దూరం.. భారం!

ABN , First Publish Date - 2022-07-10T04:20:13+05:30 IST

ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలను విలీనం చేయడంతో తల్లిదండ్రులు రోడ్డెక్కుతున్నారు. తమ బడి తమకే కావాలంటూ ప్లకార్డులతో నిరసనలకు దిగుతున్నారు. జిల్లావ్యాప్తంగా 430 పాఠశాలలు సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం అయ్యాయి. ఈ పాఠశాలలన్నీ తమ గ్రామానికి ఒకటి, రెండు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ విలీనం చేసేందుకు అంగీకరించబోమని స్పష్టం చేస్తున్నారు.

దూరం.. భారం!
సుభలయ ఆర్‌ఆర్‌ కాలనీ ప్రాథమికోన్నత పాఠశాల

జిల్లాలో 430 పాఠశాలలు విలీనం
విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలను విలీనం చేయడంతో తల్లిదండ్రులు రోడ్డెక్కుతున్నారు. తమ బడి తమకే కావాలంటూ ప్లకార్డులతో నిరసనలకు దిగుతున్నారు. జిల్లావ్యాప్తంగా 430 పాఠశాలలు సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం అయ్యాయి. 177 ఉన్నత పాఠశాలలు, 250 ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. వీటితో పాటు యూపీఎస్‌ నుంచి మూడు పాఠశాలలు మ్యాపింగ్‌ చేశారు. కాగా, ఈ పాఠశాలలన్నీ తమ గ్రామానికి ఒకటి, రెండు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ విలీనం చేసేందుకు అంగీకరించబోమని స్పష్టం చేస్తున్నారు. అమ్మఒడి ఇచ్చినట్లే ఇచ్చి.. తమ పిల్లలు చదువుతున్న స్కూళ్లను ఎత్తుకుపోవడమేంటని నిలదీస్తున్నారు. కిలోమీటర్ల దాటి పిల్లలను ఇంకో స్కూళుకు ఎలా పంపుతామని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కాగా ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను దగ్గరలోని ఇతర పాఠశాలల్లోని విలీనం చేశారు. ఇప్పుడు కేవలం 1, 2 తరగతులు మాత్రమే గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. రెండు తరగతులకు తమ పిల్లలను అక్కడ చేర్పించడం ఎందుకని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మళ్లీ రెండేళ్లు పూర్తయితే ఇతర ప్రాంతంలోని పాఠశాలకు పంపించాల్సి వస్తుందని వాపోతున్నారు.

ఉదాహరణలెన్నో..
- ఇచ్ఛాపురం మండలం ధర్మపురం ఎంపీపీ పాఠశాలలో 3, 4, 5 తరగతుల విద్యార్థులు 102 మంది ఉన్నారు. ఈ తరగతులను కిలోమీటరు దూరంలో ఉన్న జడ్పీ హైస్కూల్‌లో విలీనం చేశారు. ఈ విద్యార్థులంతా రద్దీగా ఉన్న ప్రధాన రహదారిని దాటుకుని.. జడ్పీ హైస్కూల్‌కు వెళ్లాలి. ఈ నేపథ్యంలో పాఠశాల విలీనం చేయొద్దని విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈవోకు వినతిపత్రం అందజేశారు. అంతదూరం తమ పిల్లలను పంపించేది లేదని స్పష్టం చేశారు.

- హిరమండలంలోని రెల్లివలస ప్రాథమిక పాఠశాలను అంబావల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేశారు. ఈ పాఠశాల సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ 15 మంది విద్యార్థులు ఉన్నారు. నదీ తీర గ్రామం.. నిర్మానుష్య ప్రదేశం కావడంతో తమ పిల్లలను ఆ పాఠశాలకు పంపించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు. అలాగే సుభలయ ఆర్‌ఆర్‌ కాలనీ ప్రాథమికోన్నత పాఠశాల, సుభలయ ప్రాథమికోన్నత పాఠశాలను మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హిరమండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. దీనిపైనా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

- కొత్తూరు మండలం బలద పాఠశాలలోని 6, 7, 8 తరగతి విద్యార్థులను జడ్పీ కడుమ పాఠశాలలో విలీనం చేశారు. దీంతో 95 మంది విద్యార్థులు 3.5 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి ఉంది. ఇది ఆంధ్రా-ఒడిశా సరిహద్దును కలిపే ప్రధాన రహదారి. నిత్యం వేలాది వాహనాలు ఈరోడ్డున తిరుగుతాయి. దీంతో విద్యార్థులను పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు.   

