పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాజిక్ అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతోంది. కాసేపట్లో అధికారికంగా ప్రకటించడమే తరువాయి. దీంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. తాను రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనని తేల్చిచెప్పారు. భగత్‌సింగ్ గ్రామమైన ఖట్కర్కలన్లో ప్రమాణం చేయబోతున్నట్టు ప్రకటించారు. ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్న నేపథ్యంలో భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడారు. దేశానికి భగత్‌సింగ్ చేసిన సేవలను గుర్తిస్తూ.. ఆయన జన్మస్థలంలో ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
మిగతా పార్టీల మాదిరి.. తమ పార్టీ అధికారంలో ఉన్న ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటోలు ఉండవని గుర్తు చేశారు. షహీద్ భగత్ సింగ్, బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రాలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. పంజాబ్‌లో ధురీ నుంచి పోటీ చేసిన భగవంత్ మాన్.. 58,206 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పంజాబ్ సీఎంగా ఆప్ అభ్యర్థి ప్రమాణ స్వీకారం దాదాపు ఖరారవడంతో రాష్ట్రమంతా సంబరాలు మొదలయ్యాయి. భగవంత్ మాన్కు సీఎం స్థాయి భద్రతను కల్పించారు. రాష్ట్రంలో మొత్తం 117 స్థానాలు ఉండగా.. ఆప్ ఇప్పటికే 86 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు బీజేపీ 2 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 16 స్థానాలకే పరిమితం అయింది.