటు విజయవాడ నగరవ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్యం మాఫియా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న మద్యాన్ని విక్రయిస్తోంది. పాపులర్‌ బ్రాండ్లను దిగుమతి చేసుకుని వాటిని స్థానికంగా ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా రెట్టింపు, అంతకంటే ఎక్కువ ధరలకు విక్రయించి జేబులు నింపుకొంటున్నారు. వీరి నెలవారీ ఆదాయం రూ.3 కోట్ల పైచిలుకేనని సమాచారం. 


సూత్రధారి ఎవరు..?

పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు పోలీసుస్టేషన్‌ పరిధి మంతెన గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన  సుమారు రూ.20 లక్షల విలువైన మద్యాన్ని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో స్థానిక వైసీపీ నాయకుడు వీరంకి వెంకటరమణను ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. అతనితో పాటు కొండపల్లి ఆనంద్‌, షేక్‌ మహబూబ్‌ సుభానీ, షేక్‌ రఫీని కూడా నిందితులుగా పేర్కొన్నారు. వెంకటరమణ వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటాడని పోలీసులు తమ రిపోర్టులో పేర్కొన్నారు. వ్యవసాయ కూలీగా పనిచేసే వ్యక్తికి సుమారు రూ.20 లక్షలు పెట్టుబడిగా పెట్టి అక్రమ మద్యం తెచ్చే స్థోమత ఉంటుందా.. అన్నది ప్రశ్న. వాస్తవానికి ఈ అక్రమ మద్యం రాకెట్‌ వెనుక నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేత, ఆయన ముఖ్య అనుచరుడు సూత్రధారులని సమాచారం.

Updated Date - 2020-06-07T07:14:31+05:30 IST