పక్కీరుపల్లె చెరువులో ఎటుచూసినా ఆక్రమణలే!

ABN , First Publish Date - 2020-12-05T05:48:23+05:30 IST

చెరువులు, కుంటలు, వాగులు వంకల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, ఎవరికీ పట్టాలు ఇవ్వద్దంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పును కొంత మంది అధికారులు పట్టించుకోకపోవడంతో ఆక్రమణలు యధాతధంగా సాగుతున్నాయి.

పక్కీరుపల్లె చెరువులో   ఎటుచూసినా ఆక్రమణలే!
ఆక్రమణల చెరలో ఫక్కీరుపల్లె చెరువు

కాల్వలనూ వదల్లేదు

 వర్షంతో నిండిన చెరువు

 తెగేందుకు సిద్ధం

 మేల్కొన్న అధికారులు

 నీరు వెళ్లేందుకు ఎక్సకవేటర్లతో తవ్వకాలు

 తప్పిన ముప్పు


(కడప - ఆంధ్రజ్యోతి)

చెరువులను మాయం చేస్తారు.. కాల్వలూ ఆక్రమిస్తారు.. కుంటలు, వంకలు, నదుల్లోనూ ఇళ్లు కడతారు. జల స్థావరాల్లోనే ఇళ్లు, వాణిజ్య భవనాలు నిర్మిస్తే నీళ్లు ఇళ్లల్లోకి పోక మరెక్కడికి పోతాయ్‌.. సాఫీగా సాగే నీళ్లకు అడ్డుపడితే అవి ఎంత నష్టం కలిగిస్తాయో వరదలప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అదే ముప్పు కడప నగరానికి పొంచి ఉంది. ఇక్కడున్న చెరువులు, కుంటలు ఆక్రమించేయడంతో వర్షం నీరు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇక్కడి పక్కీరుపల్లె చెరువు చాలా భాగంగా ఆక్రమణలకు గురైంది. వర్షం పడ్డప్పుడు చెరువు అలుగు ద్వారా నీరు కిందకు వెళ్లే పరిస్థితి లేదు. ప్రస్తుతం చెరువు నిండింది. ఏక్షణానైనా తెగేలా మారింది. అప్పటికి మేలుకున్న అధికార యంత్రాంగం వెంటనే రెండు ఎక్సకవేటర్ల ద్వారా కాల్వలు తీశారు. ఆ పనిచేయకుండా ఉంటే చెరువుకు గండి పడేది. అదే జరిగితే శ్రీక్రిష్ణదేవరాయనగర్‌, ఆఫీసర్స్‌కాలనీ, అశోక్‌నగర్‌, చిన్నచౌకు మరికొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యేవి. 

చెరువులు, కుంటలు, వాగులు వంకల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, ఎవరికీ పట్టాలు ఇవ్వద్దంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పును కొంత మంది అధికారులు  పట్టించుకోకపోవడంతో ఆక్రమణలు యధాతధంగా సాగుతున్నాయి. కడప నగర పరిధిలో పక్కీరుపల్లె చెరువు 75.75 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వర్షం వస్తే నీరు అలుగు ద్వారా కిందికి వెళ్లిపోయేది. ఇటీవల కడప నగరం శరవేగంగా విస్తరిస్తోంది. నివాస స్థలాలకు డిమాండ్‌ ఉంది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో సామాన్యుడు సెంటు స్థలం కూడా కొనలేని పరిస్థితులు ఉన్నాయి. ఆర్టీసీ బస్టాండు ప్రాంతంలో సెంటు సుమారు రూ.50లక్షలు ఉండడంతో శివారు ప్రాంతాల్లో కొనుగోళ్లు పెరిగాయి. దీంతో కొందరు కుంటలు, చెరువులు, కాల్వలు ఆక్రమించేసి దర్జాగా భవనాలు నిర్మించుకున్నారు.


నలుదిక్కులా ఆక్రమణలు

పక్కీరుపల్లె చెరువు పరిధిలో చుట్టుపక్కల పెద్దసంఖ్యలో నివాసాలు వెలుస్తున్నాయి. కొందరు చెరువును ఆక్రమించి నివాసాలు ఏర్పరుచుకున్నట్లు తెలుస్తోంది. చెరువు భూమిలో కొంత, చెరువు కట్ట, కాల్వలు ఆక్రమించినట్లు తెలుస్తోంది. చెరువు లోతట్టు భూముల్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వద్దని న్యాయస్థానాలు తీర్పులున్నా గతంలో సబ్‌స్టేషనుకు స్థలం కేటాయించారు. ఇది అప్పట్లో విమర్శలకు తావిచ్చింది. ఇటీవల కురిిసిన వర్షాలకు చెరువులోకి సమృద్ధిగా నీరు వచ్చి చేరింది. చుట్టూ ఆక్రమణలు, చెరువు అలుగుతో పాటు కాల్వ కూడా ఆక్రమణకు గురైంది. దీంతో చెరువు నీరు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో ఏ సమయంలో అయినా చెరువు గండి పడి లోతట్టు ప్రాంతాలు మునుగుగాయని చాలామంది భయపడ్డారు. ఈ విషయాన్ని కొందరు కలెక్టరు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నీటిపారుదలశాఖ, రెవెన్యూ, కార్పొరేషన సిటీ ప్లానింగ్‌ అధికారులు చెరువును పరిశీలించి రెండు జేసీబీలతో రెండు చోట్ల గుంతలు తీసి నీరు కిందకు వెళ్లేలా చేశారు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేయకపోతే ఏదో ఒకరోజు లోతట్టు ప్రాంతాలు మునిగి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.


ఆక్రమణలు తొలగిస్తాం

పక్కీరుపల్లె కాల్వలో ఉన్న ఆక్రమణలు తొలగించి నీరు కాల్వల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకున్నామని కడప తహసీల్దారు శివరామిరెడ్డి ఆంరఽధజ్యోతికి వెల్లడించారు. ఇక్కడ కాల్వలు ఆక్రమణకు గురయ్యాయన్నారు. సర్వే చేసి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. చెరువులు, కుంటలు, వాగులు, వంకలను ఎవరైనా ఆక్రమించి నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చేయడంతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2020-12-05T05:48:23+05:30 IST