Abn logo
Apr 15 2021 @ 23:52PM

‘శ్రీరామ’.. కనవేమిరా..!

అటకెక్కిన రూ.100కోట్ల అభివృద్ధి ప్రణాళిక 

శ్రీరామ ప్రాజెక్టుపై నోరుమెదపని నేటి పాలకులు 

ఇంకా అసంపూర్తిగానే కల్యాణ మండపం 

గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పరుగులు

రెండేళ్లవుతున్నా పట్టించుకోని ప్రస్తుత ప్రభుత్వం

ఇదీ ఒంటిమిట్ట కోదండరామాలయం స్థితి


రాజంపేట/ఒంటిమిట్ట(కడప): ఒంటిమిట్టలో ప్రసిద్ధిగాంచిన కోదండరాముని కోవెల ఉంది. రాష్ట్రం విడిపోయిన తరువాత ఈ ఆలయానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. గత సీఎం చంద్రబాబు రూ.100 కోట్లతో ఆలయాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి పనులు చేపట్టారు. అనంతరం జిల్లావాసి వైఎస్‌ జగన ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని అందరూ భావించారు. అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా ఆలయ అభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందించకపోగా, గత ప్రభుత్వ హయాంలో ప్రకటించిన నిధులను కూడా పూర్తిస్థాయిలో నేటికీ ఖర్చు పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. 


చేసిన అభివృద్ధి పనులు కొన్ని..

గత ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వంద కోట్ల రూపాయల అభివృద్ధి ప్రణాళికను ప్రకటించారు. అందులో ప్రధానంగా రూ.20కోట్లు పైబడి ఖర్చు చేసి శ్రీరామ ఎత్తిపోతల పథకం ద్వారా సోమశిల వెనుక జలాల నుంచి బృహత్తర నీటి పథకాన్ని చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ఒంటిమిట్ట చెరువుకు నీరందించారు. రూ.18కోట్లతో టీటీడీ కల్యాణ మండపాన్ని, రూ.5కోట్లతో ప్రజలు పెళ్లిళ్లు చేసుకోవడానికి ప్రత్యేక కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణికులు వేచి ఉండటానికి అతిథి భవనాలు, వీఐపీలు వేచి ఉండే గదులు, పుష్కరిణి ఏర్పాటు, పార్కుల సుందరీకరణ, రామాలయం లోపల చలువరాళ్లు, భక్తుల కోసం మరుగుదొడ్ల ఏర్పాటు, నిత్యం నిఘా విభాగానికి ఉపయోగపడే సీసీ కెమెరాల ఏర్పాటు, ఆలయానికి చుట్టూ మాడవీధుల ఆధునికీకరణ పనులు పూర్తి చేశారు. రూ.100 కోట్లకు గాను రూ.65కోట్ల పనులను పూర్తిచేశారు. మిగిలిన రూ.35 కోట్ల పనులు చేపట్టలేదు.


అసంపూర్తిగా ఉన్న కోదండరాముని కల్యాణ మండపం

చేయాల్సిన పనులు ఎన్నో...

- ప్రధానంగా కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగని శాశ్వత కల్యాణ వేదిక పూర్తి చేయాల్సి ఉంది. రూ.36 కోట్లతో గత ప్రభుత్వ హయాంలో కలశ ఆకారంలో జర్మన టెక్నాలజీతో ఈ కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే ప్రస్తుతం రెండు గ్యాలరీలతో కూడిన కల్యాణ మండపాన్ని కేవలం రూ.18 కోట్లతో పూర్తిచేశారు. కలశ ఆకారంలో దీని నిర్మాణం పూర్తి కావాలంటే మరో రూ.18కోట్లు అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో దీని నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశముంది. కల్యాణమండపం కలశం ఆకారంలో నిర్మాణం పూర్తికాకపోవడంతో భారీ వర్షాలు కురిస్తే ఇక్కడ భక్తులకు ఇబ్బందులు తప్పవు.


