గుడ్‌న్యూస్.. కోవీషీల్డ్‌కు ఐరోపా దేశాల అనుమతి!

ABN , First Publish Date - 2021-07-01T20:42:54+05:30 IST

యూరోప్ దేశాలకు వెళ్లాలనుకుంటున్న భారత ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్! కోవీషీల్డ్‌ టీకాను గుర్తిస్తున్నట్టు ఏకంగా ఎనిమిది ఈయూ దేశాలు తాజాగా ప్రకటించాయి.

గుడ్‌న్యూస్.. కోవీషీల్డ్‌కు ఐరోపా దేశాల అనుమతి!

న్యూఢిల్లీ: యూరోప్ దేశాలకు వెళ్లాలనుకుంటున్న భారత ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్!  కోవీషీల్డ్‌ టీకాను గుర్తిస్తున్నట్టు ఏకంగా ఎనిమిది ఈయూ దేశాలు తాజాగా ప్రకటించాయి. స్విట్జర్‌ల్యాండ్‌తో పాటూ ఈయూ దేశాలైన ఆస్ట్రియా, జర్మనీ, స్లోవేనియా, గ్రీస్, ఐస్‌ల్యాండ్, ఐర్లాండ్, స్పెయిన్‌‌, ఎస్టోనియా దేశాల ప్రభుత్వాలు కోవీషీల్డ్‌‌ టీకాను అనుమతిస్తామంటూ తాజాగా ప్రకటించాయి. కరోనా నేపథ్యంలో టీకా తీసుకున్న విదేశీ ప్రయాణికులనే ఐరోపా దేశాల్లోకి అనుమతించేందుకు వీలుగా ఐరోపా సమాఖ్య గ్రీన్ పాస్(టీకా పాస్‌పోర్ట్) విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూరోపియన్ మెడికల్ ఎజెన్సీ కేవలం నాలుగు కరోనా టీకాలను మాత్రమే ఆమోదిత టీకాల జాబితాలోకి చేర్చింది. దీంతో..ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు తీసుకున్న వారికి మాత్రమే గ్రీన్ పాస్ జారీ అయ్యే అవకాశం ఉండగా..భారత్‌లో తయారైన కోవిషీల్డ్‌ తీసుకున్న వారికి ఈ పాస్ రాదన్న ఆందోళనలు బయలు దేరాయి.


ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగి.. భారత్‌లో తయారైన టీకాలనూ గుర్తించాల్సిందేనంటూ ఈయూ దేశాలకు తేల్చి చెప్పింది. లేని పక్షంలో భారత్‌కు వచ్చే ఈయూ ప్రయాణికులకు కూడా ఇబ్బందులు తప్పవని ఖరాఖండీగా చెప్పింది. దౌత్యపరంగా భారత్ తెస్తున్న ఒత్తిడి సత్ఫలితాలను ఇవ్వడంతో తొలిసారిగా తొమ్మిది ఈయూ దేశాలు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవీషీల్డ్‌ను గుర్తిస్తున్నట్టు తాజాగా ప్రకటించాయి. 


ఐరోపా సమాఖ్య నిబంధనల ప్రకారం.. కొన్ని కరోనా టీకాలకు ఈఎమ్ఏ గుర్తింపు లేకపోయినప్పటికీ, సభ్య దేశాలు తమ అవసరాలను బట్టి వీటిని అమోదించవచ్చు. లేదా.. అమోదిత టీకా జాబితాలో లేని టీకా తీసుకున్న వారు దేశంలోకి ప్రవేశిస్తే వారిని నిర్దేశిత కాలంపాటు క్వారంటైన్‌కు పరిమితం చేయచ్చు. ఇది ప్రస్తుతం భారతీయులకు తలనొప్పిగా మారింది. ఈ దశలో కల్పించుకున్న కేంద్రం.. భారత్‌కు వచ్చే ఐరోపా ప్రయాణికులకు కూడా క్వారంటైన్‌కు పరిమితం చేయాల్సి వస్తుందని ఈయూ దేశాలను హెచ్చరించింది. భారత్ ఒత్తిడి ఫలించడంతో ఈయూ దేశాలు దిగొచ్చి..కోవీషీల్డ్‌ను గుర్తించాయి.


కాగా.. టీకా పాస్‌పోర్టుల విధానాన్ని భారత్ తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది. భారత్ వంటి దేశాల్లో దేశ జనాభాతో పోలిస్తే టీకాలు తీసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉండటంతో వ్యాక్సిన్ తీసుకున్న వారినే అనుమతిస్తామనే విధానం వివక్షాపూరితమనేది భారత్ వాదన. ఇటీవల జరిగిన జీ7 ఆరోగ్య శాఖ మంత్రుల సమావేశంలో కేంద్ర మంత్రి డా. హర్ష వర్ధన్ ఇదే విషయాన్ని లేవనెత్తారు. 



Updated Date - 2021-07-01T20:42:54+05:30 IST