స్థానికులకు 75 శాతం కోటా... హర్యానా ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట...

ABN , First Publish Date - 2022-02-17T18:38:57+05:30 IST

ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్

స్థానికులకు 75 శాతం కోటా... హర్యానా ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట...

న్యూఢిల్లీ : ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం చేసిన చట్టం అమలును నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. ఈ ఆదేశాలు జారీ చేయడానికి కారణాలను హైకోర్టు తెలియజేయకపోవడంతో అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. యాజమాన్యాలపై ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. 


ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం చేసిన చట్టం అమలును పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇటీవల నిలిపేసింది. ఈ తాత్కాలిక ఆదేశాలు జారీ చేయడానికి కారణాలను హైకోర్టు వివరించలేదు. హైకోర్టు ఆదేశాలను హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 


హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రతిభకు, రాజ్యాంగానికి విరుద్ధమని ప్రైవేటు యాజమాన్యాలు వాదిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ చట్టం కేవలం భౌగోళిక వర్గీకరణను మాత్రమే ప్రస్తావిస్తోందని, దీనికి రాజ్యాంగం అనుమతిస్తోందని చెప్పింది. రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజల జీవించే హక్కు, జీవనోపాధి హక్కు, ఆరోగ్య, హక్కు, జీవన ప్రమాణాలు, ఉపాధి పొందే హక్కులను కాపాడటానికే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు వాదించింది. 


హర్యానా రాష్ట్ర స్థానిక అభ్యర్థుల ఉపాధి చట్టం, 2020 ప్రకారం నెలకు రూ.30,000 కన్నా తక్కువ వేతనం చెల్లించే  ప్రైవేటు రంగంలోని ఉద్యోగాల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వాలి. ఈ చట్టం జనవరి 15 నుంచి అమల్లోకి వచ్చింది. 


Updated Date - 2022-02-17T18:38:57+05:30 IST