గంగపుత్రులను బలిగొన్న గాలివాన

ABN , First Publish Date - 2020-04-10T10:13:31+05:30 IST

వలకట్ల చేపల వేటకు వెళ్లిన గంగపుత్రులను అననుకూల వాతావారణం గురువారం అతలాకుతలం చేసింది.

గంగపుత్రులను బలిగొన్న గాలివాన

వలకట్ల వేటకు వెళ్లిన సమయంలో ఘటన


కృత్తివెన్ను, ఏప్రిల్‌ 9 : వలకట్ల చేపల వేటకు వెళ్లిన గంగపుత్రులను అననుకూల వాతావారణం గురువారం అతలాకుతలం చేసింది. ఏటిపాయల్లో నీటి ప్రవాహ ఉధృతి నలుగురిని పొట్టన బెట్టుకుంది. ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు.  ఒర్లగొందితిప్ప గ్రామానికి చెందిన జల్లా పెద్దిరాజులు (60) అతని కుమారుడు ముత్యాలు, సోదరుడు జల్లా వెంకటేశ్వరరావు (52)  అతని ఇద్దరి కుమారులు దావీదు, ఏసురాజు బుధవారం రాత్రి వలకట్ల వద్ద చేపల వేటకు రెండు బోట్లలో వెళ్ళారు. గుడిదిబ్బ పల్లిపాలెం గ్రామానికి చెందిన 15 మంది మత్య్సకారులు సమీప పాయల్లో నాటు పడవల్లో చేపల వేట కోసం వెళ్లారు. ఏటిపాయల్లో నీటి ప్రవాహ ఉధృతికి రెండు చోట్ల పడవలన్నీ నీటమునిగాయి. గుడిదిబ్బ పల్లెపాలేనికి చెందిన 12 మంది అతికష్టం మీద తీరానికి చేరుకున్నారు.


మరో ముగ్గురు వనమాలి వెంకటేశ్వరరావు (61), మోకా నాగేశ్వరరావు (62), బలగం నరసింహ మూర్తి (64)తో పాటు ఒర్లగొందితిప్పలో ఐదుగు రు గల్లంతయ్యారు. స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒర్లగొందితిప్పకు చెందిన ఏసురాజు, ముత్యాలు పాయల్లో చిక్కుకొని ప్రాణాల కోసం పోరాడుతుండగా, వారిని మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పెద్దిరాజులు, వెంకటేశ్వరరావు మృతదేహాలు ఇంతేరు ఒడ్డుకు చేరాయి. గుడిదిబ్బ పల్లెపాలేనికి చెందిన వెంక టేశ్వరరావు, నాగేశ్వరరావు మృతదేహాలు ఏటిపాయల్లో కనిపించాయి. దావీదు, నరసింహమూర్తి ఆచూకీ లభ్యం కాలేదు. భారీ వర్షం పడటంతో పడవ మునిగి పోయిందని, తాటిపట్టి దొరకటంతో దాన్ని పట్టుకొని ప్రాణం దక్కించు కున్నానని జల్లా ముత్యాలు తెలపగా పడవలు మునిగి పోవటంతో నీటి ప్రవాహానికి ఒడ్డుకు కొట్టుకొచ్చానని జల్లా ఏసురాజు పేర్కొన్నారు. 


మృతుల కుటుంబాలకు  రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే జోగి రమేష్‌, ఎస్పీ రవీంద్రనాఽథ్‌బాబు, ఆర్డీవో ఖాజావలి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంత్రి పేర్ని నాని ప్రకటించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్జి కాగిత కృష్ణప్రసాద్‌ మృతుల కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలిపారు.   


Updated Date - 2020-04-10T10:13:31+05:30 IST