సాగుకు సాయం చేసే రోబో.. 17 ఏళ్ల కుర్రాడి సృష్టి

ABN , First Publish Date - 2020-10-12T18:58:45+05:30 IST

సాగుకు సాయం చేయాలనే ఆలోచనే స్ఫూర్తిగా ఓ 17 ఏళ్ల కుర్రాడు అద్భుతం సృష్టించాడు. ప్రోటోటైప్‌ సాయిల్‌ టెస్టింగ్‌ రోబో అగ్రిబోట్‌ను రూపొందించాడు. ఈ అగ్రిబోట్‌ వ్యవసాయానికి ఎంతగానో...

సాగుకు సాయం చేసే రోబో.. 17 ఏళ్ల కుర్రాడి సృష్టి

మంగళూరు: సాగుకు సాయం చేయాలనే ఆలోచనే స్ఫూర్తిగా ఓ 17 ఏళ్ల కుర్రాడు అద్భుతం సృష్టించాడు. ప్రోటోటైప్‌ సాయిల్‌ టెస్టింగ్‌ రోబో అగ్రిబోట్‌ను రూపొందించాడు. ఈ అగ్రిబోట్‌ వ్యవసాయానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భూమిలోని తేమ శాతాన్ని, ఉష్ణోగ్రతను, సారాన్ని గుర్తించి తెలియజేస్తుంది. ఈ పరీక్ష కోసం అగ్రబోట్‌ పొలంలోని వివిధ ప్రాంతాల్లో నుంచి శాంపిల్స్‌ను సేకరిస్తుంది. దీనివల్ల రైతులు పొలంలో ఏ పంట వేయాలో నిర్ధారించుకోగలుగుతారు. 


సార్తిక్‌ కుమార్‌.. మంగుళూరులోని కొడియాల్‌బలి ప్రాంతంలో ఎక్స్‌పర్ట్‌ పీయూ కాలేజ్‌లో రెండో సంవత్సరం ఇంటర్‌మీడియట్‌ చదువుతున్నాడు. సార్తిక్‌కు చిన్నప్పటి నుంచే టెక్నాలజీ అంటే ఎంతో ఇష్టం. వయసుతో పాటు ఆ ఇష్టం కూడా పెరిగింది. ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉండేవాడు. రోబోటిక్స్‌, ఆల్గారిథమ్స్‌, 3డీ మోడలింగ్‌, హ్యాకింగ్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ వంటి అనేక విషయాలపై సార్తిక్‌కు ఎంతో ఆసక్తి. దానికి తోడు పంట పండించే సమయంలో రైతులు పడుతున్న కష్టాలు సార్తిక్‌ను కదిలించాయి. దాంతో ఎలాగైనా వ్యవసాయానికి ఉపయోగపడే టెక్నాలజీని తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ సమయంలోనే సాయిల్‌ టెస్టింగ్‌పై అతడి దృష్టి పడింది. రైతులు పంట పండించడానికి సాయిల్‌ టెస్టింగ్‌ చేయించడం ఎంతో అవసరం. అయితే అధికారులు పొలంలోని మట్టి నమూనాలను సేకరించి తీసుకెళ్లి, పరీక్షించి, వాటి ఫలితాలను అందజేసేందుకు చాలా సమయం పడుతుంది. దీనివల్ల విలువైన సమయం వృధా అవుతుంది. అది గమనించిన సార్తిక్‌ వేగంగా సాయిల్‌ టెస్టింగ్‌ చేసేలా ఏదైనా తయారు చేయాలనుకున్నాడు. అలా వచ్చిన ఆలోచన ఫలితమే ఈ అగ్రిబోట్‌.


ఈ అగ్రిబోట్‌ ఓ మెబైల్‌ యాప్‌తో కనెక్ట్‌ అయి ఉంటుంది. పంట పొలంలో తాను సేకరించిన సమాచారాన్నంతా క్షణాల్లో ఆ అప్లికేషన్‌కు పంపుతుంది. అంతేకాదు దీనిని పూర్తిగా అప్లికేషన్‌ సాయంతో నడిపించవచ్చు. ఎక్కడి నుంచి శాంపిల్స్‌ సేకరించాలి..? ఏ స్థాయిలో సేకరించాలి..? అలా సేకరించిన శాంపిల్స్‌లో తేమ శాతాన్ని, ఉష్ణోగ్రత స్థాయిని, సారాన్ని గుర్తించి వాటి వివరాలను అందజేస్తుంది. అలా వచ్చిన వివరాలను అప్లికేషన్‌లోని ఇంటర్‌ఫేస్‌ అనలైజ్‌ చేసి ఏ పంట పండించేందుకు అనుకూలంగా ఉందో రైతుకు తెలియజేస్తుంది. అంతేకాకుండా పంటను పండించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా సూచిస్తుంది.


అగ్రిబోట్‌ను తయారు చేయడంపై సార్తిక్‌ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. రైతులకు ఉపయోగపడగలుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందంటున్నాడు. ఈ అగ్రిబోట్‌ రూపకల్పనలో తన మెంటార్‌ అక్షయ్‌ అధ్యంతయకు తాను రుణపడి ఉంటానని, ఈ ప్రోటోటైప్‌ను తాను మొదటి సంవత్సరం ఇంటర్మీడియెట్‌లో ఇద్దరు స్నేహితులతో కలిసి తయారు చేశానని సార్తిక్‌ చెబుతున్నాడు. ఈ అగ్రిబోట్‌ను 2019 ఎన్‌ఐటీకేలో జరిగిన ఇంజికనెక్ట్‌-2019, సెయింట్‌ అలోసియస్‌ కాలేజ్‌లో జరిగిన ప్రీ యునీక్‌-2019లోనూ ప్రదర్శనకుంచారు. అక్కడ వీక్షకులను ఈ అగ్రిబోట్‌ ఎంతగానో ఆకట్టుకుంది. 


సార్తిక్‌ వంటి యువ రూపకర్తలకు ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం అందితే వారు మరింత గొప్పగా దేశానికి ఉపయోగపడగలరు. ఇంకా ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేయగలరు. 

Updated Date - 2020-10-12T18:58:45+05:30 IST