రాయపురంలో ఆరోసారి పోటీ.. ఈసారి ఏం జరుగుతుందో..!?

ABN , First Publish Date - 2021-03-07T17:12:11+05:30 IST

చెన్నైలోని అత్యంత ప్రాచీనమైన అసెంబ్లీ నియోజకవర్గాలలో రాయపురం నియోజకవర్గం ఒకటి...

రాయపురంలో ఆరోసారి పోటీ.. ఈసారి ఏం జరుగుతుందో..!?

అన్నాడీఎంకే సీనియర్‌ నేత, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌ రాయపురం నియోజకవర్గంలో ఆరోసారి పోటీకి దిగుతున్నారు. చెన్నైలోని అత్యంత ప్రాచీనమైన అసెంబ్లీ నియోజకవర్గాలలో రాయపురం నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో 1957, 1962 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మాయాండి గెలుపొందారు. 1967లో మాయాండి డీఎంకే అభ్యర్థి వేదాచలం చేతిలో ఓటమిపాలయ్యారు. 1971లో మళ్ళీ వేదాచలం గెలిచారు. 1977లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థిని మార్చారు. కొత్తగా బరిలోకి దిగిన పి.పొన్నురంగం ఆ ఎన్నికల్లోనూ, 1980, 1984 ఎన్నికల్లోనూ వరుసగా గెలిచారు. 1989లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి ఆర్‌.మదివానన్‌, 1991 ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి డి. జయకుమార్‌, 1996లో మళ్ళీ డీఎంకే అభ్యర్థి ఆర్‌. మదివానన్‌ గెలిచారు. 2001లో మళ్ళీ అన్నాడీఎంకే అభ్యర్థి డి. జయకుమార్‌ గెలిచారు. అటుపిమ్మట 2006, 2011, 2016 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు డి. జయకుమార్‌ విజయం సాధించారు.


చెన్నై : రాయపురం నియోజకవర్గానికి ఇప్పటివరకూ జరిగిన శాసనసభ ఎన్నికల్లో డీఎంకే ఏడుసార్లు, అన్నాడీఎంకే ఐదుసార్లు, కాంగ్రెస్‌ రెండుసార్లు గెలిచాయి. ఎక్కువసార్లు గెలిచిన డీఎంకే ఈ నియోజక వర్గంలో మంచిపట్టు సాధించిందనే చెప్పవచ్చు. అయితే 2001నుంచి వరుసగా జరిగిన నాలుగు ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలిచి ఆ పార్టీ ఈ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకుంది. ప్రస్తుత మత్స్యశాఖ మంత్రి డి. జయకుమార్‌ నాలుగుసార్లు గెలిచారు. ఉత్తర చెన్నై సముద్రతీరాన ఉన్న రాయపురం నియోజకవర్గంలో 2004 సునామీ అల్లకల్లోలం సృష్టించింది. ఆ ఉపద్రవంలో ఈ నియోజకవర్గం బాగా నష్టపోయింది.పలు ప్రాంతాలు సముద్రపు కోతకు గురయ్యాయి. అంతేకాకుండా మద్రాసు హార్బర్‌ కు సరకులు తీసుకెళ్లే కంటైనర్‌ లారీలు, హార్బర్‌ నుంచి సరకులను తీసుకు వెళ్లే కంటైనర్‌ లారీల రాకపోకల వల్ల నియోజకవర్గంలో కాశిమేడు ప్రాంతంలో రోజూ తీవ్రమైన ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడి ప్రమాదాలు జరగడం ఆనవాయితీగా మారింది. కంటైనర్‌ లారీల రాకపోకలకు ప్రత్యేకంగా రహదారిని నిర్మించినా ట్రాఫిక్‌ సమస్యలు తీరలేదు.


చారిత్రక ప్రాధాన్యం

రాయపురం నియోజకవర్గం చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రాంతంగా ఉంది.దక్షిణభారతదేశంలో తొట్టతొలుత నెలకొల్పిన రైల్వేస్టేషన్‌ రాయపురంలోనే ఉంది. 1856లో రాయపురం నుంచి వాలాజాప్రాంతానికి తొలిసారిగా రైలు సర్వీసు ప్రారంభమైంది.ఇంతటి చరిత్ర కలిగిన రాయపురం రైల్వేస్టేషన్‌ను నగరంలో మూడో రైల్వే టెర్మినల్‌గా మార్చా లని స్థానిక ప్రజలు యేళ్లతరబడి కోరుతున్నారు. ఆ కోరికను నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మత్స్య శాఖ మంత్రి డి.జయకుమార్‌ నెరవేర్చలేకపోయారనే అసంతృప్తి స్థానిక ప్రజలలో అధికంగా ఉంది. రాయపురం నియోజకవర్గంలోనే ఉత్తరచెన్నైలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రిగా స్లాన్టీ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యసేవలను అందిస్తోంది. ఆర్‌ఎస్‌ఆర్‌ఎం ఆస్పత్రి కూడా ఈ నియోజక వర్గంలోనే ఉంది. ఈ రెండు ఆస్పత్రులను అంతర్జాతీయ ప్రమాణాలతో స్థాయిని పెం చాలని స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. నియోజక వర్గంలో పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య కూడా అధికంగా ఉంది.


