5 శాతం.. బాదుడు

ABN , First Publish Date - 2021-12-09T05:28:59+05:30 IST

పట్టణ పరిధిలో లేఅవుట్‌ వేయాలంటే అదనంగా ఐదు శాతం స్థలాన్ని అప్పగించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు రియల్టర్లలో కలకలం రేపుతున్నాయి. లేఅవుట్‌లలో ఇచ్చిన అదనపు స్థలాన్ని వైఎస్సార్‌ జగనన్న గృహాలకు ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది.

5 శాతం.. బాదుడు

జిల్లాలో రియల్టర్లపై పిడుగు 

జగనన్న ఇళ్ల స్థలాలకు ఐదు శాతం భూమి అప్పగించాలి

ప్రభుత్వ నిబంధనతో వ్యాపారుల వెనకడుగు

నిర్మాణ రంగానికి చావుదెబ్బంటూ ఆందోళన

నాన్‌ లేఅవుట్లపైనే మొగ్గు



తాడేపల్లిగూడెంలో ఐదెకరాల స్థలంలో గేటెడ్‌ కమ్యూనిటీ నిర్మించేందుకు ఓ రియల్టర్‌ ఇటీవల ప్రయత్నాలు చేశారు. లేఅవుట్‌ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల మేరకు స్థలానికి బదులుగా 10 శాతం రుసుము చెల్లించేందుకు ముందుకొచ్చారు. అయితే రాజకీయ జోక్యం అధికంగా ఉండడంతో తాత్కాలికంగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. తాజాగా మళ్లీ గేటెడ్‌ కమ్యూనిటీ విషయంలో కదలిక వచ్చింది. భవన సముదాయాన్ని నిర్మించాలని పట్టుదలతో ఉన్నారు. అయితే అదనంగా ఐదు శాతం స్థలాన్ని ఇవ్వాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ ఆలోచన పూర్తిగా విరమించుకున్నారు. ఇలా లేఅవుట్‌ వేసేందుకు వచ్చిన ఒకరిద్దరు రియల్టర్‌లు ప్రభుత్వ నిర్ణయంతో వెనక్కి తగ్గిపోతున్నారు. 


తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం కుంచనపల్లి పరిధిలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. స్థలాన్ని మెరక చేస్తున్నాడు. అక్కడ గజం స్థలం రూ.10 వేల వరకు ఉంది. నాన్‌ లేఅవుట్‌లోనే అంత ధర పలుకుతోంది. లేఅవుట్‌ అయితే మరో 2 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం 5 శాతం భూమిని అప్పగించాలన్న నిబంధన విధించడం వల్ల గజం స్థలంపై మరో 2 వేలు అధికంగా విక్రయించాల్సి ఉంటుందని లెక్క తేల్చారు. అంత పెద్దమొత్తంలో చెల్లించి స్థలాలు కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రారన్న ఉద్దేశంతో లేఅవుట్‌ ప్రతిపాదనను విరమించుకునే ఆలోచనలో పడ్డారు.


(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

పట్టణ పరిధిలో లేఅవుట్‌ వేయాలంటే అదనంగా ఐదు శాతం స్థలాన్ని అప్పగించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు రియల్టర్లలో కలకలం రేపుతున్నాయి. లేఅవుట్‌లలో ఇచ్చిన అదనపు స్థలాన్ని వైఎస్సార్‌  జగనన్న గృహాలకు ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రియల్‌ ఎస్టేట్‌ ఉనికికే ప్రమాదం అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మున్ముందు అధికారిక లేఅవుట్‌లు  అనేవి ఉండవంటూ అధికారులే ప్రభుత్వ ఉత్తర్వులపై పెదవి విరుస్తున్నారు. లేఅవుట్‌ అనుమతి పొందాలంటే నిబంధనల మేరకు 10 ఽశాతం స్థలాన్ని బహిరంగ ప్రదేశంగా విడచి పెట్టాల్సి ఉంది. అటువంటి స్థలంలో ఎటువంటి నిర్మాణం చేపట్టేందుకు వీలు లేదు. మునిసిపాలిటీ ఆధ్వర్యంలో స్థలం ఉంటుంది. పార్క్‌లు వంటివి ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. 


