వెల్లుల్లి రసం

ABN , First Publish Date - 2017-07-01T18:15:40+05:30 IST

కావలసినవి వెల్లుల్లి రెబ్బలు (నలిపి) - పది, చింతపండు - అర టేబుల్‌ స్పూన్‌, ఎండుమిర్చి - రెండు లేదా రుచికి సరిపడినన్ని, నల్లమిరియాలు - అర టీస్పూన్‌, ధనియాలు

వెల్లుల్లి రసం

కావలసినవి
వెల్లుల్లి రెబ్బలు (నలిపి) - పది, చింతపండు - అర టేబుల్‌ స్పూన్‌, ఎండుమిర్చి - రెండు లేదా రుచికి సరిపడినన్ని, నల్లమిరియాలు - అర టీస్పూన్‌, ధనియాలు - ఒక టీస్పూన్‌, పచ్చిశెనగపప్పు, జీలకర్ర - ఒక్కోటి అర టీస్పూన్‌ చొప్పున, కరివేపాకులు - కొన్ని, నూనె - రెండు టీస్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత.
తాలింపులోకి: ఆవాలు - అర టీస్పూన్‌, కరివేపాకు - కొంచెం, నెయ్యి - ఒక టీస్పూన్‌.
 
తయారీ విధానం
చింతపండుని ఒక కప్పు గోరువెచ్చని నీళ్లలో పదినిమిషాలు నానబెట్టాలి. తరువాత చేతితో పిండి రసాన్ని వడకట్టాలి.
ఒక టీస్పూన్‌ నూనెని చిన్న పాన్‌లో వేసి సన్నటి మంట మీద వేడిచేయాలి. తరువాత ఎండుమిర్చి, నల్లమిరియాలు, ధనియాలు, పచ్చిశెనగపప్పు వేసి దాదాపు రెండు నిమిషాలు వేగించాలి.
ఇవి బాగా చల్లారాక గ్రైండర్‌ జార్‌లో వేసి జీలకర్ర, కరివేపాకులు, రెండు టేబుల్‌ స్పూన్ల నీళ్లు పోసి కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేయాలి.
మరో టీస్పూన్‌ నూనెని సన్నటి మంట మీద వేడిచేసి వెల్లుల్లి రెబ్బలను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించి ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టాలి.
తీసిపెట్టుకున్న చింతపండు రసంలో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి పెద్దగిన్నెలో పోయాలి. ఇందులో ఉప్పు వేసి ఓ మాదిరి మంట మీద ఉడికించాలి. ఉడుకుపట్టగానే మంట తగ్గించి సన్నటి మంట మీద ఎనిమిది నిమిషాలు ఉంచాలి. లేదా చింతపండు పచ్చి వాసన పోయే వరకు ఉడికించాలి.
తరువాత వేగించిన వెల్లుల్లి రెబ్బలను, కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేసిన మిశ్రమాన్ని వేసి ఒక కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. మరో మూడు నిమిషాలు ఉడికించి స్టవ్‌ మీద నుంచి గిన్నె దింపి పక్కన పెట్టాలి.
సన్నటి మంటమీద తాలింపు గిన్నె పెట్టి నెయ్యి వేడిచేయాలి. అందులో ఆవాలు వేసి చిటపటమనేవరకు ఉంచాలి. తరువాత కరివేపాకులు వేసి కొంచెం వేగించి స్టవ్‌ ఆపేయాలి. దీన్ని తయారైన రసంలో పోసి వడ్డించే గిన్నెలోకి రసాన్ని మార్చాలి. హాట్‌ అండ్‌ స్పైసీ వెల్లుల్లి రసాన్ని తింటుంటే కారంగా, ఘాటుగా, పుల్లగా భలే
భలేగా ఉంటుంది.

Updated Date - 2017-07-01T18:15:40+05:30 IST