అబద్ధాల వైకాపా పాలన

ABN , First Publish Date - 2022-07-16T07:09:55+05:30 IST

రాష్ట్రంలో ప్రభుత్వం అబద్ధాల పాలన సాగిస్తోంది. ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు మొత్తంగా అబద్ధాల పైనే ఆధారపడ్డారు...

అబద్ధాల వైకాపా పాలన

రాష్ట్రంలో ప్రభుత్వం అబద్ధాల పాలన సాగిస్తోంది. ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు మొత్తంగా అబద్ధాల పైనే ఆధారపడ్డారు. ప్రత్యేక హోదాను గత ప్రభుత్వం కేంద్రానికి తాకట్టు పెట్టిందని, పోలవరం ప్రాజెక్టును లంచాల కోసం చంద్రబాబు చేపట్టారని, అమరావతి చంద్రబాబు బినామీలదని అబద్ధాలు ప్రచారం చేశారు. రాష్ట్రంలో జరిగే ప్రతి అంశాన్నీ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఆపాదిస్తూ, నిందలు వేస్తూ, ఏ ఒక్క సంఘటనకూ ప్రస్తుత ప్రభుత్వం బాధ్యత తీసుకోవటం లేదు.


అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలి అంటారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి, వైకాపా నాయకులకు అతికినట్లు ఉండాల్సిన పని లేదు. అబద్ధమయితే చాలు. అదే పదివేలు. ఈ మూడేళ్ల పాలనా కాలంలో ముఖ్యమంత్రి కానీ, ఆయన మంత్రివర్గ సహచరులు కానీ మొత్తంగా అబద్ధాల పైనే ఆధారపడ్డారు. మొదటి అబద్ధం ప్రత్యేక హోదా. చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక హోదాను ఢిల్లీకి తాకట్టు పెట్టిందని, హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ కొరకు కక్కుర్తి పడిందనీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే, ఢిల్లీ వెళ్లి కేంద్రం మెడలు వంచి హోదా తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఢిల్లీ వెళ్ళారు కానీ, మోదీ మెడలు వంచలేదు. హోదా తేలేదు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వైకాపా అవసరం లేదని, కాబట్టి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ‘ప్లీజ్‌ ప్లీజ్‌’ అంటూ అడుగుతుంటామని చెప్పారు. 


రెండో అబద్ధం పోలవరం. ఇది జాతీయ ప్రాజెక్టు. దీని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. అలాంటి ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం కేవలం లంచాల కోసం, అవినీతి కోసం తాను నిర్మాణం చేస్తానని చేపట్టారు. తన అనుయాయులకు, అయిన వారికి ఇచ్చారని ప్రజలను నమ్మించారు. పోలవరాన్ని ఏటీఎంగా, పేటీఎంగా వాడేసుకుంటున్నట్లు ప్రచారం చేశారు. అధికారంలోకి రాగానే పోలవరం రివర్స్‌ టెండర్ల పేరిట డ్రామా ఆడారు. పోలవరంలో నీతిని తప్ప అవినీతిని వెలికి తీయలేకపోయారు. పోలవరాన్ని కేంద్రానికి అప్పచెప్పకుండా చంద్రబాబు ఇచ్చిన కాంట్రాక్టర్లకే పనులను కట్టబెట్టారు. అదిగో... ఇదిగో అన్న ప్రాజెక్టు పనులను అదిగదిగో... అల్లదిగో అన్నట్టుగా మార్చేశారు. మరో రెండేళ్లలోను పోలవరం పూర్తి కాదు అన్న పరిస్థితి తెచ్చారు. 77 శాతం పూర్తి చేసిన పోలవరం పనులను మూడేళ్ళ పాలనలో మరో పది శాతం కూడా పూర్తి చేయలేకపోయారు. పోలవరం పూర్తి చేస్తానని రంకెలు వేసిన ‘బుల్లెట్‌ మాజీ మంత్రి’ ఎక్కడ ఉన్నాడో తెలియదు. క్యూసెక్కులు, టిఎంసీల గూర్చి ఓనమాలు కూడా తెలియని కొత్త మంత్రికి ఏం చెప్పాలో తెలియదు.


