కరోనా..530

ABN , First Publish Date - 2020-06-07T07:27:15+05:30 IST

జిల్లాలో శనివారం కొత్తగా 8 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కరోనా..530

కొత్తగా 8 కరోనా పాజిటివ్‌ కేసులు

పాజిటవ్‌ నమోదైన ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ జోన్లు

జిల్లావ్యాప్తంగా కరోనా పరీక్ష కేంద్రాల పెంపు

స్వచ్ఛందంగా పరీక్ష చేయించుకోవాని కలెక్టర్‌ పిలుపు


ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, జూన్‌6: జిల్లాలో శనివారం కొత్తగా 8 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సెక్రటరియేట్‌లో రెండు, సత్తెనపల్లిలో రెండు, నాదెండ్ల మండలం అమీన్‌సాహెబ్‌పాలెం, నవులూరు, పత్తిపాడు, పాత గుంటూరులో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగుచూశాయి. వీటితో కలిపి జిల్లాలో కేసుల సంఖ్య 530కి చేరింది. ఇవికాక పొందుగుల చెక్‌పోస్ట్‌ వద్ద ఏపీలోకి వస్తున్న వారికి నిర్వహించిన పరీక్షలలో ఎనిమిది మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో నాదెండ్లకు చెందిన ఇద్దరు, దామచర్లకు చెందిన ఒకరు ఉన్నారు.


వీటిని ప్రభుత్వం అధికారికంగా నిర్థారించలేదు. నరసరావుపేట బరంపేటలోని మహిళకు కరోనా నిర్ధారణ అయినట్టు ఆర్డీవో ఎం.వెంకటేశ్యర్లు శనివారం ప్రకటించారు. దీంతో పట్టణంలో కేసుల సంఖ్య 201కి చేరింది. బరంపేట మసీదు ప్రాంతంలో 200 మీటర్లు కంటెన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి బారికేడ్లు ఏర్ఫాటు చేశారు. ఆమెకు సంబంధించిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లు 26 మందిని గుర్తించి క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.


ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి  శ్రీనివాసరెడ్డి పర్యటించారు.  పత్తిపాడులో మార్కెట్‌లో పనిచేసే వ్యక్తికి గతంలో కరోనా పాజిటివ్‌ రాగా ఇప్పుడు అతని భార్యకు కూడా వైరస్‌ సోకింది. వారు నివాసం ఉండే రామానగర్‌ కాలనీలో 96 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. నవులూరు గ్రామ పరిధిలోని గోలివారితోటలోని అపార్టుమెంటులో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నాదెండ్ల మండలంలోని అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామంలో పుట్టింటికి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడం కలకలం రేపింది. 


తాడికొండ మండల పరిధిలోని కంతేరులో ఓ వృద్ధురాలు ఈనెల 1వ తేదీన అనారోగ్యంతో చనిపోవటంతో ఆమె బంధువు ఒకరు హైదరాబాద్‌ నుంచి కంతేరు వచ్చారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే క్రమంలో ఏపీ బోర్డర్‌లో శాంపిల్స్‌ను సేకరించి పంపించారు. ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. సత్తెనపల్లి పట్టణంలో ఇటీవల మృతిచెందిన వ్యక్తికి సంబంధించిన సోదరుడు, కుమార్తెకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. భావనాఋషినగర్‌ ప్రాంతంలో అధికారులు పర్యటించారు. రాజుపాలెం మండలం ఇనిమెట్లలో ఓ వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో ప్రైమరీ కాంటాక్టు ఉన్న సుమారు 123 మందిని చిలకలూరిపేటలోని క్వారంటైన్‌కు తరలించారు.  

Updated Date - 2020-06-07T07:27:15+05:30 IST