10 పరీక్షల్ని రద్దు చేసిన రాష్ట్రాలు ఇవే..

ABN , First Publish Date - 2021-04-21T01:11:14+05:30 IST

రాష్ట్రాలు పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ బాటలోనే కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్‌సీఈ) కూడా తమ పరిధిలోని విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించబోమని తెలిపింది.

10 పరీక్షల్ని రద్దు చేసిన రాష్ట్రాలు ఇవే..

న్యూఢిల్లీ: కోవిడ్ నేపధ్యంలో తమ పరిధిలో ఉన్న పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయం తీసుకున్న అనంతరం.. వివిధ రాష్ట్రాలు కూడా ఈ వైపు అడుగులు వేశాయి. ఇప్పటి వరకు ఆరు రాష్ట్రాలు పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ బాటలోనే కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్‌సీఈ) కూడా తమ పరిధిలోని విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించబోమని తెలిపింది.


తమిళనాడు

పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం తమిళనాడు. తమ రాష్ట్ర పరిధిలో పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తమిళనాడు సెకండరీ బోర్డు ఫిబ్రవరిలో ప్రకటించింది. ఇక 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఇక 9, 11వ తరగతుల పరీక్షలు కూడా రద్దు చేసింది.


పంజాబ్

తమిళనాడు బాటలోనే పంజాబ్ సెకండరీ ఎడ్యూకేషన్ బోర్డు (పీఎస్ఈబీ) నిర్ణయం తీసుకుంది. పదవ తరగతితో పాటు ఐదు, ఎనిమిది తరగతుల పరీక్షలు రద్దు చేస్తున్నట్లు పీఎస్ఈబీ ప్రకటించింది. పీఎస్ఈబీ పరిధిలో పదవ తరగతి పరీక్షలు మే 4 నుంచి నిర్వహించాల్సి ఉంది. ఇక ఏప్రిల్ 20 నుంచి జరగాల్సిన 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది.


హర్యానా

ఏప్రిల్ 22 నుంచి మే 15 వరకు జరగాల్సిన పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. వీటితో పాటు 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. ఈ రెండు పరీక్షలకు సంబంధించి ఇప్పటికే అడ్మిట్ కార్డులను జారీ చేశారు. అయితే కోవిడ్ నేపధ్యంలో పది పరీక్షలు రద్దు చేస్తూ 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.


తెలంగాణ

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు, ఈ పరీక్షలకు సంబంధించి తదుపరి నిర్ణయాలను తెలియజేస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి తెలిపారు. పది విద్యార్థులను ఎలాంటి పరీక్షలు లేకుండానే పై చదువులకు ప్రమోట్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.


ఉత్తరాఖండ్

పదవ తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉత్తరాఖండ్ విద్యా మరియు సంస్కృత విద్యా మంత్రి అర్వింద్ పాండే ప్రకటించారు. అయితే 10వ తరగతి పరీక్షలు రాయాలనుకునే విద్యార్థుల కోసం మాత్రం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వారి కోసం త్వరలో తేదీలు ప్రకటిస్తామని అర్వింద్ పాండే తెలిపారు.


జమ్మూ కశ్మీర్

జమ్మూ కశ్మీర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (జేకేబీఓఎస్ఈ) పరిధిలోని 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు రద్దు చేశారు. ఇంటర్నల్ అసెస్‌మెంట్ ఆధారంగా పది విద్యార్థుల్ని పై తరగతికి ప్రమోట్ చేయనున్నట్లు జేకేబీఓఎస్ఈ పేర్కొంది. ఏప్రిల్‌లో పది పరీక్షలు నిర్వహించాలని బోర్డ్ గతంలో నిర్ణయించింది.

Updated Date - 2021-04-21T01:11:14+05:30 IST