వెంటాడి.. వేటాడి..

ABN , First Publish Date - 2022-08-03T09:19:02+05:30 IST

పగ.. రెండు దశాబ్దాలకు పైబడిన పగ! 9/11 దాడులతో తమ ఆధిపత్యానికి, అహానికిసవాల్‌ విసరడాన్ని జీర్ణించుకోలేని అగ్రరాజ్యం..

వెంటాడి.. వేటాడి..

  • 9/11 ఘటనపై పగసాధించిన అగ్రరాజ్యం
  • ఏప్రిల్‌లోనే జవహరి ఆనుపానులపై సమాచారం
  • కాబూల్‌లోని షేర్‌పూర్‌లో ఉంటున్నట్టు గుర్తింపు
  • మట్టుబెట్టే ప్రణాళికకు 4 నెలలపాటు రూపకల్పన
  • జూలై 25న అనుమతిచ్చిన అధ్యక్షుడు జో బైడెన్‌
  • జూలై 31న సూర్యోదయాన అల్‌ జవహరి అంతం

గ.. రెండు దశాబ్దాలకు పైబడిన పగ! 9/11 దాడులతో తమ ఆధిపత్యానికి, అహానికిసవాల్‌ విసరడాన్ని జీర్ణించుకోలేని అగ్రరాజ్యం.. ఆ దాడుల వెనుక మాస్టర్‌మైండ్‌ అల్‌జవహరిని అంతమొందించి చల్లార్చుకున్న పగ ఇది!! అంతటి అమెరికాకూ తన పగ తీర్చుకోవడానికి, అహాన్ని చల్లార్చుకోవడానికి పట్టిన సమయం అక్షరాలా ఇరవై సంవత్సరాలకు పైమాటే. ఈ దాడులకు కారణమైన అల్‌ఖాయిదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ను 2011లోనే మట్టుబెట్టిన అమెరికా.. అతడికి కుడిభుజమైన అల్‌జవహరి ఆనుపానులు తెలుసుకుని, సామాన్య పౌరులకు ఎలాంటి ప్రమాదమూ లేకుండా కేవలం అతణ్ని మాత్రమే కడతేర్చడానికి మరో 11 సంవత్సరాలు ఓపిగ్గా ఎదురుచూసింది. అఫ్ఘానిస్థాన్‌ అమెరికా కనుసన్నల్లో ఉన్నతంకాలం పాకిస్థాన్‌లోనూ ఇంకా ఎక్కడెక్కడో తలదాచుకున్న జవహరి.. అఫ్ఘాన్‌ తాలిబాన్ల ఏలుబడిలోకి వచ్చాక తిరిగొచ్చిన విషయాన్ని నిఘా వర్గాల ద్వారా గుర్తించి, పక్కా సమాచారంతో దాడి చేసి చంపేసింది. అసలింతకీ అమెరికా అతడి గుట్టును ఎలా కనుక్కోగలిగింది? ఈ ఆపరేషన్‌ను ఎలా విజయవంతంగా నిర్వహించింది? అంటే.. హాలీవుడ్‌ సినిమాను మించి ఉత్కంఠ కలిగించే కథ అది. గుర్తుందా.. దాదాపు ఏడాది క్రితం అఫ్ఘానిస్థాన్‌పై తాలిబాన్ల పట్టు క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా సేనలు కొద్దికొద్దిగా వెనక్కి తగ్గు తూ ఆగస్టు 15న పూర్తిగా ఆ దేశం నుంచి ఉపసంహరించుకున్నాయి. అయితే.. అమెరికా ఊహించినట్టుగానే తాలిబాన్ల పాలన వచ్చాక అల్‌కాయిదా ఉగ్రవాదులందరూ తిరిగి అఫ్ఘాన్‌కు రావడం ప్రారంభించారు.  అల్‌జవహరి కూడా తన భార్య, కుమార్తెతో వచ్చి కాబూల్‌ డౌన్‌టౌన్‌లో మకాం వేసిన విషయాన్ని అమెరికా నిఘా వర్గాలు గుర్తించి ఆ సమాచారాన్ని బైడెన్‌ యంత్రాంగానికి చేరవేశాయి.