జాలర్ల ఓట్లే కీలకం

రాయపురం నియోజకవర్గంలో గ్రేటర్‌ చెన్నై కార్పొ రేషన్‌కు చెందిన 43 నుంచి 53 వార్డుల దాకా ఉన్నాయి. ఈ నియోజకవర్గం జనాభాలో 55 శాతం మంది జాలర్లు. నాడార్లు, వన్నియార్లు, బలహీనవర్గాలు తదితర వర్గాలకు చెందినవారు 45 శాతం దాకా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అయినా జాలర్ల మద్దతు లేకుండా గెలవటం అసాధ్య మని చెప్పవచ్చు. రాయపురం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ప్రారంభంలో కాంగ్రెస్‌, ఆ తర్వాత డీఎంకే, ప్రస్తుతం అన్నాడీఎంకే విజయం సాధించాయి. గత 2016లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి డి. జయకుమార్‌ తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్థి ఆర్‌. మనోహరన్‌ను 8031 ఓట్ల మెజారిటీతో ఓడించారు. బీజేపీ, పీఎంకే, టీఎంసీ అభ్యర్థులు సహా మొత్తం 15 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.


ఆరోసారి పోటీకి...

రాయపురం నియోజకవర్గంలో మత్స్యశాఖ మంత్రి డి. జయకుమార్‌ ఆరోసారి పోటీకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గంలో పోటీకి పార్టీ సీనియర్‌ నాయకుడు రాయపురం ఆర్‌ మనో తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ జయకుమార్‌కే పార్టీ సీటిచ్చింది. డీఎంకే తరఫున ఇలయ అరుణా, ఎన్‌. మనోహరన్‌ ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి దరఖాస్తులు సమర్పించారు. 1991లో తొలిసారిగా జయకుమార్‌ గెలిచినప్పుడే మాజీ ముఖ్యమంత్రి జయలలిత 31 యేళ్ల వయసులో ఆయనకు మంత్రిపదవిని కట్టబెట్టారు. ఐదుసార్లు గెలిచి పలు మంత్రిత్వ శాఖలను కూడా ఆయన నిర్వహించారు. 2011 ఎన్నికల తర్వాత స్పీకర్‌ పదవిని చేపట్టారు. కొంతకాలమయ్యాక రాయపురం నియోజకవర్గంలో జయకుమార్‌ను కీర్తిస్తూ ముద్రించిన ఓ పోస్టర్‌ కారణంగా ఆయన పదవిని కోల్పోయారు. జయ ఆయనను కొంతకాలంపాటు దూరంగా ఉంచారు. ఆ సమయంలో జయకుమార్‌ ఓర్పు వహించడంతో జయ మళ్ళీ ఆయనను అందలమెక్కించారు. 2014 ఎన్నికల్లో జయకుమార్‌ కుమారుడికి ఎంపీ సీటిచ్చారు. 2016 ఎన్నికల్లో ఐదోసారి శాసనసభ్యుడిగా గెలిచిన జయకుమార్‌ను మత్స్యశాఖ మంత్రిగా నియమించారు. గత నాలుగేళ్లుగా మీడియా ప్రతినిధుల ఎదుట ‘ఆల్‌ ఇన్‌ ఆల్‌’గా అన్నాడీఎంకే ప్రభుత్వ ప్రతినిధిలా, పార్టీ అధికార ప్రతినిధిలా జయకుమార్‌ వ్యవహరిస్తున్నారు.


2016 ఎన్నికల ఫలితాలు :-

మొత్తం ఓటర్లు : 1,92,215

పోలైన ఓట్లు : 1,22,225

జయకుమార్‌ (ఏడీఎంకే) : 55,205

ఆర్‌. మనోహర్‌ (కాంగ్రెస్‌) : 47,174

Updated Date - 2021-03-07T17:12:11+05:30 IST