- ఇచ్ఛాపురం మండలం బొడ్డబడ యూపీ పాఠశాలలో 6, 7, 8 తరగతులను.. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలిగాం జడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. బొడ్డబడ నుంచి 47 మంది విద్యార్థులు నది వంతెనను దాటుకుంటూ వెళ్లాలి. వంతెన ప్రాంతం రద్దీగా ఉంటుందని.. ఆటోలు, ట్రాక్టర్లు, బైక్‌లు తిరుగుతుంటాయని..అంతదూరం తమ పిల్లలను పంపించలేమని. తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

- జి.సిగడాం మండలం ఎందువ ప్రాథమిక పాఠశాలను గ్రామానికి కిలోమీటర్‌ దూరంలో కొండపైన ఉన్న ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. ఈ రోడ్డు మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. అలాగే జగన్నాథపురం ప్రాథమిక పాఠశాలను కిలోమీటర్‌ దూరంలో ఉన్న పాలఖండ్యాం ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేశారు. దీంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు.

- బూర్జ మండలం పెద్దలంకాం పాఠశాలను కిలోమీటరు దూరంలో ఉన్న మామిడివలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. పెద్దలంకాంలో చాలామంది వలసజీవులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి పిల్లలను పాఠశాలకు పంపించేందుకు వృద్ధులకు కష్టమే.

- ఎచ్చెర్ల మండలంలో అల్లినగరం, ఎచ్చెర్ల పోలీసు క్వార్టర్స్‌, కేశవరావుపేట, పొన్నాడ, సంతసీతారాంపురం, బుడగట్లపాలెం గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను అదే గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. ఇందులో సంతసీతారాంపురం, పొన్నాడ గ్రామాల నుంచి విలీనం చేయొద్దని ఇప్పటికే అధికారులకు వినతులు అందజేశారు.

- ఇచ్ఛాపురం మండలం భవానీపురం ఎంపీపీ పాఠశాలలను కిలోమీటరు దూరంలో ఉన్న రత్తకన్న మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. భవానీపురంలో 26 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ రహదారిలో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో తమ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

- పలాసలోని ఇందిరా జంక్షన్‌ యూపీ పాఠశాల, ఉదయపురం పాఠశాలను కిలోమీటరు దూరంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. ఈ పాఠశాలల్లో జీడి, రిక్షా కార్మికుల పిల్లలు ఎక్కువ మంది చదువుతున్నారు. పాఠశాలలను విలీనం చేయొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నారు.

ఖర్చు చేసిన నిధుల సంగతేంటి?
పాఠశాలలు ప్రగతి మార్చేస్తామంటూ 2019కు ముందు.. పాఠశాలల స్థితిగతులను చూడాలంటూ ఇప్పుడు ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది. రెండేళ్లలో ‘నాడు-నేడు’ ఫేజ్‌-1, ఫేజ్‌-2 కింద పాఠశాలలను అధునికీకరించామని చెబుతున్నారు. ఇప్పుడు విలీనమైన వాటిలో అత్యధిక పాఠశాలలను బాగుచేశారు. ఇందుకోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. విద్యార్థులకు తాగునీటి కోసం వాటర్‌ప్లాంట్‌ను కూడా హిరమండలంలో విలీనం చేసిన పాఠశాలలో ఏర్పాటు చేశారు. మరి ఈ నిధులన్నీ వృథాయే కదాని ప్రశ్నిస్తున్నారు.         
 

Updated Date - 2022-07-10T04:20:13+05:30 IST