నామినేషన్ పర్వంలో ఆప్ నయవంచన: సిద్ధూ ఫైర్

ABN , First Publish Date - 2022-03-22T22:12:35+05:30 IST

రాజ్యసభ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపిక చేసిన ఐదుగురు..

నామినేషన్ పర్వంలో ఆప్ నయవంచన: సిద్ధూ ఫైర్

ఛండీగఢ్: రాజ్యసభ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపిక చేసిన ఐదుగురు నామినీలపై ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ నేత నవజ్యోత్ సిగ్ సిద్ధూ మంగళవారంనాడు విమర్శలు గుప్పించారు. మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ మనహాయిస్తే, మిగిలిన నామినేషన్లన్నీ పంజాబ్‌ను దగాచేయడం (బెట్రేయల్ ఆఫ్ పంజాబ్)గా ఆయన అభివర్ణించారు.


ఈనెల 31న జరుగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం మాజీ క్రికెటర్ హర్జజన్ సింగ్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు అశోక్ మిట్టల్, ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, ఐఐటీ ఢిల్లీ ఫ్యాకల్టీ సందీప్ పాఠక్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాలను ఆప్ నామినేట్ చేసింది. ఐదుగురు ఆప్ నామినీలు పంజాబ్ విధాన్ సభ కాంప్లెక్స్‌లో తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. దీనిపై సిద్ధూ తాజాగా ఓ ట్వీట్ చేస్తూ ''ఢిల్లీ రిమోట్ కంట్రోల్‌లో కొత్త బ్యాటరీలు. రిమోట్ కంట్రోల్ మిణుకుమిణుకు మంటోంది. హర్భజన్ మినహాయింపు. మిగిలిన బ్యాటరీలు పంజాబ్‌ను దగా చేసేవే'' అని సిద్ధూ అన్నారు.


ఆప్ రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుఖ్‌దేవ్ సింగ్ థిండ్సా (శిరోమణి అకాలీదళ్), ప్రతాప్ సింగ్ బజ్వా (కాంగ్రెస్), సవిత్ మాలిక్ (బీజేపీ), నరేష్ గుజ్రాల్ (సాద్), శంషేర్ సింగ్ డుల్లో (కాంగ్రెస్) పదవీకాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుంది. కాగా, రాజ్యసభకు ఆప్ నామినేషన్లపై కాంగ్రెస్, అకాలీదళ్ విమర్శలు గుప్పించారు. ఆప్ నామినేషన్లు అసంతృప్తిని కలిగించడంతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ ఖైరా వ్యాఖ్యానించారు. పంజాబ్‌కు చెందిన ప్రముఖులకు రాజ్యసభకు పంపితే రాష్ట్ర సమస్యలను సమర్ధవంతంగా సభలో ప్రస్తావించగలుగుతారని, అలా  జరిగేలా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చూడాల్సి ఉంటుందని  అన్నారు. ఇందుకు భిన్నంగా వ్యక్తులను ఎంచుకోవడంతో పంజాబ్ ప్రయోజనాలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చినట్టు కనిపిస్తోందని ఖైరా అభిప్రాయపడ్డారు. కాగా, ఇది పంజాబ్‌పై, పంజాబీయత్‌పై ఆప్ విసిరిన తొలి దెబ్బగా శిరోమణి అకాలీదళ్ వ్యాఖ్యానించింది.

Updated Date - 2022-03-22T22:12:35+05:30 IST