అఫ్ఘాన్‌ హోం మంత్రి రక్షణలో..

కాబూల్‌లోని షేర్‌పూర్‌ అనే ప్రాంతంలో.. గతంలో పలు విదేశీ రాయబార కార్యాలయాలు ఉన్న చోటుకు దగ్గరగా.. పటిష్ఠమైన రక్షణ ఏర్పాట్లు ఉన్న ఒక భవనంలో అతడు తలదాచుకుంటున్న విషయాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో సీఐఏ దృష్టికి తీసుకొచ్చాయి. అక్కడ అతడికి ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్‌వర్క్‌ రక్షణ కల్పిస్తున్న విషయాన్ని తెలిపాయి. ఈ హక్కానీ నెట్‌వర్క్‌ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్‌. అతడి కుమారుడు సిరాజుద్దీన్‌ హక్కానీ.. ప్రస్తుత తాలిబాన్‌ ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్నాడు. అతడి అనుచరుల్లో ఒకడి ఇంట్లోనే అల్‌ జవహరి ఉంటున్నారు. అంటే.. సాక్షా త్తూ అఫ్ఘానిస్థాన్‌ హోం మంత్రి రక్షణలో ఉన్నట్టు. ఆ విషయాన్ని సీఐఏ అధికారులు బైడెన్‌ సలహాదారులకు, ఆపై అధ్యక్షుడికి తెలియజేశారు. అదే రోజు అల్‌ జవహరి అంతానికి ప్రణాళిక లు రచించడం మొదలైంది.  జవహరి ఎప్పుడూ ఒంటరిగా ఆ భవనం నుంచి బయటకు రాడని సీఐఏ అధికారలుఉ గుర్తించారు. 


ఆ ఇంటి నమూనాను రూపొందించి.. జవహరి ఆ ఇంట్లో ఎప్పుడు ఎక్కడ ఏ గదిలో, బాల్కనీలో ఉం టాడో, ఎక్కడ అత ణ్ని చంపడానికి అవకాశం ఎక్కువగా ఉం టుందో.. పూర్తి వివరాలతో ఒక నివేదిక రూపొందించుకున్నారు. అన్నింటినీ పరిశీలించాక అతణ్ని మట్టుబెట్టే ప్రణాళికను రచించి..  దాన్ని జూలై 1న శ్వేతసౌధంలోని సిచ్యువేషన్‌ రూమ్‌లో బైడెన్‌ ముందు పెట్టారు. ఈ దాడి చట్టబద్ధమేనా కాదా అనే అంశంపై లాయర్ల బృందంతో కూడా చర్చించారు. జవహరి చేసిన ఘాతుకాల నేపథ్యంలో అతడిపై దాడి సబబేనని వారు స్పష్టం చేయడంతో జూలై 25న తుది సమావేశం నిర్వహించి.. జవహరిని చంపే ఆపరేషన్‌కు అనుమతిచ్చారు. అయితే వారి లక్ష్యం అల్‌ జవహరీ మాత్రమే. ఈ ఆపరేషన్‌లో సాధారణ పౌరులే కాదు.. జవహరీ కుటుంబసభ్యులు సైతం పొరబాటున కూడా మరణించకూడదన్నది బైడెన్‌ షరతు. అమెరికా కాలమానం ప్రకారం జూలై 30న.. రాత్రి 9.48 గంటల సమయంలో వారి ఆపరేషన్‌ మొదలైంది. అఫ్ఘానిస్థాన్‌ కాలమానం ప్రకారం జూలై 31న ఉదయం  6:18 గంటలకు ఉదయపు ప్రార్థన అనంతరం తన ఇంటి బాల్కనీలో నిలబడి సూర్యోదయాన్ని వీక్షిస్తున్న అల్‌జవహరి.. అమెరికన్‌ రీపర్‌ డ్రోన్‌ ప్రయోగించిన రెండు హెల్‌ఫైర్‌ క్షిపణుల దెబ్బకు తునాతునకలైపోయాడు! ఈ దాడిలో అతడికి తప్ప అతడి కుటుంబసభ్యులెవ్వరికీ ఏ ప్రమాదం జరగలేదు. 

- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2022-08-03T09:19:02+05:30 IST