పొలిటికల్‌ గలీజులో మలుపు

ABN , First Publish Date - 2022-05-27T06:57:44+05:30 IST

నిర్మల్‌ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల ఎంపిక ప్రక్రియ వ్యవహారం కొత్త మ లుపులు తిరుగుతోంది.

పొలిటికల్‌ గలీజులో మలుపు
సమావేశంలో మాట్లాడుతున్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళనకు శ్రీకారం 

నేడు ఏఐసీసీ నేత మహేశ్వర్‌రెడ్డి ఒక రోజు దీక్ష 

అభ్యర్థుల ఎంపికను రద్దు చేయాలని డిమాండ్‌ 

మంత్రి , మున్సిపల్‌ చైర్మన్‌లను బర్తరఫ్‌ చేయాలి... : కాంగ్రెస్‌ 

ముడుపుల బాగోతంలో మంత్రికి భాగస్వామ్యం : ఏలేటి  

నిర్మల్‌, మే 26 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్‌ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల ఎంపిక ప్రక్రియ వ్యవహారం కొత్త మ లుపులు తిరుగుతోంది. నిన్నటి దాక గోప్యంగా జరిగిపోతుందని భావించిన మున్సిపల్‌ యంత్రాంగం ఈ వ్యవహారం రచ్చరచ్చ కావడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడింది. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు వెనకడుగు వేస్తున్నారు. తాజాగా పారిశుధ్య కార్మికుల ఎంపిక విషయంలో ఇంకా ఎలాంటి ప్ర క్రియ జరగలేదని మాత్రమే పైపైకి చెబుతున్న అధికారులు అసలు విషయాన్ని ఎందుకు బయటపెట్టడం లేదన్న అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్న అభ్యర్థుల ఎంపిక జాబితాను మున్సిపల్‌ అధికారులు ఎంప్లాయిమెంట్‌శాఖకు ఎందుకు అందజేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌తో పాటు కౌన్సిలర్‌లు, ఇతర ప్రజా ప్రతినిధుల బంధువులకు ఉద్యోగాల కట్టబెట్టుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అర్హులైన అభ్యర్థులు తమకు ఉద్యోగం దక్కలేదన్న ఆందోళనతో యంత్రాంగంపై ఒత్తిడి పెంచుతున్నారు. దీనిని స్థానిక కాంగ్రెస్‌ పార్టీ ఒక నిరుద్యోగ ఆందోళన కార్యక్రమంగా మలిచేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీలు మున్సిపల్‌ ముట్టడి, కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాలను చేపట్టిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో కాల్‌లెటర్‌లు అందిన సుమారు 800 మంది అభ్యర్థులతో పాటు భారీసంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల పక్షాన ఒక రోజు నిరసన దీక్షను చేపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఏఐసీసీ వ్యవహారాల రాష్ట్ర కమిటీ చైర్మన్‌ ఏలేటిమహేశ్వర్‌రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డిల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

మంత్రి, మున్సిపల్‌ చైర్మన్‌ను  బర్తరఫ్‌ చేయాలి

మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల నియామక ప్రక్రియలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి హస్తం ఉందని, నిరుద్యోగులనుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయల డబ్బుల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి భాగస్వామ్యం ఉందని ఏఐసీసీ నేత ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో సమావేశమ య్యారు. మున్సిపాలిటీలో జరిగిన భారీ కుంభకోణ వ్యవహారంపై చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవహారమంతా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇంటి నుంచే నడిచిందని ఆరోపించారు. మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌లు, వారి బంధువులకు అక్రమంగా ఉద్యోగా లు ఇచ్చుకున్నారని ఆరోపించారు. కనీసం సగం ఉద్యోగాలనైనా అర్హులైన పేదవర్గాలకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. బడుగు, బలహీన వర్గాలకు చెందాల్సిన పారిశుఽధ్య కార్మికుల ఉద్యోగాలు సైతం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు దొడ్డిదారిన దోచుకోవడం సబబేనా అని ప్రశ్నించారు. వెంటనే ఈ అక్రమ నియమకాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీనిని రద్దు చేసే దాక కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన చెప్పారు. అక్రమ నియమాకాలకు బాధ్యత వహించి వెంటనే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌లు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వమే మంత్రి, చైర్మన్‌లను బర్తరఫ్‌ చేయాలన్నారు. నిర్మల్‌ నియోజకవర్గంతో పాటు జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అక్రమాలు విఫరీతంగా పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. ఇసుక మాఫియా మొదలుకొని, భూముల ఆక్రమణలు, చివరకు పారిశుధ్య కార్మికుల పోస్టులను అమ్ముకునే దాక దేనిని వదిలిపెట్టడం లేదని, ఉన్నత హోదాలో ఉండి నీచమైన పనులు చేయడానికి మంత్రికి సిగ్గులేదా అని ధ్వజమెత్తారు. శుక్రవారం నిరుద్యోగుల పక్షాన జరగనున్న కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనకు పెద్దఎత్తున కాంగ్రెస్‌ కార్యకర్తలతో పాటు ప్రజలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దిలావర్‌పూర్‌ మండల జడ్పీటీసీ సభ్యులు తక్కల రమణారెడ్డి, దిలావర్‌పూర్‌ మండల పార్టీ అధ్యక్షులు ముత్యంరెడ్డి, నిర్మల్‌ పట్టణాధ్యక్షులు నాందేడపు చిన్ను, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జమాల్‌, సత్యం చంద్రకాంత్‌, జింకసూరి, అయ్యన్న గారి పోశెట్టి, శంకర్‌పతి, మహరాజ్‌ రవి, ఇమ్రాన్‌ ఉల్హా, కీజర్‌, జునైద్‌, బాపురెడ్డితో పాటు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

హాజరుకానున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

మున్సిపల్‌ ఉద్యోగాల అక్రమాల వ్యవహారంపై కాంగ్రెస్‌పార్టీ చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలతో నిర్మల్‌ నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడేక్కింది. నియామక ప్రక్రియను వెంటనే రద్దు చేయాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్‌ పార్టీ చేపడుతున్న ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఎఐసీసీ నేత మహేశ్వర్‌రెడ్డి శుక్రవారం ఒక రోజు దీక్షను చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కాంగ్రెస్‌ శ్రేణులతో పాటు, ఉద్యోగాలకు అర్హులైన నిరుద్యోగులు, కాల్‌లెటర్‌లు పొందిన వారు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సైతం హజరవుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అయిన ఆయన నిరుద్యోగుల ఆందోళనలో పాల్గొంటుండడం రాజకీయంగా మరింత వేడి సృష్టిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2022-05-27T06:57:44+05:30 IST