వాగులో అక్రమ నిర్మాణం!

ABN , First Publish Date - 2022-09-10T07:17:25+05:30 IST

మండల పరిధిలోని చెక్కపల్లిలోని అంబేడ్కర్‌ కాలనీ సమీపాన ఉన్న వాగులో అక్రమ నిర్మాణం జరుగుతు న్నా అధికారులు పట్టించుకోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతు న్నాయి.

వాగులో అక్రమ నిర్మాణం!
చెక్కపల్లి వాగులో జరుగుతున్న అక్రమ నిర్మాణం

ముంపు భయంలో కాలనీవాసులు

ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు?


ముసునూరు, సెప్టెంబరు 9: మండల పరిధిలోని చెక్కపల్లిలోని  అంబేడ్కర్‌ కాలనీ సమీపాన ఉన్న వాగులో అక్రమ నిర్మాణం జరుగుతు న్నా అధికారులు పట్టించుకోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతు న్నాయి. ఒక వ్యక్తి వాగు మధ్యలో పిల్లర్లు వేసి, స్లాబ్‌ పోసి దానిపై షాప్‌ కట్టేందుకు పనులు చేపట్టాడని, అయితే కొద్దిపాటి వర్షానికే ఈ వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని, ఈ అక్రమ కట్టడం వల్ల సుమారు 50 కుటుంబాలు నివాసం ఉంటున్న అంబేడ్కర్‌ కాలనీ ముంపునకు గురవు తుందని కాలనీవాసులు, స్ధానికులు వాపోతున్నారు. స్ధానిక పెద్ద చెరువుకు నీరు వెళ్ళే ఈ వాగులో షాపు నిర్మాణం చేయవద్దని  ఆ వ్యక్తికి చెప్పిన వినకపోవటంతో ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళామని, నేటికీ పట్టించుకున్న నాథుడే లేడని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా వాగులో అక్రమ నిర్మాణాన్ని తక్షణమే తొలగించేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అంబేడ్కర్‌ కాలనీవాసులు, గ్రామస్ధులు కోరుతున్నారు.


 రెండు రోజుల్లో తొలగిస్తాం   

చెక్కపల్లి వాగులో అక్రమ నిర్మాణంపై స్ధానికుల నుంచి ఫిర్యాదు వచ్చింది. షాపు నిర్మాణం చేస్తున్న వ్యక్తికి పనులు నిలిపేయమని చెప్పాం. అయినా అతను దొంగచాటుగా నిర్మాణం చేస్తున్నాడు. రెవెన్యూ, పోలీస్‌ అధికారుల సహాయంతో రెండు రోజుల్లో అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తాం.


–సలీం, ఇరిగేషన్‌ ఏఈ, ముసునూరు మండలం

Updated Date - 2022-09-10T07:17:25+05:30 IST