ఏడాది క్రితం సరస్సులో పడిన ఐఫోన్.... ఏ స్థితిలో దొరికిందంటే...

ABN , First Publish Date - 2021-04-10T15:16:04+05:30 IST

తైవాన్ ప్రజలు గత కొంతకాలంగా నీటి ఎద్దడితో అలమటిస్తున్నారు.

ఏడాది క్రితం సరస్సులో పడిన ఐఫోన్.... ఏ స్థితిలో దొరికిందంటే...

తైపీ: తైవాన్ ప్రజలు గత కొంతకాలంగా నీటి ఎద్దడితో అలమటిస్తున్నారు. అయితే ఈ పరిస్థితులు ఒక వ్యక్తికి ఆనందానికి కారణమయ్యాయంటే ఎవరూ నమ్మలేరు. అవును.. తైవాన్‌లోని సన్‌మూన్ లేక్ ఇటీవల ఎండిపోయింది. దీంతో ఈ ప్రాంతంలోని చుట్టుపక్కల వారికి తాగు, సాగు నీటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఈ సరస్సు ఎండిపోవడం ఒమ మనిషికి గుడ్‌లక్‌గా పరిణమించింది. చెన్ అనే వ్యక్తి ఏడాది క్రితం సన్ మూన్ లేక్‌లో పెడల్ బోటింగ్ చేస్తూ, తన ఐఫోన్-11ను లేక్‌లో పోగొట్టుకున్నాడు. ఆ తరువాత వర్షాలు లేని కారణంగా  ఆ సరస్సు పూర్తిగా ఎండిపోయింది. 


ఈ నేపధ్యంలో ఒక స్వచ్ఛంద కార్యకర్తకు సరస్సులోని మట్టిలో చెన్‌కు సంబంధించిన ఐఫోను దొరికింది. దీంతో అతను చెన్‌ను సంప్రదించి, ఆ ఫోనును అప్పగించాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఇన్నాళ్లు నీటిలో ఉన్నప్పటికీ ఆ ఫోను పనిచేస్తోంది. తన ఫోను దొరికిన ఆనందంలో చెన్ ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో తెలియజేస్తూ, ఆ ఫోనుకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. తన ఫోన్ చక్కగా పనిచేస్తున్నదని, ఛార్జింగ్ కూడా అవుతున్నదని తెలిపాడు. కాగా ఈ ఫేస్ బుక్ పోస్టును 25 వేలకుపైగా నెటిజన్లు వీక్షించారు. 

Updated Date - 2021-04-10T15:16:04+05:30 IST