కన్నీటి కృష్ణా

ABN , First Publish Date - 2022-08-20T06:17:01+05:30 IST

కన్నీటి కృష్ణా

కన్నీటి కృష్ణా
పవిత్ర సంగమం ఘాట్‌ సమీపంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గాలింపు

కృష్ణానదిలో రెండు వేర్వేరు ప్రమాదాలు

పవిత్ర సంగమం వద్ద స్నానానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు

ఐదుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు

మోపిదేవి మండలంలో ఎడ్లబండిని శుభ్రం చేయడానికి వెళ్లి..

వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన నలుగురు యువకులు

క్షేమంగా బయటపడిన ఇద్దరు, లభించని మరో ఇద్దరి ఆచూకీ


రెండు జిల్లాల్లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు గల్లంతయ్యారు. పవిత్ర సంగమం వద్ద జరిగిన ఘటనలో ఆరుగురు విద్యార్థుల్లో ఐదుగురు సురక్షితంగా బయటపడగా, ఒకరు గల్లంతయ్యారు. ఇక మోపిదేవి మండలం కోసూరువారిపాలెంలో జరిగిన ఘటనలో నలుగురిలో ఇద్దరి ఆచూకీ లభించలేదు. 


పవిత్రసంగమం (ఇబ్రహీంపట్నం)/మోపిదేవి, ఆగస్టు 19 : పవిత్ర సంగమంలో సరదాగా స్నానం చేయడానికి వెళ్లిన ఆరుగురు స్నేహితులు కృష్ణానదిలో గల్లంతయ్యారు. అయితే, ఐదుగురు విద్యార్థులు సురక్షితంగా బయటపడగా, ఒకరి ఆచూకీ మాత్రం తెలియలేదు. గల్లంతైన ఉప్పలపాటి లోకేశ్‌ (13) కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, పోలీస్‌, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. సేకరించిన సమాచారం ప్రకారం.. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు జడ్పీ బాలుర పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. కృష్ణాష్టమి సెలవు కావటంతో శుక్రవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి పవిత్ర సంగమానికి చేరుకున్నారు. సరదాగా స్నానం చేద్దామని కృష్ణానదిలో దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఈవూరి తరుణ్‌ (13), ఉప్పలపాటి అవినాష్‌ (13), పచ్చిగోళ్ల హర్షవర్ధన్‌ (13), నేడూరి సుమంత్‌ (13) ఒడ్డుకు వచ్చేశారు. చివర్లో ఉండిపోయిన లోకేశ్‌.. సిద్ధార్థ చేయి పట్టుకోవడంతో ఇద్దరూ నదిలో కొట్టుకుపోయారు. సమీపంలో వాకింగ్‌ చేస్తున్న విద్యార్థి రాయపూడి టోనీ సాహిత్‌ (18) సిద్ధార్థను రక్షించి బయటకు తీసుకొచ్చాడు. లోకేశ్‌ను కూడా కాపాడే ప్రయత్నం చేయగా, వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న లోకేశ్‌ తల్లిదండ్రులు పవిత్ర సంగమానికి వచ్చారు. శుక్రవారం రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. కాగా, లోకేశ్‌ కుటుంబసభ్యులను మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఫోన్‌లో పరామర్శించారు. పరిహారం కింద రూ.20లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఎడ్లబండిని శుభ్రం చేసేందుకు వెళ్లి.. 

మోపిదేవి మండలంలోని కోసూరువారిపాలెంలో ఎడ్లబండిని శుభ్రం చేసేందుకు కృష్ణానదిలోకి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఎనికే వివేక్‌, కాగితాల వంశీధర్‌, కాగితాల హసంత్‌, మేకా వెంకటేశ్‌ శుక్రవారం ఎడ్లబండిని శుభ్రం చేస్తుండగా, వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగి నదిలోకి కొట్టుకుపోయారు. ఈత వచ్చిన వివేక్‌, వంశీధర్‌ సురక్షితంగా బయటకు చేరుకోగా, హసంత్‌ (22), వెంకటేశ్‌ (20) మాత్రం కొట్టుకుపోయారు. గ్రామస్థులు ఇచ్చిన సమచారం మేరకు పోలీస్‌, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ సిబ్బంది పడవల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావటంతో గాలింపు చర్యలు తాత్కాలికంగా నిలిపివేశారు. హసంత్‌, వెంకటేశ్‌ కుటుంబసభ్యులు నది ఒడ్డునే రోదిస్తున్నారు.









Updated Date - 2022-08-20T06:17:01+05:30 IST