ఆసరాపై ఆశలు

ABN , First Publish Date - 2021-10-19T05:40:34+05:30 IST

కొత్త ఆసరా ఫించన్లపై మళ్లీ ఆశలు మొదలయ్యాయి. ప్రస్తుతం 65 ఏళ్ల వారికి పింఛన్లు అందిస్తుండగా 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 57 ఏళ్లు నిండిన వారందరికీ ఆసరా వర్తింప జేస్తామని టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. రెండేళ్లుగా ఎదురు చూస్తున్న క్రమంలో ఈ ఏడాది ఆగస్టులో జీవో నంబరు 17 జారీ చేశారు.

ఆసరాపై ఆశలు

-  కొత్త పింఛన్లకు నిరీక్షణ 

- ఆగస్టులో పూర్తయిన దరఖాస్తుల స్వీకరణ 

- 14,044 మంది అర్హులుగా గుర్తింపు 

- తాజాగా ఈ నెల 30 వరకు గడవు 

    

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కొత్త ఆసరా ఫించన్లపై మళ్లీ ఆశలు మొదలయ్యాయి. ప్రస్తుతం 65 ఏళ్ల వారికి పింఛన్లు అందిస్తుండగా 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 57 ఏళ్లు నిండిన వారందరికీ   ఆసరా వర్తింప జేస్తామని టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. రెండేళ్లుగా ఎదురు చూస్తున్న క్రమంలో ఈ ఏడాది ఆగస్టులో జీవో నంబరు 17 జారీ చేశారు.  ఆగస్టు వరకు 14,044 మందిని అర్హులుగా గుర్తించి ఆన్‌లైన్‌లో  వివరాలు పొందుపర్చారు. అప్పటివరకు గుర్తించిన 57 ఏళ్లు వయస్సు ఉన్న అర్హులకే వర్తిస్తుందని ఆందోళన చెందుతున్న క్రమంలో ఈ నెల 11 నుంచి 30వ తేదీ వరకు మరోసారి దరఖాస్తులు స్వీకరించడానికి అవకాశం ఇచ్చారు. దీంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల పక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఇచ్చిన అవకాశంతో సోమవారం వరకు 4,367 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 30 వరకు గడువు ఉండడంతో భారీగానే దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్న వారి దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన తరువాత పూర్తిస్థాయిలో పరిశీలించి అర్హుల జాబితాను వెల్లడించనున్నారు. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్న అర్హులతో కేంద్రాలు రద్దీగా కనిపిస్తున్నాయి. 2018 నుంచి అర్హులుగా ఉన్నవారు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. 


 ఆగస్టు వరకు 14,044 మంది అర్హులు 

ఆసరా పింఛన్‌ అర్హతను 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ ప్రకటించిన నేపథ్యంలోనే ఓటరు జాబితా ప్రకారం రెండేళ్ల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 14,044 మంది అర్హులుగా గుర్తించారు. వీటి వివరాలను ప్రస్తుతం అన్‌లైన్‌లో పొందుపర్చారు.  అప్పటికే జిల్లాలో 57 నుంచి 65 ఏళ్ల వయస్సు ఉన్నవారు 35,762 మంది ఉన్నారు. వీరిలో 14044 మందిని అర్హులుగా గుర్తించగా అందులో 7240 మంది పురుషులు, మహిళలు 6804 మంది ఉన్నారు.  ప్రస్తుతం మళ్లీ అవకాశం ఇవ్వడంతో అనేక మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆగస్టు వరకు అర్హులుగా గుర్తించిన వారిలో బోయినపల్లి మండలంలో పురుషులు 602 మంది, మహిళలు 630 మంది, చందుర్తిలో పురుషులు 407, మహిళలు 398, ఇల్లంతకుంటలో పురుషులు 436, మహిళలు 598, కోనరావుపేటలో పురుషులు 502, మహిళలు 750, ముస్తాబాద్‌లో పురుషులు 870, మహిళలు 918, రుద్రంగిలో పురుషులు 205, మహిళలు 366, సిరిసిల్లలో పురుషులు 100, మహిళలు 192, తంగళ్లపల్లిలో పురుషులు 280, మహిళలు 288, వీర్నపల్లిలో పురుషులు 352, మహిళలు 302, వేములవాడలో పురుషులు 351, మహిళలు 403, వేములవాడ మున్సిపాలిటీలో పురుషులు 662, మహిళలు 551, వేములవాడ రూరల్‌లో పురుషులు 300, మహిళలు 279, ఎల్లారెడ్డిపేటలో పురుషులు 753, మహిళలు 576 మందిని అర్హులుగా గుర్తించారు. వీరు రెండేళ్లుగా ఎదురు చూస్తున్న క్రమంలో ఆగస్టులో జీవో జారీ అయ్యింది. ప్రస్తుతం తాజాగా 30 వరకు అవకాశం కల్పించారు. 


రూ 1.34 కోట్ల పింఛన్‌ రికవరీ 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పింఛన్ల అవకతవకలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల ఇంటింటి సర్వే చేపట్టగా 1690 మంది చనిపోయిన  పింఛన్‌ దారుల   ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాట్లుగా గుర్తించారు. వారి ఖాతాల నుంచి రూ.కోటి 34 లక్షల 44 వేల 986 స్వాధీనం చేసుకున్నారు. గుర్తించిన వాటిలో బోయినపల్లి మండలంలో 69 మంది, చందుర్తి 127, ఇల్లంతకుంట 38, గంభీరావుపేట 120, కోనరావుపేట 120, ముస్తాబాద్‌ 98, రుద్రంగి 94, తంగళ్లపల్లి 141, వీర్నపల్లి 41, వేములవాడ రూరల్‌ 94, సిరిసిల్ల మున్సిపాలిటీ 497, వేములవాడ మున్సిపాలిటీలో 190 మందిని గుర్తించి పింఛన్‌ రికవరీ చేశారు. 


జిల్లాలో 1,07,321 మంది పింఛన్‌ దారులు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం 1,07,321 మంది పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ.22 కోట్ల 65 లక్షల 74వేల384  పింఛన్‌ అందిస్తున్నారు.  24,162 మందికి వృద్ధాప్య  పింఛన్లు, 22,169 మందికి వితంతు పింఛన్లు,  9.855 మందికి దివ్యాంగుల పింఛన్లు,  3,598 మందికి చేనేత పింఛన్లు,   2,085 మంది గీత కార్మికులు, 1789 మంది ఒంటరి మహిళలు,  43,173 మంది బీడీ కార్మికులు, 903 మంది  పైలేరియా పింఛన్లు పొందుతున్నారు. 


Updated Date - 2021-10-19T05:40:34+05:30 IST