కరోనాతో.. బెంబేలు

ABN , First Publish Date - 2020-05-30T09:22:16+05:30 IST

కరోనా.. జిల్లావాసులను కలవరపరుస్తోంది. రోజుకో రీతిన వివిధ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాపిస్తోంది. ఎటు నుంచి ఎటుగా ఈ వైరస్‌

కరోనాతో.. బెంబేలు

గ్రామాలకూ వ్యాపిస్తోన్న వైరస్‌

అధికారికంగా నిల్‌.. అనధికారికంగా ఎన్నో?

క్వారెంటైన్‌లో ఉన్న ఓ యువకుడికి పాజిటివ్‌

ముంబై లింక్‌తో ఈపూరు మండలంలో కలకలం

గుంటూరు, మంగళగిరి, మాచర్లలోనూ పలు కేసులు


గుంటూరు(సంగడిగుంట), ఈపూరు, మాచర్ల, విజయపురిసౌత్‌, మంగళగిరి రూరల్‌, యడ్లపాడు, మే 29: కరోనా.. జిల్లావాసులను కలవరపరుస్తోంది. రోజుకో రీతిన వివిధ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాపిస్తోంది. ఎటు నుంచి ఎటుగా ఈ వైరస్‌ వస్తుందో ఏ గ్రామంలో ఏ రోజున పాజిటివ్‌లు వెలుగు చూస్తున్నాయో అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం జిల్లాలో 13 కేసులను నిర్ధారించగా శుక్రవారం నిల్‌గా చూపారు. అయితే జిల్లాలో గుంటూరు సహా పలు ప్రాంతాల్లో శుక్రవారం పెద్దసంఖ్యలో పాజిటివ్‌లను స్థానికంగా అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో కరోనా నిరోధక చర్యలు తీసుకున్నారు.


ప్రత్యేక పారిశుధ్య చర్యలు, బారీకేడ్ల ఏర్పాటు, పిచికారీ ద్రావణం చేయడంలాంటి చర్యలను ఆయాశాఖల అధికారులు తీసుకున్నారు. ప్రభుత్వం అధికారికంగా కేసులు ప్రకటించలేదు. అనేక ప్రాంతాలలో అధికారులు ముందస్తుగా అప్రమత్తమై ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.  అధికారుల చర్యలతో కేసుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని ప్రజలు అనుమానిస్తున్నారు. దీంతో అసలు ఎంతమందికి పాజిటివ్‌ వచ్చిందో అని ప్రజల్లో కలవరం నెలకొంది.   గుంటూరు నగరంలో ఇప్పటి వరకు పాజిటివ్‌లు వెలుగుచూడని ప్రాంతాల్లోనూ తాజాగా కేసులు ఉన్నట్లు అధికారుల చర్యలను బట్టి అర్థమవుతోంది.    ఈ కేసుల వివరాలను శనివారం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. 


ఈపూరు మండలం వనికుంట గ్రామంలో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి నాగేంద్రబాబు తెలిపారు. ఇటీవల గ్రామానికి పూణే, ముంబైల నుంచి స్వగ్రామమైన వనికుంటకు సుమారు 60 మంది వరకు కార్లలో వచ్చారు. వీరికి ఈ నెల 26న వైద్య పరీక్షలు చేశారు. వారిలో పూణేలో వైద్యుడిగా పని చేస్తున్న ఒకరు, 11 ఏళ్ల బాలికతో పాటు మరొకరికి పాజిటివ్‌గా గుర్తించారు. వీరిని గుంటూరు ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. గ్రామంలో ముగ్గురికి పాజిటివ్‌తో వినుకొండ రూరల్‌ సీఐ సుబ్బారావు, తహసీల్దారు కోటేశ్వరరావు, ఎస్‌ఐ సింగయ్యలు గ్రామాన్ని సందర్శించారు.  


మాచర్ల 14వ వార్డుకు చెందిన ఓ మహిళకు పాజిటివ్‌ అని తేలినట్లు స్థానిక అధికారులు తెలిపారు. వారం నుంచి దగ్గు, జలుబు, ఆయాసంతో బాధపడుతుండగా స్థానిక వైద్య సిబ్బంది శుక్రవారం ఆమెకు వైద్య పరీక్షలు జరిపారు. పాజిటివ్‌గా తేలడంతో గుంటూరుకు తరలించారు. ఆమె కుటుంబసభ్యులు 11 మందిని న్యూటన్స్‌లోని క్వారంటైన్‌కు పంపారు. హైదరాబాద్‌లో ఉంటున్న మాచర్ల మండలం చింతలతండాకు చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌గా అక్కడి నిర్వహించిన పరీక్షల్లో తేలింది. లాక్‌డౌన్‌తో నెలన్నరపాటు గ్రామంలో ఉన్న ఇతడు ఈ నెల 23న హైదరాబాద్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ పాజిటివ్‌గా తేలడంతో స్థానిక అధికారులు అప్రమత్తమై ఆ యువకుడి తల్లిదండ్రులను మాచర్ల వైద్యశాలకు తరలించి పరీక్షలు నిర్వహించారు.  


మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన ఓ యువకుడికి పాజిటివ్‌గా నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 26న ఢిల్లీ నుంచి వచ్చిన ఇతడ్ని నంబూరులోని వీవీఐటీ క్వారంటైన్‌కు తరలించారు. ఈ క్రమంలో జరిపిన వైద్య పరీక్షల్లో  పాజిటివ్‌గా తేలింది.


యడ్లపాడు మండలం తిమ్మాపురం, యడ్లపాడులలో కేసులు వెలుగు చూడడంతో 94 మందికి శుక్రవారం పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి లక్ష్యానాయక్‌ తెలిపారు. మూడు రోజుల్లో వీరి ఫలితాలు వస్తాయన్నారు.

Updated Date - 2020-05-30T09:22:16+05:30 IST