సారొచ్చినా ఆబ్సెంటే!

ABN , First Publish Date - 2022-08-17T06:18:42+05:30 IST

మంగళవారం నుంచి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ముఖ ఆధారిత హాజరు విధానం ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తోంది.

సారొచ్చినా ఆబ్సెంటే!
చాట్రాయి ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం ఇస్తున్న ఉపాధ్యాయులు

వందల సంఖ్యలో హాజరైనా స్వల్పంగానే నమోదు

ఉపాధ్యాయులకు చుక్కలు చూపిన యాప్‌

తొలిరోజే మొరాయించిన ముఖ ఆధారిత హాజరు యాప్‌

 ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం


మంగళవారం నుంచి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన  ముఖ ఆధారిత హాజరు విధానం ఉపాధ్యాయులను  ఇబ్బందులకు గురి చేస్తోంది. సర్వర్‌ పనిచేయకపోవడంతో పలువురు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. తొలిరోజు సర్వర్‌ పనిచేయక వందల సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయుల హాజరు రెండంకెలకే పరిమితమైంది. ముదినేపల్లిలోని ఒక పాఠశాలలో ఒక్కరి హాజరు కూడా నమోదు కాకపోవడం విశేషం. ప్రభుత్వం తమపై కక్ష సాధింపునకే ఈ విధానం ప్రవేశపెట్టిందని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


చాట్రాయి, ఆగస్టు 16: ప్రభుత్వం మంగళవారం నుంచి అమల్లోకి తెచ్చిన ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరు విధానం సర్వర్‌ పనిచేయకపోవటంతో తొలిరోజే విఫలమైంది. మండలంలో 190 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా కేవలం 20 మంది మాత్రమే హాజరు నమోదు చేసుకోగలిగారు. పూర్తిస్థాయి నెట్‌వర్క్‌ అభివృద్ధి చేయకుండా ఈ విధానం అమలు చేయటం అనాలోచిత చర్య అని, యాప్‌ల పని వల్ల  భారం ఎక్కువై విద్యా బోధనకు ఆటంకం కలుగుతున్నదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముసునూరు:  మంగళవారం ఉదయం 8 గంటలకు పాఠశాలకు చేరుకున్న ఉపాఽధ్యాయులకు, సర్వర్‌ డౌన్‌లో ఉండటంతో యాప్‌ ఓపెన్‌ కాక  మండలంలో ఉన్న 265 మంది ఉపాధ్యాయులకు గాను 20 మంది మాత్రమే హాజరు వేశారు. అయితే సాయంత్రం స్కూల్స్‌ వదిలిన తరువాత కూడా యాప్‌ పని చేయకపోవటంతో ఉపాధ్యాయుల కష్టాలు వర్ణనాతీతం.  ఉపాధ్యా యులపై కక్ష సాధించేందుకే ప్రభుత్వం ఈ యాప్‌ను తీసుకువచ్చిందని పలు యూనియన్‌ల నాయకులు మండిపడుతున్నారు.

నూజివీడు టౌన్‌:  నూజివీడు మండల పరిధిలో మొత్తం 93 ప్రభుత్వ పాఠశాలలు వుండగా, ఇందులో 412 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అయితే 99 శాతం హాజరు నమోదు కాని పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయ సంఘాలు ప్రత్యేక యాప్‌పై పెదవి విరుస్తున్నాయి.

ఆగిరిపల్లి: ఉపాధ్యాయుల ముఖ ఆధారిత ఆన్‌లైన్‌ హాజరు విధానం దారుణంగా ఉందని  ఎస్టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు అంకం వెంకటేశ్వరరావు, మక్కే వేణుగోపాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు యాప్‌లో హాజరు వేయకపోతే ఆ రోజుకు ఆబ్సెంట్‌ అని చెప్పడం దారుణమన్నారు. అనుకోని పరిస్థితుల్లో ఆలస్యమై ఆబ్సెంట్‌ పడితే ఉపాధ్యాయుడు ఇంటికి వెళ్లిపోతే ఏకోపాధ్యాయ పాఠశాలల పరిస్థితి ఏమిటని   ప్రశ్నించారు. మారుమూల ప్రాంతాలలో సిగ్నల్‌ లేక  అటెండెన్స్‌ కేప్చర్‌  కాక అనేకమంది ఉపాధ్యాయులు మానసిక వేదనకు గురవతున్నారని ఇది బోదనపై ప్రత్యక్ష ప్రభావం చూపి, ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరదన్నారు. ప్రభుత్వం ఈ విధానంలో ఉన్న లోపాలను  గుర్తించి ప్రతి పాఠశాలకు వైఫై కనెక్షన్‌ ఇచ్చి ఒక డివైజ్‌ను అందించి ఆన్‌లైన్‌ అటెండెన్స్‌లో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించాలని కోరారు.


ట్యాబులు ప్రభుత్వమే సరఫరా చేయాలి



చాట్రాయి, ఆగస్టు 16: కొత్తగా అమల్లోకి తెచ్చిన ముఖ హాజరు విధానం కోసం ప్రభుత్వమే ట్యాబులు ఇచ్చి, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలని మండలంలోని పలువురు ఉపాధ్యాయులు మంగళవారం ఎంపీడీవో, ఎంఈవో కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేశారు. ఇప్పటికే ఉన్న  యాప్‌లతో పనిభారం ఎక్కువై ఇబ్బందుల పడుతున్నామని దీనికి కొత్తగా ఈ యాప్‌ తోడైందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధ్యాయలు ఆర్‌. నాగేశ్వరరావు, రత్తయ్య, వెంకటేశ్వరావు, రాము, అమరయ్య, సత్యనారాయణరెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-17T06:18:42+05:30 IST