మూడవ అబద్ధం రాజధాని అమరావతి. ఏపీ రాజధానిగా అమరావతిని చంద్రబాబు కంటే ఎంతో మిన్నగా నిర్మిస్తామని చెప్పారు. రాజధానికి 30 వేల ఎకరాలు కావాలనీ అసెంబ్లీలోనే ప్రకటించారు. రాజధాని మార్పుపై తనపై వచ్చే అబద్ధాలు, కారుకూతలని ప్రతిపక్ష హోదాలో జగన్‌ మోహన్‌ రెడ్డి అన్న మాటలు ప్రజల మరువలేదు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే రాజధానిపై ఉక్కుపాదం మోపారు.  ఎడారి అనీ, స్మశానం అనీ, కమ్మవారిదే అనీ, చంద్రబాబు బినామీలది అనీ చాలా పేర్లు పెట్టారు. రాజధాని రైతులను రోడ్డెక్కాలా చేశారు. మూడు రాజధానులు అనే మూర్ఖపు ఆలోచనతో మూడు ప్రాంతాల్లో విభజన మంటలు రేపారు. ఆంధ్రుల రాజధాని అమరావతిని దేశ ప్రజల ముందు నవ్వులపాలు చేశారు. ఆఖరికి అత్యున్నత న్యాయస్థానం రాజధాని మార్పు అధికారం శాసనసభకు లేదని చెబితే, న్యాయమూర్తులకు తాటాకులు కట్టారు. రాజ్యాంగ వ్యవస్థలపై కాలు దువ్వారు.


నాలుగో అబద్ధం విభజన హామీలు, ఆర్థిక లోటు. ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన వెనుకబడ్డ ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీ, ఏపీ ఆర్థిక లోటు భర్తీ గురించి జగన్మోహన్ రెడ్డి ఏనాడూ మాట్లాడరు. ఇస్తే ఒక దండం, ఇవ్వకుంటే రెండు దండాలు అన్నట్టుగా ఉంటుంది సిఎం వ్యవహార శైలి. ఆంధ్రుల హక్కుగా నిర్మాణం జరిగిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేతకు కూడా ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతోంది. ఫలితంగా కార్మికులు ఆందోళన మార్గం వీడలేదు. విశాఖ ఉద్యమాన్ని రాజకీయ కోణంలో ఆడుకోవడం తప్ప కార్మికుల డిమాండ్లకు పరిష్కారం చూపే సత్తా కూడా లేదు. మరో పెద్ద అబద్ధం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు. తెలుగు నేలపై ఎన్నడూ జరగనన్ని నేరాలు, ఘోరాల సంఘటనలు గత మూడేళ్లలో జరిగాయి. మాస్క్‌ అడిగితే డాక్టర్‌ సుధాకర్‌పై కేసులు పెట్టారు. పిచ్చోడిని చేశారు. హృద్రేకానికి గురయ్యేలా చేశారు. మాస్క్‌ పెట్టుకోలేదని చీరాల కిరణ్‌ను చావకొట్టారు. ఇసుక ట్రాక్టర్‌ను అడ్డుకున్నాడని పోలీసుస్టేషన్లోనే వరప్రసాద్‌కు శిరోముండనం చేశారు. మద్యం ధరలను ప్రశ్నిస్తే ఓంప్రకాష్‌ను ఆత్మహత్యకు పాల్పడేలా చేశారు. ప్రభుత్వ పాలనను విమర్శిస్తే, వెంకాయమ్మపై దాడి చేశారు. చోరీ కేసులో అబ్దుల్‌ సలాం పోలీసు వేధింపులకు తాళలేక నలుగురు కుటుంబసభ్యులతో రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలులో వజీరా, పులివెందులో నాగమ్మ, నంద్యాలలో మహాలక్ష్మి, గుంటూరులో రమ, చిలకలూరిపేటలో అనూష, గుంటూరులో భూక్య రమాబాయ్‌, డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం... ఇలా ఎందరో విగతజీవులయ్యారు. మానసిక వికలాంగురాలిపై, మూగ మహిళపై అత్యాచారాలు జరిగాయి. ప్రభుత్వాసుపత్రుల్లో, రైల్వేస్టేషన్లో అత్యాచారాలు నమోదయ్యాయి. పేరేచర్లలో ఒక దళిత మైనర్‌ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో 80 మంది నిందితులు ఉన్నారని పోలీసులే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయినా ప్రభుత్వం ప్రతి అంశాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీపై నిందలు వేస్తూ, ఏ ఒక్క సంఘటనకూ బాధ్యత తీసుకోవటం లేదు. ప్రతిపక్షాలపై దాడులు జరిగినా, ధరలు పెంచినా, చెత్తపన్ను వేసినా, లక్షల కోట్లు అప్పలు చేసినా అన్నింటికీ గత ప్రభుత్వంలో జరగలేదా? అన్నదే వైకాపా సమాధానం. ‘కులం పునాదులపై ఒక జాతిని కానీ, ఒక నీతిని కానీ నిర్మించలేము’ అని డా. బిఆర్‌ అంబేడ్కర్‌ అన్నట్లు అబద్ధాల పునాదులపై ఏ ప్రభుత్వాన్నీ నిర్మించలేము.

l పోతుల బాలకోటయ్య (అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు)

Updated Date - 2022-07-16T07:09:55+05:30 IST