అనూహ్య మార్పులు.. పగలంతా ఎండ దంచి కొడితే.. సాయంత్రం వేళల్లో వర్షం.. అస్వస్థతకు గురవుతున్న జనం..!

ABN , First Publish Date - 2022-05-17T13:06:46+05:30 IST

పగలు మాడు పగులగొట్టేంత ఎండ (Temparature), సాయంత్రం ఒక్కసారిగా భారీ

అనూహ్య మార్పులు.. పగలంతా ఎండ దంచి కొడితే.. సాయంత్రం వేళల్లో వర్షం.. అస్వస్థతకు గురవుతున్న జనం..!

  • అప్పుడే ఎండ.. అంతలోనే వాన.. 
  • ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటున్న వైద్యులు

హైదరాబాద్‌ సిటీ : పగలు మాడు పగులగొట్టేంత ఎండ (Temparature), సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం (Heavy Rain).. ఓ ప్రాంతంలో భానుడి ప్రతాపం.. మరోచోట గాలివాన జోరు.. నగరంలో కొన్ని రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పగలంతా ఎండ దంచి కొడితే.. సాయంత్రం వేళల్లో వర్షం పడుతోంది. ఈ మార్పులను శరీరం (Body) తట్టుకోలేకపోతుంది. చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు. వాతావరణంలో సమతుల్యత లోపిస్తే ఆరోగ్యంపై (Health) తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు (Doctors) చెబుతున్నారు. అబ్‌స్ట్రాక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సీవోపీడీ) ప్రభావం తీవ్రంగా ఉందని, అకస్మాత్తుగా మారుతున్న వాతావరణంతో రెస్పిరేటర్‌ వ్యవస్థ దెబ్బతింటుందని, ఫ్లూ, దగ్గు, జలుబు, న్యుమోనియా, బ్రాంకైటిస్‌, అస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పెరుగుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. వాతావరణంలో మార్పులు వైర్‌సకు అనుకూలంగా ఉంటాయని, అది బలపడడానికి దోహదపడతాయని చెప్పారు. ఇన్‌ప్లూంజా వైరస్‌ శక్తివంతమైతే జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ వ్యాధులు తీవ్రమవుతాయని చెప్పారు.


వైరల్‌ బ్యాక్టీరియా శక్తిమంతం

వాతావరణంలో మార్పులతో వైరల్‌ బ్యాక్టీరియా విజృంభిస్తుంది. దీంతో డస్ట్‌ ఎలర్జీ, గొంతునొప్పి, దగ్గు, ఆయాసం, అస్తమా, సీవోపీడీ, వివిధ రకాల ఇబ్బందులు ఉత్పన్నమవుతాయి. నీటి కాలుష్యంతో వాంతులు, విరోచనాలు, జీర్ణకోశ ఇబ్బందులు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో ఇల్లు, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నీటి కాలుష్యం లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. వర్షం వచ్చినప్పుడు తడకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం వల్ల కాలుష్యం నుంచి కాపాడుకోవచ్చు. - డాక్టర్‌ అనీష్‌ ఆనంద్‌, ఇంటర్నల్‌ మెడిసిన్‌, అపోలో ఆస్పత్రి.


కాలుష్యంతో చేటు..

నగరంలో కాలుష్యం (Pollution) కారణంగా శ్వాసకోశ, గొంతు సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. గాలిలో సూక్ష్మజీవుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గొంతులో ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల వాయిస్‌ బాక్స్‌ దెబ్బతినడం, మాట సరిగా రాకపోవడం, గొంతులో నొప్పి, వాపు వంటి ఇబ్బందులు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతల్లో చోటుచేసుకునే మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, వ్యాధిగ్రస్తులను రిస్క్‌పాపులేషన్‌గా పరిగణిస్తామని వైద్యులు చెప్పారు. ఇటువంటి వాతావరణంలో వారు త్వరగా వైరస్‌ బారినపడతారని, వీరిలో రోగ నిరోధకశక్తి తక్కువగా ఉంటుందని, అస్వస్థత పాలవుతారని చెప్పారు.

Updated Date - 2022-05-17T13:06:46+05:30 IST