Mekapati కోటకు బీటలు.. చక్రం తిప్పుతున్న ‘చిన్న రాణి’.. రహస్యాలు బట్టబయలు.. రాబోయే ఎన్నికల్లో..!

ABN , First Publish Date - 2021-08-03T18:24:54+05:30 IST

రాజులు, రాజ్యాలు ఉన్నప్పుడు అంతఃపుర రహస్యాలపై జనం భయం ఓ వైపు భయం భయంగా...

Mekapati కోటకు బీటలు.. చక్రం తిప్పుతున్న ‘చిన్న రాణి’.. రహస్యాలు బట్టబయలు.. రాబోయే ఎన్నికల్లో..!

రాజులు, రాజ్యాలు ఉన్నప్పుడు అంతఃపుర రహస్యాలపై  జనం భయం ఓ వైపు భయం భయంగా ఉంటూనే చెప్పుకోవాల్సిన ముచ్చట్లపై  గుసగుసలు గుప్పించుకునేవారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. తరతరాలుగా నియోజకవర్గాలను ఏలుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే ఆ ప్రాంతాల అప్రకటిత రాజులుగా, రాణులుగా చలామణి అవుతున్నారు. దశాబ్దాలుగా రాజకీయ చక్రం తిప్పుతున్న ఓ కుటుంబ వ్యవహారం ఇప్పుడు అంతఃపుర రహస్యాల కథను తలపిస్తోంది. జనంలో గుసగుసల స్థాయిదాటి విమర్శల జడివాన కురుస్తోంది. చిన్న రాజాగారి చిన్నిళ్లు ముచ్చట కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. ఇంతకీ ఎవరా చిన్నరాజావారు. ఆ చిన్నరాణిగారి కథ ఎంటో.. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం. 


కరువైన ప్రశాంతత..!

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పే మేకపాటి కుటుంబ సభ్యులకు ప్రశాంతత కరువైపోతోందట. వారి ఉదయగిరి కోటలో పాగా వేసేందుకు చిన్నరాణిగారు చక్రం తిప్పుతుండటంతో అసలు సిసలు వారసులు తల్లడిల్లిపోతున్నారట. ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థులను మట్టికరిపించి జిల్లా రాజకీయాలను శాసించే మేకపాటి కుటుంబం సొంత ఉదయగిరి సామ్రాజ్యంలో ఇంటిపోరుతో సతమతమవుతోందట.


చిన్నసారు చిన్న కాపురం!

మేకపాటి రాజమోహన్‌రెడ్డి కాంట్రాక్టర్‌గా డబ్బులు సంపాదించి రాజకీయాల్లోకి వచ్చి పేరు సంపాదించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా చక్రం తిప్పారు. అన్నగారి రాజకీయాలు అన్నీ దగ్గరుండి చూసుకునే చంద్రశేఖర్‌రెడ్డి మేకపాటి క్యాడర్‌ మొత్తాన్ని కంట్రోల్‌ చేసేవారు. కార్యకర్తలు, అభిమానుల ఇళ్లల్లో జరిగే కార్యక్రమాలకు మేకపాటి ప్యామిలీ తరఫున చంద్రశేఖరరెడ్డి హాజరయి మంచిచెడులు చూసుకునేవారు. ప్రస్తుతం ఉదయగిరి ఎమ్మెల్యేగా చంద్రశేఖరరెడ్డి కొనసాగుతున్నారు. అయితే చిన్నసారు ఎక్కడెక్కడో దాచుకుంటూ వచ్చిన చిన్న కాపురం అటుతిరిగి ఇటు తిరిగి తాజాగా మేకపాటి కోటలోకి ప్రవేశించి చక్రం తిప్పుతుండటంతో రాజకీయ ప్రకంపనలు వస్తున్నాయట.


ఎంట్రీ ఇచ్చేసిన శాంతమ్మ!

