ఢిల్లీ సభకు 49 మంది..!

ABN , First Publish Date - 2020-03-31T10:16:27+05:30 IST

ఢిల్లీలో ఓ మత సభకు వెళ్లి.. కరోనా వైరస్‌ పాజిటివ్‌ బాధితుడితో కలిసి నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో

ఢిల్లీ సభకు 49 మంది..!

కరోనా వైరస్‌ పాజిటివ్‌ బాధితుడితో కలిసి రైలులో ప్రయాణం

47 మందిని గుర్తించిన అధికారులు

ఆ ఇద్దరు ఎక్కడికెళ్లారో..?

ఒక్కరోజే 73 శాంపిల్స్‌ సేకరణ

విదేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన వారు 4941 మంది

ఆందోళన వద్దు.. అప్రమత్తమే ముద్దు 

భౌతిక దూరంతో కరోనాను కట్టడి చేద్దాం - హరికిరణ్‌ , జిల్లా కలెక్టర్‌


కడప, మార్చి 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఢిల్లీలో ఓ మత సభకు వెళ్లి.. కరోనా వైరస్‌ పాజిటివ్‌ బాధితుడితో కలిసి నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణించిన వారిలో 49 మంది జిల్లావాసులు ఉన్నారు. వీరిలో 47 మందిని గుర్తించారు.


ఢిల్లీలో ఓ మతానికి సంబంధించిన ప్రచార సభలు నిత్యం జరుగుతుంటాయి. ఆ సభలకు జిల్లా నుంచి కూడా పలువురు హాజరయ్యారు. నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేశారు. అదే రైలులో ప్రయాణించినవారిలో ఎక్కువ మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఆ రైలులో ప్రయాణించినవారి అడ్రస్‌లు సేకరించి జిల్లా కలెక్టర్లకు పంపారు. ఢిల్లీ సభకు వెళ్లి అదే రైలులో ప్రయాణించిన 62 మంది జాబితా జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌కు అందింది. ఆ జాబితా ఆధారంగా రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆ సభకు వెళ్లిన వారి వివరాలను గుర్తించారు. జాబితాలో ఉన్న వాటిలో మూడు పేర్లు రెండుసార్లు రిపీట్‌ కాగా.. 9 మంది ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. అంటే.. 50 మంది మిగిలారు.


వారిలో ఒకరు  ఆరోజే సింగపూర్‌ వెళ్లిపోయారు. మిగిలిన 49 మందిలో కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, పులివెందుల, రాజంపేట, రైల్వేకోడూరుతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో 47 మందిని గుర్తించి వారిని సమీప ఐసోలేషన్‌, క్వారంటైన్స్‌కు తరలించారు. ఆ 47 మంది శాంపిల్స్‌ను సేకరించి పరీక్ష కోసం తిరుపతి ల్యాబ్‌కు పంపించారు. ఏ రిపోర్టు వస్తుందో అని అధికారులు ఆందోళనచెందుతున్నారు. ఈ 47 మంది ఎక్కడెక్కడ తిరిగారో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.


ఆ ఇద్దరు ఎక్కడికెళ్లారో..?

జిల్లా నుంచి ఢిల్లీ సభకు వెళ్లిన 49 మందిలో ఇద్దరి ఇళ్లకు తాళం వేసినట్లు అధికారులు గుర్తించారు. వారి ఫోన్‌ నెంబర్లు సేకరించి ఆచూకీ కోసం ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. ఆ ఇద్దరు ఎక్కడికెళ్లారు..? ఎక్కడెక్కడ తిరుగుతున్నారు..? ఏఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారో..? అధికారులను వేధిస్తున్న ప్రశ్నలివి. వారికి నెగటివ్‌ ఉంటే సమస్య లేదు.. ప్రస్తుతం పోలీసులు వారి ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.


జిల్లాకు వచ్చిన విదేశీయులు 4,941 మంది

జనవరి తరువాత ఇప్పటి వరకు కువైట్‌, ఇటలీ, చైనా, అమెరికా, ఇంగ్లాండ్‌ తదితర దేశాల నుంచి 4941 మంది ఎన్‌ఆర్‌ఐలు జిల్లాకు వచ్చారు. వారిలో జనవరి, ఫిబ్రవరిలలో వచ్చిన వారు 970 మంది ఉన్నారు. మార్చి 1వతేదీ తరువాత 3970 మంది జిల్లాకు వచ్చారు. మొత్తం 4,941 మంది ఎన్‌ఆర్‌ఐల ఆరోగ్య స్థితిపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టినా.. మార్చి తరువాత వచ్చిన 3970 మందిపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది. ఎక్కడికక్కడే హౌస్‌ క్వారంటైన్‌లో ఉంచి వారి ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. జిల్లాకు వచ్చిన మొత్తం ఎన్‌ఆర్‌ఐలలో 1412 మంది 28 రోజులు పూర్తి చేసుకున్నారు. మిగిలిన 3529 మంది ఆరోగ్య స్థితిని ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారు.


భౌతికదూరంతో కరోనాను కట్టడిచేద్దాం:  హరికిరణ్‌ , కలెక్టర్‌

ఢిల్లీ సభకు జిల్లా నుంచి 49 మంది వెళ్లి వచ్చారు. వారిలో ఇద్దరి అడ్రస్‌ దొరకలేదు. ఇళ్లకు తాళం వేసి ఉంది. 47 మందిని ఐసోలేషన్‌కు పంపి, శాంపిల్స్‌ తీసి తిరుపతి ల్యాబ్‌కు పంపాం. ఆదివారం వరకు 58 మంది శాంపిల్స్‌ తీస్తే 57 రిజల్ట్‌ నెగటివ్‌గా వచ్చింది. ఒక రిజల్ట్‌ రావాల్సి ఉంది. సోమవారం ఒక్కరోజే 73 మంది శాంపిల్స్‌ పంపాం. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ప్రజలు కూడా భౌతికదూరం పాటిస్తూ పూర్తిగా సహకరించాలి. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రాకుండా స్వీయ నిర్బంధంలో (ఇంట్లో) ఉండాలి. రేపటి నుంచి ప్రతి వార్డుకు ఒక వైద్యుడిని నియమించి వైద్య సేవలందిస్తాం. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. భౌతికంగా దూరంగా ఉండండి.. కరోనాను కట్టడి చేసే యుద్ధంలో ప్రతి ఒక్కరూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలి.


Updated Date - 2020-03-31T10:16:27+05:30 IST