3 వేలకు 305 ఎకరాలు

ABN , First Publish Date - 2022-04-17T05:42:53+05:30 IST

చూస్తేనే నోరూరుతుంది. ఇక తింటే అంతులేని సంతృప్తి కలుగుతుంది. అందుకే బంగినపల్లి మామిడికి దేశవ్యాప్తంగా అంత పేరుంది.

3 వేలకు 305 ఎకరాలు

ప్రసిద్ధి చెందిన బంగినపల్లిపై దిగుబడి దెబ్బ

ఏటేటా నష్టాల్లో కూరుకుపోతున్న రైతాంగం

తగ్గిపోతున్న సాగు విస్తీర్ణం

ఈ సారి 30శాతం కూడా కాపురాని తోటలు

చెట్లను కొట్టేసి పంట పొలాలుగా మార్చుతున్న రైతులు


చూస్తేనే నోరూరుతుంది. ఇక తింటే అంతులేని సంతృప్తి కలుగుతుంది. అందుకే బంగినపల్లి మామిడికి దేశవ్యాప్తంగా అంత పేరుంది. అయితే ఏటికేటికి దిగుబడి తగ్గి మామిడి తోటల రైతులు నష్టపోతున్నారు. దీంతో సాగు క్రమంగా తగ్గిపోతోంది. ఒకప్పుడు నంద్యాల జిల్లాలో మూడు వేల ఎకరాల్లో సాగైన మామిడి ప్రస్తుతం 305 ఎకరాలకు తగ్గిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఎక్కువగా బంగినపల్లి బేనిషాన్‌తోపాటు మల్గుబా, దిల్‌ పసంద్‌, రెడ్డి పసంద్‌, సూప్లీ, ఊరగాయలకు పనికి వచ్చే చిన్న ఆచారి, పెద్ద ఆచారి రకాలు విస్తారంగా పండుతాయి. అయితే లాక్‌డౌన్‌ దెబ్బకు రెండేళ్లుగా మామిడి రైతులు కోలుకోలేని దెబ్బతినగా, ఈ ఏడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా పూత దెబ్బతినడంతో మరింత కుదేలయ్యారు. 


బనగానపలె, ఏప్రిల్‌ 16: బనగానపల్లె మామిడి (బంగినపల్లి మామిడి పండ్లు)కి దేశవ్యాప్తంగా ఎంతో పేరు ఉంది. రాష్ట్రంలో 70 శాతం బంగినపల్లి రకం మామిడినే పండిస్తున్నారు. నంద్యాల జిల్లాలో సుమారు పది వేల ఎకరాల్లో బంగిన పల్లె మామిడిని రైతులు సాగు చేస్తున్నారు. బనగానపల్లె మండలం లో 305 ఎకరాల్లో, బేతంచెర్ల మండలంలో 600 ఎకరాల్లో, ఓర్వకల్లులో 1111 ఎకరాల్లో, డోన్‌లో 2484 ఎకరాల్లో, ప్యాపిలిలో 805 ఎకరాల్లో సాగు చేశారు. అయితే ఈ ఏడాది పూత వచ్చే సమయంలో నవంబరులో కురిసిన భారీ వర్షాలకు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. 25 శాతం కూడా పంట రాకపోవడంతో పీకల్లోతు కష్టాల్లో మామిడి రైతులు కూరుకుపోయారు. 


తగ్గిన మామిడి సాగు : జిల్లాలో ఒకప్పుడు 15 వేల హెక్టార్లకు పైగా బంగినపల్లి మామిడిని సాగు చేసేవారు. అయితే ప్రస్తుతం నాలుగు వేల హెక్టార్లకు తగ్గిపోయింది. బనగానపల్లె ప్రాంతంలో సుమారు 121 ఏళ్ల క్రితం బనగానపల్లె నవాబులు 1500 ఎకరాల్లో సాగు చేశారు. అనంతరం సాగు విస్తీర్ణం పెరిగి మూడు వేల ఎకరాల్లో బంగినపల్లి మామిడి సాగయ్యేది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, వివిధ రకాల తెగుళ్లు మామిడికి వస్తుండడం, పంట సరిగా రాకపోవడంతో మామిడి రైతులు నష్టపోయారు. దీంతో మామిడి చెట్లను కొట్టివేసి సాగు భూములుగా మార్చుకుంటున్నారు. మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మామిడి బనగానపల్లె ప్రాంతంలో ఏటేటా తగ్గి ప్రస్తుతం 305 ఎకరాలకు తగ్గిపోయింది. 