శాంతమ్మ డైరెక్ట్‌గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఉదయగిరి నేతలంతా ఆమె వద్దకే పరుగులు తీయడం మొదలెట్టారు. ప్రతి పనికీ రేటు కట్టి ఆమె వసూలు చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. రూ.అయిదువేలు వంటి చిన్నమొత్తాలు కూడా తీసుకుంటున్నారనే అవినీతి మరకలు అంటుతున్నాయి. పార్టీ పదవులు ఇవ్వడానికీ పెద్ద మొత్తాల్లో డబ్బులు వసూలు చేస్తున్నారట అనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. సామంతరాజుల్లా మండలానికి ఒక్కో నేతని ఏర్పాటు చేసి మరీ వసూళ్లు జరుగుతున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి.  రాజ్యం, రాజు, చిన్నరాణి, సామంతరాజులు అన్నట్టుంది పాలన... అంటూ పలువురు పెదవి విరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎవరు అవునన్నా... మరెవరు కాదన్నా శాంతమ్మ ఎమ్మెల్యేగా పోటీచేయబోతుందనే చర్చలూ సాగుతున్నాయి. ఉదయగిరిలో పనుల కోసం రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి.. అనుచరులకు పనులు చేసిపెట్టాలని అధికారులకు సూచిస్తే వారు అప్పటికే చిన్నరాణిగారు వేరేవారికోసం చెప్పారని చెప్పాల్సివస్తుందట.


మొన్నటి వరకు హైదరాబాద్‌లో..!

కుటుంబ వ్యవహారాలు, మేకపాటి రాజకీయ వ్యవహారాలు అన్నీ చూసుకునే శేఖర్ రెడ్డి కొన్నేళ్ల కిందట శాంతమ్మపై మనస్సు పారేసుకున్నారట. వయస్సులో చాలాచిన్నదైనా ఒప్పించి చాటుగా పెళ్లి కూడా చేసుకున్నారని చెబుతారు. మొన్నటి ఎన్నికల ముందు వరకు హైదరాబాదులోనే కాపురం పెట్టారట. ఇంట్లో తెలిసినా... తెలియనట్టు ఉంటుండేవారట. శాంతమ్మ, కుమార్తె సాయి ప్రేమితరెడ్డిని సొంత మండలమైన మర్రిపాడుకి తీసుకువచ్చారు. దూంధాంగా పదేపదే ఫంక్షన్లు నిర్వహించి, తన భార్య, కుమార్తె అని అందరికీ పరిచయం కూడా చేశారు.


పెత్తనమంతా చిన్నరాణిదే!

ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రశేఖర్‌ రెడ్డి నుంచి పెత్తనమంతా చిన్నరాణి శాంతమ్మగారి చేతిలోకి వెళ్లిపోయిందట. రాజ్యాలు, రాజులు, రాణులు, సామంతరాజుల తరహా పాలన మొదలైందట. కుటుంబ సభ్యుల మధ్య స్థల వివాదం పెద్ద చర్చకే దారితీసింది. మేకపాటి అనుచరులు రెండు, మూడు వర్గాలుగా చీలిపోతున్నారు.ఈ రచ్చ చాలదన్నట్లు మేనల్లుడు బిజివేముల రాస్తున్న బహిరంగ లేఖలు మేకపాటి పరువు ప్రతిష్టలకి భంగం చేకూరుస్తున్నాయట. పాపం పెద్దాయన రాజమోహన్‌రెడ్డి పరువు కోసం మౌనంగా ఉండాల్సివస్తోందట.


ఇదే జరిగితే పరిస్థితేంటో..!?

ఉదయగిరిలో జరుగుతున్న వ్యవహారాలను గమనిస్తున్న పెద్దాయన రాజమోహన్‌రెడ్డి, మంత్రి గౌతమ్‌రెడ్డి క్యాడర్‌ను ఓపికపట్టాలని చెబుతున్నారట. వచ్చే ఎన్నికల్లో రాజమోహన్‌రెడ్డి చిన్నకొడుకు పృథ్వీరెడ్డిని బరిలో నిలిపేలా గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం సాగుతోందనే టాక్ వస్తోంది. ఇదే జరిగితే చంద్రశేఖర్‌ రెడ్డి ఎలా వ్యవహరిస్తారోననే చర్చలు కూడా మొదలయ్యాయట.


పెద్ద ఫ్యామిలీ ఎంటరవ్వడంతో..!

