‘లాక్‌డౌన్‌’లో వందరోజుల జీవితం

ABN , First Publish Date - 2020-07-02T11:11:36+05:30 IST

కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించి నేటికి సరిగ్గా వంద రోజులు... పలు నిర్బంధాల మధ్య

‘లాక్‌డౌన్‌’లో వందరోజుల జీవితం

నేటికీ తెరుచుకోని విద్యాసంస్థలు, థియేటర్లు 

దారుణంగా దెబ్బతిన్న హోటల్‌, రవాణా రంగాలు

1500 దాటిన పాజిటివ్‌ కేసులు.. 7 మరణాలు

జిల్లాపై కరోనా ప్రభావం అపారం


తిరుపతి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించి నేటికి సరిగ్గా వంద రోజులు... పలు నిర్బంధాల మధ్య కూడా.. ఈ వంద రోజుల్లో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోగా, పలు కీలక రంగాలు తీవ్రమైన ఆటుపోట్ల మధ్య విలవిల్లాడుతున్నాయి. హోటళ్ళకు ధైర్యంగా వెళ్ళలేని పరిస్థితి. నచ్చిన ఆహారం కొనుక్కుని తినలేని దుస్థితి. సినిమాలు లేవు, పార్కులు లేవు. నిర్మాణ పనులకే కాదు ఇతర కార్యకలాపాలకూ ఇదివరకటిలా కూలీలు, స్కిల్డ్‌ వర్కర్లు దొరకడం లేదు. దుకాణానికి వెళ్లాలంటే భయం.. బస్సెకాల్కలంటే భయం. మాస్కులు ధరించినా, భౌతికదూరం పాటించలేని పరిస్థితుల మధ్య జనం బిక్కుబిక్కుమంటూనే సంచరిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదివరకెన్నడూ కనివిని ఎరుగని సరికొత్త జీవితం ఈ నూర్రోజుల్లో అనుభవంలోకి వచ్చింది. 


స్కూళ్లులేవు.. సినిమాల్లేవు..

లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన రోజే లండన్‌ నుంచి తిరిగొచ్చిన వ్యక్తితో జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు కాగా వంద రోజుల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1500 దాటేసింది. ఇప్పటి వరకూ ఏడుగురు కోవిడ్‌ బారిన పడి మరణించారు. జిల్లాలో మొత్తం 66 మండలాలుంటే 62 మండలాలకు వైరస్‌ వ్యాప్తి చెందింది. దీంతో దాదాపు జిల్లా అంతా కంటైన్‌మెంట్‌ జోన్‌ పరిధిలోనే వుంది.


ఫలితంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికీ పలు రంగాలు సడలింపులేని నిషేధాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు, యూనివర్శిటీలు, కోచింగ్‌ సెంటర్లు వంటివేవీ ఇంకా తెరుచుకోలేదు. కొన్ని స్కూళ్ళు, కాలేజీలు మాత్రం ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నాయి ఆగస్టు దాకా ఇదే పరిస్థితి కొనసాగనుంది. సినిమా ధియేటర్లు కూడా ఇప్పట్లో తెరిచే పరిస్థితి లేదు. పదుగురికి వినోదం పంచే పార్కులు కూడా ఇంకా తెరుచుకోలేదు. మద్యం షాపులు తెరుచుకున్నా బార్లు తెరవడానికి ఇంకా అనుమతి రాలేదు. జిమ్‌లతో సహా సాంస్కృతిక, మతపర కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతూనే వుంది.  


హోటల్‌, రవాణా రంగాలకు కోలుకోలేని దెబ్బ

నిషేధం లేకున్నా.. కరోనా వైరస్‌ సృష్టించిన భయోత్పాతం కారణంగా ఇప్పటికీ కోలుకోలేకున్న రంగాల్లో ప్రధానమైనవి హోటల్‌, ప్రైవేటు రవాణా వ్యవస్థలు. తిరుపతిలోని త్రీస్టార్‌ హోటళ్ళు మొదలుకుని రోడ్‌సైడ్‌ దుకాణాలు, తోపుడు బళ్ళ దాకా అందరి వ్యాపారం దారుణంగా దెబ్బతింది. పెద్ద హోటళ్ళలో ఎంత పరిశుభ్రత పాటిస్తున్నా  అక్కడికెళ్లి ఆహారం తీసుకోవడానికి జనం వెనుకాడుతున్నారు. జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలకు వచ్చిపోయే యాత్రికులతో నిత్యం కిటకిటలాడే లాడ్జీల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 


ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయింది. హోటళ్ళు, లాడ్జీల యాజమాన్యాలు నిర్వహణాపరమైన నష్టాలు ఎదుర్కొంటున్నాయి. అలాగే ట్రావెల్స్‌, ట్రాన్స్‌పోర్టు రంగాలు కూడా ఛిన్నాభిన్నమయ్యాయి. అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపే ప్రైవేటు బస్సు ఆపరేటర్లు తీవ్ర నష్టాల్లోకి వెళ్ళిపోయారు. కార్లు అద్దెకు నడిపేవారు, ట్రావెల్‌ ఏజెన్సీలు పెట్టుకున్నవారు ఆర్థికంగా చితికిపోయారు. వస్త్ర దుకాణాలు, చెప్పుల షాపులు, బ్యూటీ పార్లర్లు, సెలూన్లు వంటివి కూడా నామమాత్రంగానే నడుస్తున్నాయి.  

Updated Date - 2020-07-02T11:11:36+05:30 IST