26 వేల మంది వచ్చారట!

ABN , First Publish Date - 2020-11-22T05:39:47+05:30 IST

పుష్కరాల్లో స్నానాల రద్దు, ఘాట్లలో సౌకర్యాలలేమి, కొవిడ్‌ కారణంగా పుష్కరాలకు ప్రజలకు పెద్దగా రావడంలేదు.

26 వేల మంది వచ్చారట!
భక్తుల సందడి లేని సంకల్‌బాగ్‌ పుష్కర ఘాట్‌

  1. ఖాళీ ఘాట్లకు వేలాది భక్తులొచ్చినట్లు రికార్డులు
  2. పిండ ప్రదానాలు లేకున్నా జరిగినట్లు నమోదు
  3. ప్రభుత్వ చీవాట్లతో 10,469 మందికి కుదింపు


కర్నూలు, ఆంధ్రజ్యోతి: పుష్కరాల్లో స్నానాల రద్దు, ఘాట్లలో సౌకర్యాలలేమి, కొవిడ్‌ కారణంగా పుష్కరాలకు ప్రజలకు పెద్దగా రావడంలేదు. కానీ రికార్డుల్లో రెండో రోజున 26,173 మంది భక్తులు ఘాట్లకు వచ్చినట్లుగా నమోదు చేశారు. 22,875 మంది స్నానాలాచరించారని, 3,216 పిండ ప్రదానాలు జరిగాయని చెబుతున్నారు. వాస్తవానికి కొన్ని ఘాట్లలో ఇన్‌చార్జులే కనిపించడంలేదు. సంకల్‌భాగ్‌ ఘాట్‌కు వచ్చిన ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ఇన్‌చార్జి కోసం పది నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చింది. రెండోరోజున భారీగా వచ్చారని చెప్పేందుకు అధికారులు యత్నించారు. అయితే ఆ రిపోర్టును పరిశీలించిన ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగం పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. కచ్చితమైన వివరాలు ఇవ్వాలని ఆదేశించగా 26 వేలు కాస్తా 10,469కి కుదించి పంపారు. నగరంలోని పంప్‌హౌస్‌ను అధికారికంగా వీఐపీ ఘాట్‌గా భావిస్తున్నారు. అక్కడే కలెక్టర్‌ సతీమణి వచ్చారు. ఆమె మినహా మరో వీఐపీ రెండ్రోజులుగా ఘాట్‌కు రాలేదనేది అధికారిక సమాచారం. భక్తులు కూడా రెండ్రోజులు 300 మందికి మించలేదని తెలుస్తోంది. రికార్డుల్లో మాత్రం రెండో రోజునే 1350 మంది వచ్చినట్లుగా చూపిస్తున్నారు. సంకల్‌బాగ్‌ ఘాట్లో ఎపుడు చూసినా వంద మంది కూడా కనిపించని పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా 50 మంది కూడా లేరు. ఆ ఘాట్‌కు ఏకంగా 6,020 మంది భక్తులు వచ్చినట్లుగా, ఇందులో 5,460 మంది స్నానాలు చేసినట్లుగా చూపిస్తున్నారు. నగరేశ్వరస్వామి ఘాట్‌ వద్ద పిండ ప్రదానాలు జరగలేదని అధికారులే చెబుతుండగా, వాటిని కాదని 500 పిండ ప్రదానాలు జరిగినట్లుగా రికార్డుల్లోకి ఎక్కించారు. గొందిపర్ల ఘాట్‌ నిర్మాణమే పూర్తి కాకపోవడంతో భక్తులు వెళ్లడం లేదు. ఆ ఘాట్‌కు కూడా 940 మంది వెళ్లినట్లుగా, పురోహితులే అందుబాటులో లేని ఆ ఘాట్లో 5 పిండ ప్రదానాలు జరిగాయని వివరిస్తున్నారు. ఒక మూలగా ఉండే షిరిడీసాయి బాబా ఘాట్‌లో పది మంది కూడా కనిపించే పరిస్థితి లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 1,210 మంది భక్తులు వచ్చారని చూపిస్తున్నారు. నాగసాయి దేవాలయం వద్ద బురదమయంగా ఉన్న ఘాటే దర్శనమిస్తుండగా.. 120 మంది భక్తులు వచ్చినట్లు, 95 మంది స్నానాలు చేసినట్లుగా రాసుకున్నారు. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపించారు. పరిస్థితులకు భిన్నంగా ఉన్న గణాంకాలపై ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. కచ్చితమైన నివేదిక పంపాలని ఆదేశించారు. దీంతో 10,469 మంది భక్తులు వచ్చారని, 1739 పిండ ప్రదానాలు జరిగాయని మరో నివేదికను పంపారు.


Updated Date - 2020-11-22T05:39:47+05:30 IST