రాజకీయాల్లోనే కాదు ఆస్తుల్లోనూ వాటా కోసం కొట్లాటలు మొదలయ్యాయట. మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా ఉన్న  పద్దెనిమిది ఎకరాల భూమిపై చంద్రశేఖరరెడ్డి చిన్న భార్య శాంతమ్మ, ఆమె కుమార్తె సాయి ప్రేమితరెడ్డి పేరుతో బోర్డు వెలియడంతో పెద్ద ప్యామిలీ ఎంటరైంది. చంద్రశేఖరరెడ్డి అసలు భార్య తులశమ్మ, కూతురు రచన రంగంలోకి దిగి శాంతమ్మ పెట్టించిన బోర్డు పెరికేయించి ఆ స్థలంలో తాతగారి పేరు, వారి కుటుంబ సభ్యుల పేర్లతో బోర్డు పెట్టించింది. శాంతమ్మ, కుమార్తె సాయిప్రేమితరెడ్డి మర్రిపాడులో ఉండటానికి లేదని గట్టిగా చెప్పడంతో, ఇటీవల వారిని కొన్నాళ్లు బద్వేలులో ఉంచారు. అక్కడ నుంచి మునిపటిలా హైదరాబాదుకి పంపించారని చెబుతున్నారు.


ఇంతకీ.. ఏపీలోనా.. తెలంగాణలోనా..!?

కుటుంబ వ్యవహారం కాస్తా వైసీపీ క్యాడర్‌ వర్గవర్గాలుగా విడిపోయేలా చేస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా ప్రతిపక్షాలు ఈ వ్యవహారాన్ని తమ అస్త్రంగా వాడుకుంటున్నాయి. గతంలో ఉదయగిరి ఎమ్మెల్యేగా పనిచేసిన బొల్లినేని రామారావు కలిగిరి కేంద్రంగా రాజకీయాలు నడిపేవారు. అప్పట్లో రామారావును కలిగిరికి ఎమ్మెల్యే అని చంద్రశేఖరరెడ్డి ఎద్దేవా చేశారు. కుటుంబంలో వచ్చిన మార్పులతో చంద్రశేఖరరెడ్డి  మర్రిపాడు, బద్వేలు, హైదరాబాద్‌లో ఉంటుండటంతో తెలుగుదేశం నేతలు కౌంటర్లు వేస్తున్నారట. చంద్రశేఖరరెడ్డి తెలంగాణలో ఎమ్మెల్యేనా? అని విమర్శిస్తున్నారట. పనుల కోసం పక్క రాష్ట్రం పోవాలా..? అని ఎద్దేవా చేస్తున్నారట.


రాబోయే ఎన్నికల్లో..!

ఇదంతా ఓ ఎత్తైతే... మేకపాటి రాజమోహన్ రెడ్డికి స్వయాన మేనల్లుడైన బిజివేముల రవీంధ్రనాధ రెడ్డి వరసగా బహిరంగ లేఖలు రాస్తున్నారు. మేకపాటి కుటుంబీకులు చేసే తప్పులని అందులో ప్రస్తావిస్తున్నారు. శాంతమ్మ వ్యవహారంపై ఏడవ బహిరంగ లేఖని విడుదల చేశారు. రవీంధ్రనాధ రెడ్డి రాస్తున్న బహిరంగ లేఖలూ మేకపాటి వారికి పెద్ద తలనొప్పిగానే మారాయి. మొత్తం మీద.. ఉదయగిరి నుంచి రాబోయే ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి సోదరుడు ఫృద్వీరెడ్డి పోటీచేస్తారని మేకపాటి వర్గీయులు చెబుతున్నారు. శాంతమ్మ ఈ సారి ఖచ్చితంగా పోటీచేస్తారని మరో వర్గం అంటున్నారు. రాబోయే రోజుల్లో రాజు ఎవరో?... రాణి ఎవరో?.. మంత్రి ఎవరో?.. సామంతులెవరో? అని ఉదయగిరి జనం అనుకుంటున్నారట.

Updated Date - 2021-08-03T18:24:54+05:30 IST