Aadhaar Link: ఆధార్‌ లింక్‌పై ఈసీ అఖిలపక్షం

ABN , First Publish Date - 2022-08-02T12:51:04+05:30 IST

ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్‌ (Aadhaar) కార్డ్‌ వివరాలను పొందుపరిచే ప్రక్రియను చేపట్టే దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిలపక్ష

Aadhaar Link: ఆధార్‌ లింక్‌పై ఈసీ అఖిలపక్షం

- ఇంటింటా వివరాల సేకరణ

- ఈపీఎస్‌, ఓపీఎస్‌ ప్రతినిధుల హాజరు


చెన్నై, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్‌ (Aadhaar) కార్డ్‌ వివరాలను పొందుపరిచే ప్రక్రియను చేపట్టే దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సచివాలయంలో సోమవారం ఉదయం జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సత్యప్రద సాహు అధ్యక్షత వహించారు. డీఎంకే(DMK) తరఫున పార్టీ వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి, శాసనసభ్యుడు పరంధామన్‌, అన్నాడీఎంకే ఈపీఎస్‌ వర్గం తరఫున మాజీ మంత్రి డి. జయకుమార్‌, పొల్లాచ్చి జయరామన్‌, ఓపీఎస్‌ వర్గం తరఫున కోవై సెల్వరాజ్‌, కాంగ్రెస్‌ తరఫున దామోదరన్‌, నవాజన్‌, డీఎండీకే తరఫున పార్థసారథి, జనార్దనన్‌, సీపీఎం తరఫున ఆరుముగనయినార్‌, రాజశేఖరన్‌, సీపీఐ తరఫున ఏళుమలై, పెరియసామి, బీజేపీ తరఫున కరు నాగరాజన్‌, కరాటే త్యాగరాజన్‌, బీఎస్పీ తరఫున భారతిదాసన్‌, అడైకల్‌ రాజ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌(Trinamool Congress) తరఫున కలైవానన్‌, వడివేలు, నేషనల్‌ కాంగ్రెస్‌ తరఫున నరేశ్‌కుమార్‌, గజేంద్రన్‌ పాల్గొన్నారు.


నేమ్‌బోర్డ్‌ లాక్కున్న జయకుమార్‌

ఈ సమావేశంలో అన్నాడీఎంకే ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాల ప్రతినిధులకు మూడు సీట్లు ఏర్పాటు చేశారు. ఒక సీటులో ఓపీఎస్‌ వర్గానికి కోవై సెల్వరాజ్‌ అందరికంటే ముందుగా వెళ్లి తన సీటులో కూర్చున్నారు. ఆ తర్వాత ఈపీఎస్‌(EPS) వర్గానికి చెందిన జయకుమార్‌, పొల్లాచ్చి జయరామన్‌ ఆయన పక్కనే ఉన్న రెండు సీట్లలో కూర్చున్నారు. ఆ సందర్భంగా ఎన్నికల సంఘం వీరి సీట్లకు ముందరున్న బల్లపై ఆంగ్లంలో ఏఐఏడీఎంకే అనే చిన్న సైజు నేమ్‌ బోర్డును ఉంచింది. ఆ నేమ్‌ బోర్డు కోవై సెల్వరాజ్‌ సీటు ముందు ఉండటాన్ని గమనించి జయకుమార్‌ దానిని తన సీటు ముందుకు లాక్కున్నారు. ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సమావేశం జరుగుతున్నంతసేపూ జయకుమార్‌ పక్కసీటులో ఉన్న కోవై సెల్వరాజ్‌ వైపు చూడకుండా ముభావంగానే వ్యవహరించారు. ఈ సమావేశం తర్వాత జయకుమార్‌ విలేఖరులతో మాట్లాడుతూ తమ వర్గానిదే అసలైన అన్నాడీఎంకే పార్టీ అని, కనుకనే నేమ్‌బోర్డును తన వైపునకు లాక్కున్నానని చెప్పారు.


ఇంటింటా వివరాల నమోదు..

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎన్నికల సంఘం ప్రధానాధికారి సత్యప్రదసాహు మాట్లాడుతూ ఓటరు గుర్తింపు కార్డులో ఆధార్‌ కార్డు వివరాలను పొందు పరిచే ప్రక్రియ సోమవారం నుంచే రాష్ట్ర మంతటా ప్రారంభమైందని, వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఎన్నికల సంఘం సిబ్బంది ఇంటింటికీ వెళ్ళి ఓటర్లను కలుసుకుని వారి ఆధార్‌కార్డుల వివరాలను అడిగి తెలుసుకుని ఓటరు గుర్తింపు కార్డులతో వాటిని పొందుపరచనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలన్నారు. ఆధార్‌ కార్డు(Aadhaar Card) వివరాలను పొందుపరచినట్లయితే నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను వీలయినంత త్వరగా రద్దు చేయడానికి కూడా వీలవుతుందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న డీఎంకే ప్రతినిధి ఆర్‌ఎస్‌ భారతి మాట్లాడుతూ ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్‌ కార్డ్‌ వివరాలను పొందుపరచటం వల్ల నకిలీ గుర్తింపు కార్డులు తొలగిపోతాయని భావించలేమని చెప్పారు. ఈ విషయాన్ని తాము ఈసీ దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు.

Updated Date - 2022-08-02T12:51:04+05:30 IST