బంగినపల్లి అంటే నోరూరాల్సిందే..


బనగానపల్లె మండల పరిధిలోని యాగంటిపల్లె, పసుపల, క్రిష్టగిరి, జోలాపురం, బనగానపల్లె, ఇల్లూరుకొత్తపేట, చిన్నరాజుపాలెం తదితర గ్రామాల్లో మామిడి తోటలు ఉన్నాయి. అలాగే బేతంచెర్ల మండలంలోని ఎంబాయి, రేపల్లె, వీరాయిపల్లె, ఆర్‌ఎస్‌రంగాపురం, ముసలాయిచెర్వు గ్రామాల్లో ఓర్వకల్లు,  డోన్‌, ప్యాపిలి, బండిఆత్మకూరు, తదితర మండలాల్లో మామడి తోటలు సాగవుతున్నాయి. ఈ పండు పేరు చెబితే చాలు ఎవరికైనా నోరూరడం ఖాయం. ప్రతి ఏటా వేసవి కాలంలో మండీల్లో పసుపు పచ్చగా నిగనిగలాడే మామిడి పండ్లు చూస్తే వెంటనే తినేయాలనిపిస్తుంది. అందునా బంగినపల్లి బేనిషాన్‌ మామిడి పండ్లు అంటే మరింతగా నోరూరుతుంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా బంగినపల్లి బేనిషాన్‌తోపాటు మల్గుబా, దిల్‌ పసంద్‌, రెడ్డి పసంద్‌, సూప్లీ, ఊరగాయలకు పనికి వచ్చే చిన్న ఆచారి, పెద్ద ఆచారి రకాలు విస్తారంగా పండుతాయి. 


మామిడి రైతుల ఆశలు ఆవిరి

లాక్‌డౌన్‌ దెబ్బకు రెండేళ్లుగా మామిడి రైతు కోలుకోలేని దెబ్బతిన్నారు. ఈ ఏడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా పూత దెబ్బతినడంతో రైతులు కుదేలయ్యారు. ముఖ్యంగా వేసవి ఎండలు కూడా మామిడి పంటపై ప్రభావం చూపాయి. గతంలో లేనంత ఎండలు ఈ ఏడాది రావడంతో పూత మగ్గిపోయింది. దీనికి తోడు అంతో ఇంతో వచ్చిన పూత కూడా తేనెమంచు తెగుళ్లతో రాలిపోయింది. బనగానపల్లె, బేతంచెర్ల పరిసర ప్రాంతాల్లో పది శాతం కూడా పంట రాలేదు. కేవలం మామిడి చెట్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి. దీంతో కౌలు రైతులు పీకలదాకా నష్టాల్లో కూరుకుపోయారు. ఒక్కో చెట్టుకు 10, 20 కాయలు తప్ప పంట కనబడకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని చోట్ల 25 శాతం మాత్రమే పంట వచ్చింది. ఈ ఏడాది మామిడి పంట లేకపోవడంతో ధరలు మండనున్నాయి. 


మామిడి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి


 నేను 25 ఎకరాల మామిడి తోటను రూ.10 లక్షలకు కౌలుకు తీసుకున్నార.. కూలీలు, మందుల పిచికారి ఖర్చులు రూ.5లక్షలు అయింది. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడి పంట దెబ్బతింది. సొమ్ము కూడా వచ్చే పరిస్థితి లేదు. దీంతో తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలి 


 - డి.అబ్దుల్‌ హమీద్‌, కౌలు రైతు, బనగానపల్లె  


ప్రభుత్వం ఆదుకోవాలి


నేను 20 ఎకరాల తోటను రూ.5 లక్షలకు కౌలుకు తీసుకున్నా. రూ.7 లక్షల వరకు పెట్టుబడులు పెట్టాం. రెండు శాతం కూడా పంట రాలేదు. మామిడి చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. తీవ్రంగా నష్టపోయా. ప్రభుత్వం ఆదుకోవాలి. 


 - సజ్జాద్‌హుస్సేన్‌, కౌలు రైతు, బనగానపల్లె 

Updated Date - 2022-04-17T05:42:53+05:30 IST