దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 25వేల టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేసిన రైల్వే

ABN , First Publish Date - 2021-06-06T00:52:26+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆక్సిజన్ కొరతతో దేశం అల్లాడిపోయిన వేళ భారతీయ రైల్వే ఎనలేని సేవలు అందించింది. దేశవ్యాప్తంగా

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 25వేల టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేసిన రైల్వే

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆక్సిజన్ కొరతతో దేశం అల్లాడిపోయిన వేళ భారతీయ రైల్వే ఎనలేని సేవలు అందించింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 39 నగరాలకు ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’ రైళ్లు ఏకంగా 25 వేల టన్నుల ద్రవరూప మెడికల్ ఆక్సిజన్‌ (ఎల్ఎంఓ)ను సరఫరా చేశాయి. ఇప్పటి వరకు 1,503 ట్యాకర్లలో 25,629 టన్నుల ఎల్ఎంఓను సరఫరా చేశామని  భారతీయ రైల్వే నేడు తెలిపింది.


368 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు తమ ప్రయాణాన్ని పూర్తిచేసుకున్నాయని, 482 టన్నుల ఎల్ఎంఓను మోసుకెళ్తున్న ఏడు రైళ్లు మార్గమధ్యంలో ఉన్నాయని పేర్కొంది. జార్ఖండ్ నుంచి ఐదు ట్యాంకర్లలో 80 టన్నుల ఆక్సిజన్‌తో బయలుదేరిన ఐదో రైలు అస్సాం చేరుకుందని, కర్ణాటకలో 3000 టన్నుల ఆక్సిజన్ అన్‌లోడ్ అయిందని తెలిపింది.


దేశంలో ఆక్సిజన్ కొరత వేధిస్తున్న వేళ ఏప్రిల్ 24న మహారాష్ట్ర నుంచి 126 టన్నుల ఆక్సిజన్‌తో ప్రత్యేక ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’ రైళ్లు మొదలయ్యాయి. మొత్తం 15 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆక్సిజన్ చేరవేశాయి. ఇందులో ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, అసోం తదతర రాష్ట్రాలు ఉన్నాయి.  

Updated Date - 2021-06-06T00:52:26+05:30 IST