ఐదుగురు మంత్రులు, 40 మంది సిట్టింగులకు డౌటే!

ABN , First Publish Date - 2021-03-04T18:13:04+05:30 IST

అధికార అన్నాడీఎంకేలో రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది.

ఐదుగురు మంత్రులు, 40 మంది సిట్టింగులకు డౌటే!

చెన్నై : అధికార అన్నాడీఎంకేలో రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సీటు వస్తుందోరాదోనని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురు చూస్తుండగా, అభ్యర్థుల జాబితా వచ్చాక పార్టీలో పరిస్థితి ఎలా వుంటుందోనని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. అయితే సీటు రాని అభ్యర్థులు  టీటీవీ దినకరన్‌ చెంతకు చేరడం ఖాయమని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం’ పార్టీ తరఫున పోటీ చేసేందుకు తమకు అవకాశం ఇవ్వడంతో పాటు ఎన్నికల్లో అయ్యే వ్యయాన్ని కూడా దినకరన్‌ భరిస్తారన్న భరోసా కూడా వారిని ఆయన చెంతకు చేర్చే అవకాశముందని వారు విశ్లేషిస్తున్నారు. దీంతో అన్నాడీఎంకే అభ్యర్థుల జాబితా వెలువరింత కోసం అటు ఆ పార్టీ వర్గాలు, ఇటు వారి ప్రత్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


45 మంది సిట్టింగులకు లేనట్టేనా?

2016 ఎన్నికల్లో 227 స్థానాల్లో పోటీ చేసిన అన్నాడీఎంకేకు 136 మంది ఎమ్మెల్యేలు దక్కారు. అయితే ఈసారి ఎన్నికల్లో వీరిలో చాలామందిని పక్కనబెట్టినట్టు తెలుస్తోంది. మొత్తం 45 మందికి సీటు ఇవ్వడం లేదని తెలిసింది. ఇందులో ఐదుగురు మంత్రులు కాగా, అందులోనూ ముగ్గురు మహిళలున్నట్టు ఎడప్పాడి వర్గీయులు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చారని వారు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వున్న 234 నియోజకవర్గాలకు గాను సీటు ఆశించే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అన్నాడీఎంకే అవకాశం కల్పించింది. బుధవారంతో గడువు తీరి పోగా, ఇప్పటివరకూ సుమారు 14 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరందరికీ గురువారం ఒక్కరోజులోనే ఇంటర్వ్యూ చేయాలని పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం, ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి నిర్ణయించారు.


కానీ ఇది సాధ్యమయ్యే పనేనా అని పార్టీవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి తోడు పుదుచ్చేరి, కేరళలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులకు కూడా గురువారమే ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. ఇంతమందిని ఇంటర్వ్యూ చేయడం సాధ్యమయ్యే పని కాదని, కేవలం కంటితుడుపు చర్యగానే ఇంటర్వ్యూలు జరుపుతున్నారంటూ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినేత్రి జయలలిత బతికున్నప్పుడు ఇంటర్వ్యూలు జరిపిన తీరును వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న ఆశావహుల జాబితాను తెప్పించుకునే జయలలిత.. అందులో నలుగురైదుగురి గురించి వాకబు చేయించేవారు. వారిని సీనియర్‌ నేతలైన ఓపీఎస్‌, ఈపీఎస్‌, వైద్యలింగం, కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్‌ తదితరులు ఇంటర్వ్యూ చేసేవారు. 


ఆ తరువాత పార్టీ నుంచి వచ్చిన నివేదిక మేరకు అందులో ఇద్దరిని ఎంపిక చేసేవారు. వారి గురించి అటు ఇంటెలిజెన్స్‌, ఇటు పార్టీ నివేదికను పరిశీలించి, శశికళ ఇచ్చే సమాచారాన్ని, తనకు నమ్మకస్తులైన నేతలు ఇచ్చిన సమాచారాన్ని బేరీజు వేసుకుని తుది నిర్ణయానికి వచ్చేవారు. ఇందుకు ఆమె కనీసం వారం పదిరోజులు సమయం తీసుకునేవారు. కానీ ఇప్పుడవేవీ జరగడం లేదని అన్నాడీఎంకే నేతలే చెబుతున్నారు. బుధవారం దరఖాస్తు చేసుకోగా, గురువారమే ఇంటర్వ్యూలు జరగడం కేవలం తూతూమంత్ర  తతంగమేనని వారు పెదవి విరిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను గుర్తించి వారి జయాపజయాలకు సంబంధించి ఇంటెలిజెన్స్‌ ద్వారానూ, ప్రైవేటు ఏజెన్సీ ద్వారానూ సమాచారం తెప్పించుకున్నారని తెలిసింది. 


ఆ రెండింటినీ బేరీజు వేసుకున్న ముఖ్యమంత్రి ఎవరెవరికి ఏఏ నియోజకవర్గాల్లో సీటు ఇవ్వాలన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అదేవిధంగా కూటమి పార్టీలకు స్థానాలకు కేటాయించాల్సి రావడం వల్ల కూడా కొందరిని పక్కనబెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో ఐదుగురు మంత్రులతో పాటు మరో 40 మంది సిట్టింగులకు పూర్తి వ్యతిరేకంగా నివేదికలు వచ్చాయని చెబుతున్నారు. ఆ మేరకు వారిని పక్కనబెట్టినట్టు తెలుస్తోంది. ఇదిలా వుండగా పక్కన బెట్టిన సిట్టింగులలో ఓపీఎస్‌ వర్గీయులు కూడా అధికంగా వున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-03-04T18:13:04+05:30 IST