- శ్రీరాముని జీవిత ఇతివృత్తం కళ్లకుకట్టినట్లుగా తెలిసేలా రూ.28 కోట్లతో నాటి ప్రభుత్వం ‘శ్రీరామ ప్రాజెక్టు’కు రూపలక్పన చేసింది. ఆలయానికి పక్కనే ఉన్న సత్రపాలెం గుట్టను ఆధారంగా చేసుకొని ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. శ్రీరాముని జీవిత ఘట్టాలు తెలిసే విధంగా ఆలయం చుట్టూ పరిసరాలు, ఆలయానికి పక్కన చెరువును, ప్రధాన రహదారిని పూర్తిగా ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని తలచారు. కోదండరాముని విగ్రహాలను ఆవిష్కరించిన ఆదిభక్తుడు జాంబవంతుని 45 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. ట్యాంక్‌ బండ్‌ రీతిలో ఒంటిమిట్ట చెరువుకట్ట చుట్టూ, ఆలయం ముంగిట దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఆలయానికి అటూ ఇటూ కడప-చెన్నై జాతీయ రహదారి ప్రాంతంలో సుమారు 10కిలోమీటర్ల మేర శ్రీరాముని స్వాగత తోరణాలు, హరిత వనాలు ఏర్పాటు చేయడం ఇందులో భాగం. ఈ ప్రాజెక్టుకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టాల్సి ఉండగా అప్పట్లో కల్యాణం జరిగే సమయంలో భారీ ఈదురుగాలులు వీచి నలుగురు చనిపోవడంతో ఈ పనిని చేపట్టలేకపోయారు. అనంతరం ప్రభుత్వం మారిన తరువాత ఈ అంశం కూడా అటకెక్కింది. ఈ ఏడాదైనా కోదండరాముడి కల్యాణానికి ముఖ్యమంత్రి వస్తే దీనిపై స్పష్టత ఇస్తారని జల్లా ప్రజలు ఆశిస్తున్నారు.


- కోదండరాముని ఆలయాన్ని అభివృద్ధి చేసిన వావిలకొలను సుబ్బారావు ఆలయాన్ని, పోతనామాత్యుని ఘాట్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంది.  తిరుమల రీతిలో ఒంటిమిట్టలో సైతం భక్తులకు నిత్యం అన్నదాన కార్యక్రమం, ప్రసాదాల వితరణ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నిత్యాన్నదానం నిర్వహిస్తే భక్తుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఒంటిమిట్ట చెరువులో కావాల్సినంత నీరున్నా బోటు షికారు చేయించి భక్తులను, పర్యాటకులను పెంచుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు.


శ్రీరామ ప్రాజెక్టుపై ఆదేశాలు లేవు: హర్షవర్ధనరెడ్డి, టీటీడీ డీఈ

ఒంటిమిట్టలో ఇప్పటివరకు వందకోట్ల అభివృద్ధి ప్రణాళికలో రూ.65కోట్ల పనులు పూర్తి చేశాం. మరో రూ.35కోట్ల పనులు చేపట్టాల్సి ఉంది. అందులో ప్రధానమైనది శ్రీరామ్‌ ప్రాజెక్టు.  మూడేళ్ల క్రితం రూ.28 కోట్లతో ప్రణాళిక రూపొందించాం. ఈ ప్రాజెక్టు పనుల విషయమై ఉన్నతాధికారుల నుంచి మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. కల్యాణ మండపాన్ని టీటీడీ ఉన్నతాధికారులు నిర్దేశించిన ప్రకారం రూ.18కోట్లతో పూర్తి చేశాం. ఇప్పటివరకు చేపట్టిన పనులు ఏ మేరకు భక్తులు ఉపయోగపడతాయన్న అంశంపై దృష్టిపెట్టి మిగిలిన పనులను ఉన్నతాధికారుల ఆదేశల మేరకు చేపడతాం.


Advertisement
Advertisement
Advertisement