నెరవేరిన కల

ABN , First Publish Date - 2022-02-15T04:47:57+05:30 IST

మెరుగైన, నాణ్యమైన జీవన వనరులు కల్పించేందుకు ఉపయుక్తమయ్యే అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది.

నెరవేరిన కల
ముడాతో జరుగనున్న అభివృద్ధి నమూనా

ముడాను ఏర్పాటు చేస్తూ జీవో నంబర్‌ 26 విడుదల


మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మెరుగైన, నాణ్యమైన జీవన వనరులు కల్పించేందుకు ఉపయుక్తమయ్యే అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. మహబూబ్‌నగర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అఽథారిటీ (ముడా)ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ సోమవారం జీవోఎంఎస్‌ నెంబర్‌ 26 విడుదల చేశారు. ముడా చైర్మన్‌గా మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, వైస్‌ చైర్మన్‌గా మునిసిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌ను నియమించడంతో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే చర్లకోల లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డిని అథారిటీలో సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరితో పాటు రాష్ట్ర ఆర్థికశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ గానీ, ఆయనచే నామినేట్‌ అయ్యేవారుగానీ మరో సభ్యుడుగా ఉంటారని, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌, టౌన్‌అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ కూడా సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో తెలిపారు.


3 మునిసిపాలిటీలు, 142 గ్రామ పంచాయతీలతో...

మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, భూత్పూర్‌ మునిసిపాల్టీలతో పాటు మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంలోని 16 గ్రామాలు, హన్వాడ మండలంలోని 13, నవాబ్‌పేట మండలంలోని 20, రాజాపూర్‌ మండలంలోని 16, జడ్చర్ల మండలంలోని 22, భూత్పూర్‌ మండలంలోని 13, మూసాపేట మండలంలోని 12, దేవరకద్ర మండలంలోని ఐదు, కోయిలకొండ మండలంలోని ఎనిమిది, గండీడ్‌ మండలంలోని రెండు, బాలానగర్‌లోని 15 గ్రామాలు కలిపి మొత్తం 142 గ్రామాలను ముడా పరిధిలోకి తెచ్చారు. మూడు మునిసిపాలిటీల మధ్యలోని పూర్తి ప్రాంతాలతో పాటు, హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై బాలానగర్‌ మండలం నుంచి మూసాపేట మండలం లిమిట్స్‌ వరకు, అదేవిధంగా జడ్చర్ల- రాయచూరు ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న మహబూబ్‌నగర్‌, దేవరకద్ర మండలాల్లోని గ్రామాలు, మహబూబ్‌నగర్‌-తాండూరు రోడ్డుతో పాటు, మహబూబ్‌నగర్‌ పట్టణ పరిసరాల్లోని కోయిలకొండ, హన్వాడ, గంఢీడ్‌ మండలాల్లో వేగవంతమైన అభివృద్ధికి అవకాశముండే గ్రామాలను ముడా పరిధిలోకి తెచ్చారు. 


హెచ్‌ఎండీఏ తరహాలో అభివృద్ధి

ముడా ఏర్పాటుతో మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, భూత్పూర్‌ మునిసిపాల్టీలతో పాటు దీని పరిధిలోకి వచ్చిన 142 గ్రామ పంచాయతీల్లో ప్రణాళికాబద్ధంగా సమీకృతమైన రీతిలో మౌలిక వనరులను కల్పించనున్నారు. డిజైన్డ్‌ మాస్టర్‌ ప్లాన్‌తో సమగ్రాభివృద్ధికి అవకాశం ఏర్పడనుంది. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఏర్పాటుతో మునిసిపాలిటీలతో పాటు సబర్బన్‌ ప్రాంతాల్లోనూ తాగునీరు, విద్యుదీకరణ, రోడ్ల నెట్‌వర్క్‌తో పాటు ఉపాధి కల్పన ప్రణాళికగా చేయనున్నారు. పాలమూ రులో అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా మహబూబ్‌నగర్‌ కేంద్రంగా ముడాను ఏర్పాటు చేస్తున్నామని, దీంతో భవిష్యత్‌లో ఇది అభివృద్ధికి నమూనాగా నిలుస్తుందని జీవోలో ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. 


