దేశంలో రెండు కొత్త స్ట్రెయిన్లు!

ABN , First Publish Date - 2021-02-24T07:24:10+05:30 IST

‘‘దేశంలో రెండు కరోనా కొత్త స్ట్రెయిన్లను గుర్తించాం. అవి ఎన్‌440కె, ఈ484కె. ఈ కొత్త స్ట్రెయిన్లు ఉన్న కేసులను మహారాష్ట్ర, కేరళ, తెలంగాణలో గుర్తించాం’’ అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది...

దేశంలో రెండు కొత్త స్ట్రెయిన్లు!

  • తెలంగాణ, మహారాష్ట్ర, కేరళలో గుర్తింపు
  • ‘ఎన్‌440కె’, ‘ఈ484కె’గా పేర్కొన్న కేంద్రం


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ‘‘దేశంలో రెండు కరోనా కొత్త స్ట్రెయిన్లను గుర్తించాం. అవి ఎన్‌440కె, ఈ484కె. ఈ కొత్త స్ట్రెయిన్లు ఉన్న కేసులను మహారాష్ట్ర, కేరళ, తెలంగాణలో గుర్తించాం’’ అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఈ రెండూ మహారాష్ట్రలో ఉన్నట్లు చెబుతున్నారని.. అయితే, ఇవి తెలంగాణ, కేరళలో కూడా ఉన్నాయని నీతి ఆయోగ్‌ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ మంగళవారం వెల్లడించారు. మహారాష్ట్ర, కేరళల్లో పాజిటివ్‌ల పెరుగుదలకు ఈ స్ట్రెయిన్‌లే కారణమనేందుకు ఆధారాలు లేవని తెలిపారు. మరోవైపు ఉత్పరివర్తనాలను నిశితంగా గమనిస్తున్నట్లు పాల్‌ తెలిపారు. ఈ క్రమంలో వైరస్‌ స్వభావంలో అసాధారణ మార్పులేమైనా ఉన్నాయా? అని పరిశీలిస్తున్నట్లు వివరించారు. కాగా, కొన్ని రోజుల నుంచి మహారాష్ట్ర సహా నాలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రధాన మంత్రి కార్యాలయంలో మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో దేశంలో ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి తీరుపై సమీక్షించారు. కరోనా స్ట్రెయిన్‌ ఉత్పరివర్తనాలు వెలుగు చూసిన నేపథ్యంలో ఈ సమీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు   కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుదలకు కొత్త వేరియంట్లే కారణమా? అనేది మూడు, నాలుగు రోజుల్లో తేలే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నెల రోజుల్లో కేరళ, మహారాష్ట్ర నుంచి 900 నమూనాలను జన్యు విశ్లేషణకు పంపారు. పంజాబ్‌, కర్ణాటక నుంచి కూడా నమూనాలను తీసుకున్నారు. మరోవైపు దేశంలో ఇప్పటికే యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ స్ట్రెయిన్‌ కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. మంగళవారం నాటికి దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌ కేసులు రెండు పెరిగి 6కు చేరాయి. యూకే స్ట్రెయిన్‌ కేసులు 187, ఒక బ్రెజిల్‌ స్ట్రెయిన్‌ కేసు నమోదైంది. కాగా, దేశంలో ఏడాదిలో ఏడు వేల కరోనా స్ట్రెయిన్‌లలో 24 వేల పైగా ఉత్పరివర్తనాలను గుర్తించినట్లు, ఇవన్నీ ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నట్లు కరోనాపై ఏర్పాటైన జాతీయ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడొకరు వెల్లడించారు. జన్యు విశ్లేషణకు ఏర్పాటు చేసిన కన్సార్షియంలోని ప్రయోగశాలలూ దీనిని ధ్రువీకరించినట్లు పేర్కొన్నారు.


7 వేలపైగా కరోనా ఉత్పరివర్తనాలు

దేశంలో ఏడు వేలపైగా కరోనా వైరస్‌ ఉత్పరివర్తనాలు ఉన్నాయని.. వీటిలో చాలావరకు తీవ్ర ప్రమాదకారులని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా పేర్కొన్నారు. వీటిలో ఎన్‌440కె ఉత్పరివర్తనం దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాపిస్తోందని తెలిపారు. దేశంలో 5 వేలపైగా వైరస్‌ వేరియంట్లపై సీసీఎంబీ విస్తృత విశ్లేషణ చేసిందని ఆయన వివరించారు. వాటి పరిణామ క్రమాన్ని కనుగొనట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తమ పరిశీలనకు నివేదిక రూపం ఇచ్చారు. కాగా, ప్రతి ఉత్పరివర్తనం కొత్త స్ట్రెయిన్‌ కాదని రాకేశ్‌ మిశ్రా స్పష్టం చేశారు. దేశంలో కరోనా జన్యు విశ్లేషణలో భారత్‌ వెనుకంజలో ఉందని ఆయన విశ్లేషించారు. కోటిపైగా కేసులు నమోదైనా.. అందులో 6,400 (0.06) నమూనాల జన్యువిశ్లేషణ మాత్రమే పూర్తయిన సంగతిని ప్రస్తావించారు. కాగా, స్ట్రెయిన్‌ మ్యుటేషన్‌ ఆందోళనల నేపథ్యంలో దేశంలో జీనోమ్‌ టెస్టులను యుద్ధప్రాతిపదికన పెంచాలని నిపుణులు కోరుతున్నారు. రోజుకు 5 శాతం నమూనాలను విశ్లేషించాలని లక్ష్యం పెట్టుకున్నా.. ఆ మేరకు చేయడం లేదు. 

Updated Date - 2021-02-24T07:24:10+05:30 IST