World War I: అమ్మకానికి మొదటి ప్రపంచ యుద్ధ కాలంనాటి సముద్రపు కోట

ABN , First Publish Date - 2022-07-19T01:40:52+05:30 IST

మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో సముద్రం మధ్యలో నిర్మించిన కోట అమ్మకానికి వచ్చింది. వేలానికొచ్చిన ఈ కోట

World War I: అమ్మకానికి మొదటి ప్రపంచ యుద్ధ కాలంనాటి సముద్రపు కోట

లండన్: మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో సముద్రం మధ్యలో నిర్మించిన కోట అమ్మకానికి వచ్చింది. వేలానికొచ్చిన ఈ కోట ప్రారంభ ధర 60 వేల డాలర్లు మాత్రమే. ఉత్సాహవంతులు ఎవరైనా ఆలస్యం చేయకుండా కొనుక్కోవచ్చు. అయితే, ఇది మన ఇండియాలో కాదు సుమా! ఇంగ్లండ్‌లో ఉంది. 1915-1919 మధ్య కాలంలో దీనిని నిర్మించారు.


ఉత్తర ఇంగ్లాండ్‌లోని లింకన్‌షైర్ తీరంలో ఉన్నఈ బుల్ శాండ్ ఫోర్ట్‌ (Bull Sand Fort)ను 200 మంది సైనికులకు వసతి కల్పించే ఉద్దేశంతో నిర్మించారు. తీరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడికి పడవ లేదంటే హెలికాప్టర్ ద్వారా మాత్రమే చేరుకోవచ్చు. కోట విక్రయాన్ని రైట్ మూవ్ (Right Move) అనే సంస్థ నిర్వహిస్తోంది. ఇది ఫ్రీహోల్డ్ ప్రాపర్టీ అని పేర్కొన్న ‘రైట్‌మూవ్’.. కోటకు పునరుద్ధరణ అవసరమని పేర్కొంది. 


 1915-1919 మధ్య నిర్మించిన గ్రేడ్-II సముద్రపు కోట మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే వరకు నిర్మాణ పనులు పూర్తికాలేదు. దీంతో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దీనిని ఉపయోగించుకున్నారు. పునర్నిర్మాణంం అవసరమైన ఈ కోట ప్రస్తుతం ఖాళీగా ఉంది. బేస్‌మెంట్‌తో కలిపి మూడు అంతస్తులున్న ఈ కోటలో సముద్ర మట్టానికి దిగువన మ్యాగజైన్, రెండంతస్తుల అబ్జర్వేషన్ టవర్ ఉన్నాయి.


ఆర్టీసియన్ బావి (బుగ్గబావి) ద్వారా మంచినీటి సరఫరా అందుబాటులో ఉంది. బయట బాల్కనీ, ఒక జెట్టీ ఉంది. యుద్ధ  నౌక నుంచి వచ్చే కాల్పులను కూడా తట్టుకునేలా ఈ కోటను బలంగా నిర్మించారు. సావిల్లెస్ నేషనల్ ఆక్షన్స్ (Savilles National Auctions) ద్వారా జులై 19న (మంగళవారం) దీనికి వేలం నిర్వహించనున్నారు.

Updated Date - 2022-07-19T01:40:52+05:30 IST