ఉగ్రవాదులుగా భ్రమపడి 13 మందిని కాల్చేసిన బలగాలు.. చార్జ్‌షీట్‌లో 30 మంది సైనికుల పేర్లు

ABN , First Publish Date - 2022-06-12T02:27:01+05:30 IST

గతేడాది డిసెంబరు 4న నాగాలాండ్‌లో దారుణ ఘటన జరిగింది. ఉగ్రవాదులు చొరబడినట్టు సమాచారం అందుకున్న

ఉగ్రవాదులుగా భ్రమపడి 13 మందిని కాల్చేసిన బలగాలు.. చార్జ్‌షీట్‌లో 30 మంది సైనికుల పేర్లు

కోహిమా: గతేడాది డిసెంబరు 4న నాగాలాండ్‌లో దారుణ ఘటన జరిగింది. ఉగ్రవాదులు చొరబడినట్టు సమాచారం అందుకున్న  ఆర్మీకి చెందిన కౌంటర్ ఇన్సర్జెన్సీ యూనిట్, 21 పారా స్పెషల్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అదే సమయంలో మయన్మార్ సరిహద్దులో ఉన్న మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామానికి చెందిన కొందరు బొగ్గు గనుల్లో పనిచేసి పికప్ వ్యాన్‌లో ఇళ్లకు తిరిగి వస్తున్నారు. వారిని చూసిన భద్రతా బలగాలు ఉగ్రవాదులుగా భ్రమపడి కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.


ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. నాగాలాండ్ ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. సిట్ తాజాగా ఆ కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌లో ఓ ఆర్మీ అధికారి, 29 మంది సైనికుల పేర్లను అందులో చేర్చింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న వారు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ (SOPs), ఎంగేజ్‌‌మెంట్ నియమాలు పాటించలేదని సిట్ ఆరోపించింది. 


చార్జ్‌షీట్‌లో పేర్కొన్న సైనికులపై చర్యలు తీసుకునేందుకు నాగాలాండ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది. ఈ మేరకు సంబంధిత సైనికులపై చర్యలు తీసుకోవడానికి అనుమతిని కోరుతూ రక్షణ మంత్రిత్వ శాఖకు రాష్ట్ర పోలీసులు లేఖ రాశారు. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అమల్లో ఉన్న సాయుధ దళాల (ప్రత్యేక) అధికారాల చట్టం (AFSPA)ను రద్దు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. మోన్ జిల్లాలో పౌర హత్యలకు ఇదే కారణమవుతోందని, దీనిని రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.  

Updated Date - 2022-06-12T02:27:01+05:30 IST