అనధికార వెంచర్లకు ఊతం

ఇటీవల పదిశాతం స్థలం ఇచ్చి లేఅవుట్‌ వేయడం గగనమైపోయింది. అంతా అనధికార వెంచర్‌లు వేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌)లోనూ రియల్టర్‌ల నుంచి స్పందన కొరవడింది. నివాస  ప్రాంతంలో ఉండే అనధికార లేఅవుట్‌లలో స్థలాలకు 14 శాతం రుసుము చెల్లించి క్రమబద్ధీకరించుకుంటున్నారు. అంతే తప్పా లేఅవుట్లపై ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మరో పిడుగులాంటి నిర్ణయం తీసుకుంది. లేఅవుట్‌లో అదనంగా 5 శాతం స్థలాన్ని జగనన్న ఇళ్ల నిర్మాణానికి  అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. గతం నుంచే 10 శాతం భూమిని ఖాళీ స్థలంగా పట్టణ, స్థానిక సంస్థలకు అప్పగించాలన్న నిబంధన ఉంది. జగనన్న ఇళ్లకు ఇవ్వాల్సిన 5 శాతం స్థలాన్ని లేఅవుట్‌కు 3 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా ఇచ్చుకోవచ్చన్న వెసులుబాటు కల్పించారు. అలా ఇవ్వని పక్షంలో రిజిస్ర్టేషన్‌ బేసిక్‌ విలువలో 5 శాతం సొమ్ములు చెల్లించాలి. ఇటువంటి నిబంధనలతో భవిష్యత్తులో ఒక్కరూ కూడా లేఅవుట్‌ కోసం ముందుకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అంతిమంగా ఇది కొంతమంది ప్రజాప్రతినిధులకు ఉపయోగపడ నుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే  నాన్‌ లేఅవుట్‌లు వేసుకునేవారినుంచి కప్పం వసూలు చేస్తున్నారు. ఎకరానికి రూ.10 లక్షలు వంతున వసూళ్లకు పాల్ప డుతున్నారు. పట్టణాలకు ఆనుకుని ఇబ్బడి ముబ్బడి నాన్‌ లేఅవుట్‌లు వెలుస్తున్నాయి. లేఅవుట్‌ వేసే సాహసం చేయలేకపోతున్నారు. పదిశాతం ఖాళీ స్థలం ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ప్రస్తుతం మరో ఐదు శాతం స్థలాన్ని అప్పగించాలన్న ఆదేశాలతో మరింత వెనుకంజ వేసే అవకాశం ఉంది.


కొనుగోలుదారులపైనే భారం 

ప్రభుత్వం జగనన్న కాలనీలకు అదనపు భూమిని అప్పగించాలంటూ తీసు కున్న నిర్ణయం అంతిమంగా కొనుగోలుదారులపై ప్రభావం చూపనుంది.  ఐదు శాతం స్థలాన్ని అప్పగిస్తే ఆ లోటును భర్తీ చేసుకోవడానికి కొనుగోదా రులపై రియల్టర్లు భారం వేయనున్నారు. ప్రస్తుతం లేఅవుట్‌లలో భవనాలు నిర్మించి విక్రయిస్తున్నారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో రూ.35 లక్షలు ధర పలికే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇప్పుడు రూ.45 లక్షలకు చేరుకుంది. రెండేళ్ల వ్యవధిలోనే ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా ఐదు శాతం స్థలం అప్పగింత నిబంధనతో భూమి విలువను బట్టి భవనాల ధరలు పెరిగిపోయే అవకాశం ఉంది. దీనివల్ల కొనుగోలు దారులు ముందుకు రారంటూ రియల్టర్‌లు, బిల్డర్‌లు ఆందోళన చెందుతున్నారు. 




Updated Date - 2021-12-09T05:28:59+05:30 IST