మాస్టర్‌ప్లాన్‌తో వనరుల కల్పన

ముడా పరిధిని నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మూడు మునిసిపాలిటీలతో పాటు రెండు జాతీయ రహదారుల సమీపంలోని గ్రామాలు, మూడు పట్టణాలకు పది కిలోమీటర్ల వ్యాసార్థంలోని గ్రామాలను దీని పరిధిలోకి తెచ్చారు. తద్వారా భవిష్యత్‌లో పట్టణీకరణకు, ఉపాధి కల్పనకు, మౌలిక వసతుల ఏర్పాటుకు ఇబ్బందులు లేకుండా చూశారు. భవిష్యత్‌లో నిర్మాణం పూర్తయ్యే కరివెన, ఉదండాపూర్‌ రిజర్వాయర్లను దీని పరిధిలోకి తేవడం ద్వారా తాగునీటి ఇబ్బందులతో పాటు ముడా పరిధిలో భవిష్యత్‌లో ఏర్పాటు చేయబోయే వ్యవసాయ, ఉద్యానవన, కూరగాయలు, పూల తోటల జోన్లకు నీటి ఇబ్బందిలేకుండా చూశారు. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ ప్రతిపాదిస్తున్న ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (బెంగుళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారి) ఏర్పాటైతే ముడా పరిధిలోకి వచ్చే బాలానగర్‌ నుంచి మూసాపేట లిమిట్స్‌ వరకు ఉన్న ప్రాంతాల్లో పరిశ్రమలు, కంపెనీల ఏర్పాటుకు అనుమతుల విషయంలో ఆటంకాలు ఉండవు. ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్‌ జోన్‌గా ప్రకటించే అవకాశం స్పష్టమవుతోంది. జడ్చర్ల సెజ్‌ని సైతం ముడా పరిధిలోకి తెచ్చారు. అదే విధంగా ముడా ఏర్పాటుతో వాటర్‌ జోన్లకు రక్షణ లభిస్తుంది. ఇప్పటికే ఈప్రాంతాల్లో చెరువులు, కుంటలు ధ్వంసమై ప్లాట్లుగా మారాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇకపై అలాంటి ఆక్రమణలకు చెక్‌ పెట్టేందుకు, వాటర్‌ జోన్లను సంరక్షించేందుకు ముడాలో చట్టబద్దమైన నియమాలుంటాయి. ముడా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించడం ద్వారా ఈ ప్రాంతంలో నివాస, వాణిజ్య స్థలాలకు, పారిశ్రామిక స్థలాలకు ప్రత్యేకంగా జోన్లు కేటాయించడం ద్వారా కచ్చితమైన ప్రణాళిక ద్వారానే ఆయా రంగాల వృద్ధికి ఆస్కారం ఉండనుంది. పట్టణీకరణకు అనుగుణంగా రోడ్లు, పార్కులు, హోటళ్లు, రిసార్ట్‌లు, రెస్టారెంట్లు, గోదాములు, లింకు రోడ్లు, వ్యాపార కూడళ్లు ఏర్పాటవుతాయి. అదేవిధంగా పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రత్యేకంగా జీవనోపాధుల కల్పనకు ఆస్కారం ఏర్పడుతుంది. భవిష్యత్‌లో దేవరకద్ర సమీపంలో ఏర్పాటు చేస్తామంటోన్న మన్యంకొండ ఎయిర్‌పోర్ట్‌ ప్రతిపాదిత దేవరకద్ర మండలంలోని గ్రామాలను సైతం ముడా పరిధిలోకి తెచ్చారు. అదేవిధంగా రైల్వేలైన్‌ సైతం ముడా పరిధిలో ఉండడంతో దానికనుగుణంగా లాజిస్టిక్‌ హబ్స్‌ని ఏర్పాటు చేసే అవకాశముంది. మొత్తంగా ముడా కోసం రూపొందించే మాస్టర్‌ ప్లాన్‌లో లివింగ్‌ జోన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్స్‌, కమర్షియల్‌ జోన్స్‌, లాజిస్టిక్‌ హబ్స్‌, ఇండస్ట్రియల్‌ జోన్లు, వాటర్‌బాడీస్‌, ఇంటర్నల్‌ రోడ్లు, రింగురోడ్లు, విద్యుత్‌ లైన్లు, వ్యవసాయ జోన్లు, ఉద్యానవన జోన్లు, కూరగాయలు, పూల ఉత్పత్తికి ప్రత్యేక జోన్లు ఇలా జనజీవనానికి అవసరమైన అన్ని సదుపాయాలు, వనరులు ఒక క్రమ పద్ధతిలో దీని పరిధిలో ఏర్పాటయ్యేలా కార్యాచరణ రూపొందిస్తారని తెలుస్తోంది.


