తీరనున్న 40 ఏళ్ల కల

ABN , First Publish Date - 2020-10-01T09:50:28+05:30 IST

జగదేవ్‌పూర్‌ మండలం కొత్తపేట గ్రామస్థుల 40 ఏళ్ల కల సాకారం కానుంది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న పట్టాదారు పాసు పుస్తకాలు

తీరనున్న 40 ఏళ్ల కల

ఫలించిన 32 మంది అధికారుల శ్రమ

ఊపిరి పీల్చుకోనున్న 125 మంది రైతులు

పట్టాలకు నోచుకోనున్న 500 ఎకరాల భూమి

ముగింపు దశకు కొత్తపేట రైతుల సమస్య

డిజిటల్‌ భూసర్వే పూర్తి చేసిన అధికారులు  

త్వరలోనే పట్టాపాస్‌ బుక్కులు అందజేయనున్న సీఎం!


గజ్వేల్‌, సెప్టెంబరు 30:  జగదేవ్‌పూర్‌ మండలం కొత్తపేట గ్రామస్థుల 40 ఏళ్ల కల సాకారం కానుంది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న పట్టాదారు పాసు పుస్తకాలు అధికారికంగా రైతులకు అందనున్నాయి. దాదాపుగా నెల నుంచి  కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి పర్యవేక్షణలో గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి భూహక్కులపై కుస్తీ పడుతున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గజ్వేల్‌ డివిజన్‌ రెవెన్యూ అధికారి, నలుగురు తహసీల్దార్లు, ల్యాండ్‌ సర్వే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌, ఐదుగురు సర్వేయర్లు, మరో 20 మంది రెవెన్యూ సిబ్బంది భూ సమస్యలను పరిష్కరించేందుకు తీవ్రంగా శ్రమించి ఓ కొలిక్కి తీసుకొచ్చారు. ఇనాందార్ల నుంచి ఓఆర్‌సీ (ఆక్యూపెన్సీ రైట్‌ సర్టిఫికెట్‌)లను తీసుకుని రైతులకు హక్కులను కల్పించనున్నారు. 


ఇటిక్యాల రెవెన్యూ గ్రామపరిధిలోని కొత్తపేట గ్రామపంచాయతీ పరిధిలో దాదాపు 500 ఎకరాల భూమిలో జాగిర్దార్లు ఇనాం పట్టాదార్లుగా సేత్వార్‌ నుంచి నమోదై ఉన్నారు. అనంతరం ఈ భూమిని 125 మంది రైతులు దున్నడంతో వారికి పట్టా చేశారు. 50 ఏళ్ల పాటు పట్టాదారులుగా కొనసాగిన రైతులకు 2017లో నిర్వహించిన రికార్డుల ప్రక్షాళనలో పట్టాదారు పాసుపుస్తకాలు అందలేదు. రైతులందరూ వేచి చూసి 2018 నవంబరు 27న.. సార్వత్రిక ఎన్నికల ముందు తమ భూములకు పాసుపుస్తకాలు ఇస్తేనే ఓట్లేస్తామని గ్రామపంచాయతీ ఎదుట తీర్మానం చేశారు. స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తాను సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం అధికారులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పక్కాగా, పకడ్భందీగా సర్వే చేశారు. ఏ రైతుకూ గజం భూమి కూడా తేడా రాకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా జియో ట్యాగింగ్‌ చేయించారు.. 


జాగీర్దార్లు సీలింగ్‌ ఇవ్వడంతోనే ఇబ్బంది

గతంలో జాగీర్దార్లు సీలింగ్‌ యాక్ట్‌లో భాగంగా ఈ భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. ప్రభుత్వం సీలింగ్‌ పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నించడంతో కొందరు రైతులు తీసుకోగా మరికొందరు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో దాదాపు 30 ఏళ్ల క్రితం ఇనాం భూములుగా పేర్కొంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఓఆర్‌సీ(ఆక్యుపెన్సీ రైట్‌ సర్టిఫికెట్లు) అందజేసింది. తమ బాధలు తీరాయని రైతులు భావించారు. భూముల ధరలు పెరుగుతున్న క్రమంలో దాదాపు పదేళ్ల క్రితం... రెవెన్యూ యంత్రాంగం జాగీర్దార్లు ఇచ్చిన సీలింగ్‌ ఫైల్‌ను తెరపైకి తెచ్చింది. దీంతో ఈ భూమి సమస్య మళ్లీ మొదటికొచ్చింది. 


ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో మరోసారి ఓఆర్‌సీ సర్టిఫికెట్లను మంజూరు చేస్తున్నారు. ఏ రైతుకు ఎంత భూమి ఉన్నదో సర్వే చేస్తూ, ఆ భూమిపై హక్కులు కల్పిస్తూ, 1బీ, పట్టాదారు పాసుపుస్తకాలను అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 


పకడ్బందీగా ‘ఓఆర్‌సీ’ సర్టిఫికెట్లు

భవిష్యత్‌లో భూ సమస్యలు పునరావృతం కాకుండా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి సారథ్యంలో పకడ్భందీగా ఓఆర్‌సీ సర్టిఫికెట్లను కొత్తపేట రైతులకు జారీ చేయనున్నారు. ప్రతీ రైతు భూమిని సర్వే మార్కు చేసి, స్కెచ్‌ వేసి జియో రిఫరెన్స్‌ ఇస్తున్నారు. ఈ జియో రిఫరెన్స్‌ను ఓఆర్‌సీ సర్టిఫికెట్‌కు జత చేస్తారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ నుంచి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, 1బీలను అందించే అవకాశం ఉంది!

Updated Date - 2020-10-01T09:50:28+05:30 IST