తిరుమల కర్ణాటక సత్రాల వద్ద వసతి సముదాయాల నిర్మాణం

ABN , First Publish Date - 2020-07-04T20:48:18+05:30 IST

తిరుమలలోని కర్ణాటక సత్రాల ప్రాంతంలో వసతి సముదాయం నిర్మాణానికి మార్గం సులువైంది. రూ.200 కోట్లు టీటీడీకి డిపాజిట్‌ చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. ఆ మొత్తంతో వసతి సముదాయాల

తిరుమల కర్ణాటక సత్రాల వద్ద వసతి సముదాయాల నిర్మాణం

రూ.200 కోట్లతో టీటీడీకే బాధ్యతలు

కర్ణాటక సీఎం యడ్యూరప్పతో టీటీడీ ఛైర్మన్‌, ఈవోల సమావేశం


తిరుపతి (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని కర్ణాటక సత్రాల ప్రాంతంలో వసతి సముదాయం నిర్మాణానికి మార్గం సులువైంది. రూ.200 కోట్లు టీటీడీకి డిపాజిట్‌ చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. ఆ మొత్తంతో వసతి సముదాయాల నిర్మాణ బాధ్యతలు తీసుకునేందుకు టీటీడీ అంగీకారం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం బెంగళూరులో కర్నాటక సీఎం యడ్యూరప్పతో టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ధర్మారెడ్డి జరిపిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆలయానికి పడమర మాడవీధికి ఆనుకునే ఎగువన కర్ణాటక ప్రభుత్వానికి చెందిన సత్రాలున్నాయి. మొత్తం 7.05 ఎకరాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి 2008లోనే యాభై ఏళ్ళ లీజుకు టీటీడీ కేటాయించింది. ఇందులో కొన్ని సత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. 


చాలావరకు స్థలం ఖాళీగానే వుంది. అందులో నూతన వసతి సముదాయాలు నిర్మించేందుకు ప్లాన్‌ రూపొందించిన కర్ణాటక ప్రభుత్వం ఇటీవల టీటీడీకి అందజేసింది. దీంతో పాటు కర్ణాటక దేవదాయ శాఖ కమిషనర్‌ రోహిణీ సింధూరి ఇటీవల తిరుమల వచ్చి కర్ణాటక సత్రాలను పరిశీలించడంతో పాటు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని కలిసి చర్చించారు. అనంతరం కర్ణాటక సీఎం ఆహ్వానంతో శుక్రవారం ఛైర్మన్‌, ఈవో, అదనపు ఈవో బెంగళూరు వెళ్లి యడ్యూరప్పను కలిశారు. టీటీడీ నిబంధనలకు లోబడి దేవస్థానానికి అనుకూలంగా ఉండేలా వసతి సముదాయాల నిర్మాణానికి ఉభయపక్షాలూ అంగీకారానికి వచ్చాయి. దాని ప్రకారం రూ.200 కోట్లను కర్ణాటక ప్రభుత్వం టీటీడీకి డిపాజిట్‌ చేయనుంది. పడమర మాడవీధిని ఆనుకుని 1.94 ఎకరాల భూమిని ఖాళీగా  ఉంచడానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. ఆ ఖాళీ స్థలాన్ని బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో భక్తుల అవసరాల కోసం టీటీడీ వినియోగించుకునేందుకు అంగీకారం కుదిరింది. కర్ణాటక ప్రభుత్వం త్వరలో నిర్మాణానికి సంబంధించిన ప్లాన్‌ను టీటీడీకి అందజేయనుంది. ఈ పనులకు యడ్యూరప్ప శంకుస్థాపన చేయనున్నారు. 

Updated Date - 2020-07-04T20:48:18+05:30 IST