మినీ హైదరాబాద్‌గా పాలమూరు: మంత్రి

మహబూబ్‌నగర్‌: ఇప్పటికే హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న సిటీగా మహబూబ్‌నగర్‌ ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఇక మహబూబ్‌నగర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ముడా)తో భవిష్యత్తులో పాలమూరు మినీ హైదరాబాద్‌కు రూపాంతరం చెందనుందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. కేసీఆర్‌ను జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ముడా ఏర్పాటు చేయాలని కోరిన వెంటనే సోమవారం అర్బన్‌ అథారిటీగా ఏర్పాటు చేస్తూ జీఓ నంబర్‌ 26 విడుదల చేసినందుకు జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే లు సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌కు పేరు తెచ్చింది హెచ్‌ఎండీఏ అని, పాలమూ రుకు ఆ తరహాలో ముడా పేరు తెస్తుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న మునిసిపాలిటీలు అలానే ఉంటాయని, గ్రామాల్లో పెద్ద ఎత్తున అర్బన్‌ అథారిటీ కార్యక్రమాలు జరుగుతాయని, మునిసిపాలిటీలలోనూ అర్బన్‌ అథారిటీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కేసీఆర్‌ లాంటి వ్యక్తి జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశంలోని చాలా రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర పార్టీగానే ఉంటదని, టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా కాకుండా జాతీయ స్థాయిలో కేసీఆర్‌ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే తామంతా మద్దతు తెలుపుతామనే డిమాండ్‌ వస్తుందన్నారు. 16-17 రాష్ట్రాలలో అనేక వర్గాల ప్రజల నుంచి ఒత్తిడి వస్తోందన్నారు. తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్‌ను చూసి నవ్వారని, ఇప్పుడు కేసీఆర్‌ను ఈజీగా తీసుకుంటే రేపు భవిష్యత్‌ కేసీఆర్‌ అంటే ఏంటో అర్థమైతదన్నారు. కేసీఆర్‌ కాలిగోటికి కూడా సరిపోని కొందరు ఆయన గురించి మాట్లాడుతున్నారని, కేసీఆర్‌ను తిడితే ప్రజలు మెచ్చుకోరన్నారు. బీజేపీ ఓడిపోయిన పువ్వు అని, టీఆర్‌ఎస్‌ వికసించే పువ్వు అని ఎద్దేవా చేశారు. 


మూడ్రోజుల పాటు సీఎం జన్మదిన వేడుకలు

ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం ఉన్నందున 15, 16, 17 తేదీల్లో జన్మదిన వేడుకలు జరపాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. 15న పండ్లు దుస్తుల పంపిణీ, 16న నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు, 17న గ్రామాలు, పట్టణాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కేసీఆర్‌ జన్మదిన వేడుకలు అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. సమావేశంలో నాయకులు కోడ్గల్‌ యాదయ్య,  శివకుమార్‌, కోరమోని నర్సింహులు, రాజేశ్వర్‌గౌడ్‌, గోపాల్‌యాదవ్‌, తాటిగణేష్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-02-15T04:47:57+05:30 IST