PM Modi మంత్రివర్గంలో 42 శాతం మందిపై క్రిమినల్ కేసులు : ఏడీఆర్

ABN , First Publish Date - 2021-07-10T18:43:47+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో

PM Modi మంత్రివర్గంలో 42 శాతం మందిపై క్రిమినల్ కేసులు : ఏడీఆర్

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో 42  శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. వీరిలో హత్యాయత్నం కేసుల్లో ఉన్నవారు నలుగురు అని తెలిపింది. 


కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ బుధవారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మంత్రివర్గంలో 78 మంది మంత్రులు ఉన్నారు. ఈ మంత్రులతో గురువారం మోదీ సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 14న మరోసారి మంత్రివర్గ సమావేశం జరుగుతుందని తెలుస్తోంది. 


మంత్రులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించినపుడు 42 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిసిందని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. 33 మంది మంత్రులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తమ ఎన్నికల అఫిడవిట్లలో తెలిపారని పేర్కొంది. వీరిలో 24 మంది తమపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్లు వెల్లడించారని తెలిపింది. హత్య, హత్యాయత్నం, దోపిడీ వంటి నేరారోపణలు వీరిపై ఉన్నట్లు తెలిపింది. 


ఈ 78 మంది మంత్రుల్లో రూ.1 కోటికి పైగా ఆస్తులు ఉన్నవారు 70 మంది అని తెలిపింది. జ్యోతిరాదిత్య సింథియా (రూ.379 కోట్లు), పీయూష్ గోయల్ (రూ.95 కోట్లు), నారాయణ్ రాణే (రూ.87 కోట్లు), రాజీవ్ చంద్రశేఖర్ (రూ.64 కోట్లు) ఈ జాబితాలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారని పేర్కొంది. 


అతి తక్కువ ఆస్తులను ప్రకటించినవారిలో త్రిపురకు చెందిన ప్రతిమ భౌమిక్ (రూ.6 లక్షలు), పశ్చిమ బెంగాల్‌కు చెందిన జాన్ బర్లా (రూ.14 లక్షలు), రాజస్థాన్‌కు చెందిన కైలాశ్ చౌదరి (రూ.24 లక్షలు), ఒడిశాకు చెందిన బిశ్వేశ్వర్ టుడు (రూ.27 లక్షలు), మహారాష్ట్రకు చెందిన వీ మురళీధరన్ (రూ.27 లక్షలు) ఉన్నారు. 


ఏడీఆర్ ఎన్నికల హక్కుల కోసం కృషి చేస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా వారిపై నమోదైన నేరారోపణలు, వారి ఆర్థిక స్తోమత, ఇతర అంశాలను ప్రజల ముందు ఉంచుతుంది. 







Updated Date - 2021-07-10T18:43:47+05:30 IST