సాగునీటి సంఘాల రద్దు

ABN , First Publish Date - 2020-08-04T10:24:58+05:30 IST

రద్దుల జాబితాలో సాగునీటి సంఘాలూ చేరిపోయాయి. వీటిని రద్దు చేస్తూ ప్రభుత్వం జీఓ నెంబర్‌ 31ని సోమవారం విడుదల చేసింది.

సాగునీటి సంఘాల రద్దు

ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

 ప్రత్యేకాధికారులుగా ఇంజినీరింగ్‌ సిబ్బంది


 (విజయనగరం-ఆంధ్రజ్యోతి):రద్దుల జాబితాలో సాగునీటి సంఘాలూ చేరిపోయాయి. వీటిని రద్దు చేస్తూ ప్రభుత్వం జీఓ నెంబర్‌ 31ని సోమవారం విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూషన్‌ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలను రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సంఘాల వద్ద ఉన్న రికార్డులను ఇంజినీరింగ్‌ అధికారులకు అప్పగించాలని ఆదేశించింది. వీటి పేరును ఆంధ్రప్రదేశ్‌ ఫార్మర్స్‌ మేనేజ్‌మెంట్‌ ఇరిగేషన్‌ సిష్టంగా మార్పు చేస్తూ ఆదేశాలిచ్చింది. సాగునీటి సంఘాల చట్టం 1997లో వచ్చింది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, పది నుంచి 12మంది సభ్యులు ఉండేవారు. అప్పట్లో ఎన్నికలు నిర్వహించి సంఘాలను ఏర్పాటు చేశారు. తరువాత మళ్లీ 2015-16 ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించారు. అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించలేదు. ప్రస్తుతం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, నలుగురు సభ్యులతో కూడిన నామినేటెడ్‌ సంఘాలున్నాయి. వీటిని ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే అవకాశం లేనందున ప్రత్యేక అధికారులను నియమించింది. ఇప్పటికే ప్రత్యేక అధికారులతో నెట్టుకు వస్తున్న గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, మున్సిపాలిటీల సరసన సాగునీటి సంఘాలు చేరాయి. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఫార్మర్స్‌ మేనేజ్‌మెంట్‌ ఇరిగేషన్‌ సిష్టం(ఏపీఎఫ్‌ఎమ్‌ఐఎస్‌) పేరుతో సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు.  


 ప్రస్తుతం ప్రత్యేక అధికారులే

కోవిడ్‌ కారణంగా ప్రస్తుతం ఎటువంటి ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితి లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏపీఎఫ్‌ఎమ్‌ఐఎస్‌లకు ప్రత్యేక అధికారులను నియమించే ఏర్పాట్లు చేసింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొంది. ప్రత్యేక అధికారులు సాగునీటి సాంఘాల వద్ద ఉన్న రికార్డులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. నీటి పారుదల శాఖ డీఈలను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. డిస్ట్రిబ్యూటరీ కమిటీల విధులను నిర్వర్తించేందుకు ప్రత్యేక అధికారులుగా ఎగ్జిక్యూటివ్‌ ఇంజీనీర్లను(ఈఈ) నియమించింది. నీటి పారుదల శాఖ ఎస్‌ఈలను ప్రాజెక్టు కమిటీలకు ప్రత్యేక అధికారులుగా నియమించింది. 


 జిల్లాలో వట్టిగెడ్డ, జంఝావతి, తోటపల్లి బ్యారేజీ, వెంగళరాయసాగర్‌, పెద్దగెడ్డ, ఆండ్ర, తాటిపూడి జలాశయాలు ఉన్నాయి. ఇందులో జంఝావతి, తోటపల్లి సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్న కారణంగా అప్పట్లో కమిటీలు ఏర్పాటు కాలేదు. 

 

మక్కువ మండలంలో వెంగళరాయ సాగర్‌ ఉంది. దీని పరిధిలో 10 డిస్ట్రిబ్యూటరీ సంఘాలు, ఒక ప్రాజెక్టు కమిటీ ఉంటుంది.  - జియ్యమ్మవలస మండలం వట్టిగెడ్డ పరిధిలో 8 డిస్ట్రిబూటరీ సంఘాలు, ఒక ప్రాజెక్టు కమిటీ ఉన్నాయి. పెద్దగెడ్డ పరిధిలో నాలుగు డిస్ట్రిబ్యూటరీ సంఘాలు... ఒక ప్రాజెక్టు కమిటీ, తాటిపూడి పరిధిలో ఆరు డిస్ట్రిబ్యూటరీలు, ఒక ప్రాజెక్టు కమిటీ ఉన్నాయి. 


 కొత్తవలస, పెదకంకాలం, సురాపాడు, మక్కువ మండలంలోని గొలుసులమెట్ట ఇలా మరి కొన్ని చిన్న సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో సంఘాలు ఉన్నాయి. 


సాగునీటి చెరువుల పరిధిలో 600పైబడి సాగునీటి సంఘాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ జీవోతో సాగునీటి సంఘాలన్నీ రద్దయినట్టే.  

 

మాకు ఎటువంటి ఆదేశాలు లేవు

 సాగునీటి సాంఘాల స్థానే ప్రత్యేక అధికారుల నియామకం విషయాన్ని బొబ్బిలి ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ కె.రాంబాబు వద్ద ప్రస్తావించగా తమకు ఇంకా ఎటువంటి ఆదేశాలు లేవని చెప్పారు. సర్కిల్‌లో సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలు ఎన్ని ఉన్నదీ రికార్డులు పరిశీలిస్తేనే కానీ చెప్పలేమని స్పష్టం చేశారు. 


Updated Date - 2020-08-04T10:24:58+05:30 IST