కమ్మేస్తున్న కరోనా

ABN , First Publish Date - 2021-05-05T05:23:26+05:30 IST

జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజు వందల సంఖ్యలో కేసులు వస్తున్నాయి.

కమ్మేస్తున్న కరోనా

ఒక్కరోజే 1,976 కేసులు నమోదు

చికిత్స పొందుతూ మరో తొమ్మిది మంది మృతి

644కు చేరిన మరణాలు


విశాఖపట్నం, మే 4 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజు వందల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. మంగళవారం రికార్డు స్థాయిలో 1,976 నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 87,512కు చేరింది. ఇందులో 72,752 మంది కోలుకున్నారు. మంగళవారం 986 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా, చికిత్స పొందుతూ తొమ్మిది మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. వీటితో కొవిడ్‌ మరణాల సంఖ్య 644కు చేరింది. జిల్లాలో ప్రతిరోజూ సుమారు రెండు వేల కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా వుండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జన సమ్మర్థ ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. రోజురోజుకూ కేసులు పెరుగుతుండడంతో కొవిడ్‌ చికిత్స అందించే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఆస్పత్రిలో బెడ్‌ దొరకాలంటే చాలా కష్టంగా మారుతోంది. 


బెజ్‌ కృష్ణ యజమాని నాగేశ్వరరావు కన్నుమూత

గత నెల 29న ఆయన సోదరుడు ప్రసాదరావు మృతి

అంతకుముందు ప్రసాదరావు భార్య...కరోనాతో వరుసగా ముగ్గురి మృతి


తగరపువలస, మే 4: నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పిన్నమనేని నాగేశ్వరరావు కుటుంబంలో కరోనా తీవ్ర విషాదాన్ని నింపింది. గత నెల రోజుల్లో కుటుంబంలో ముగ్గురు సభ్యులు కొవిడ్‌తో కన్నుమూశారు. పిన్నమనేని నాగేశ్వరరావు, ఆయన సోదరులు కలిసి డైమండ్‌పార్కు సమీపంలో బెజ్‌కృష్ణ పేరుతో హోటల్‌ను ఏర్పాటుచేశారు. అలాగే పిన్నమనేని ఎంటర్‌ప్రైజెస్‌, శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో సినిమా డిస్ర్టిబ్యూటర్‌గా వ్యాపారం సాగిస్తున్నారు. విజయనగరంలో శ్రీకృష్ణ, తగరపువలస గణేష్‌ థియేటర్లకు యజమానులుగా కొనసాగుతున్నారు. కాగా, కరోనా కారణంగా నాగేశ్వరరావు సోదరుడు ప్రసాదరావు భార్య శ్రీలక్ష్మి మార్చి 23న మృతిచెందారు. ప్రసాదరావుతోపాటు కుటుంబంలో పలువురికి పాజిటివ్‌ రావడంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ప్రసాదరావు గత నెల 29న మృతిచెందారు. నాగేశ్వరరావు మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. నాగేశ్వరరావు, ప్రసాదరావుల మృతిపై ఎగ్జిబిటర్లు, హోటల్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సంతాపం వెలిబుచ్చారు.


ముగ్గురిని బలిగొన్న మహమ్మారి 

ఒకేరోజు తండ్రి, త ల్లి, కుమారుడి మృతి

మరో కుమారుడి పరిస్థితి విషమం


నర్సీపట్నం, మే 4: ఆ కుటుంబంలో కొవిడ్‌ కరాళనృత్యం చేసింది. కుటుంబంలోని నలుగురినీ ఆవహించిన వైరస్‌ ఒకేరోజు ముగ్గురిని పొట్టనపెట్టుకుంది. మరొకరు ఆస్పత్రిలో కరోనాతో పోరాడుతున్నారు. పట్టణంలోని డాన్‌బాస్కో స్కూల్‌ సమీపంలోని సామిల్లు యజమాని, కడియం రాము (64), ఆయన భార్య సత్యవతి (55), చిన్న కుమారుడు రాజు (37) కరోనాతో విశాఖలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు మునిసిపల్‌ అధికారులు చెప్పారు. మరో కుమారుడు రవి (46) పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. పట్టణంలోని తమ ఇంటికి మరమ్మతులు చేపడుతున్న నేపథ్యంలో రాము కుటుంబం గత కొద్ది నెలలుగా పెదబొడ్డేపల్లి సెంట్‌ఆన్స్‌ స్కూల్‌ సమీపంలోని లక్ష్మీపురం సామిల్లు వద్ద ఉంటోంది. వారం కిందట కుటుంబ సభ్యులంతా కొవిడ్‌ బారినపడ్డారు. విశాఖ కేజీహెచ్‌లో ఇద్దరు, ప్రైవేటు ఆస్పత్రిలో ఇద్దరు చేరి చికిత్స పొందుతున్నారు. ఒకేరోజు కుటుంబలోని ముగ్గురు మృత్యువాత పడడంతో పెదబొడ్డేపల్లితో పాటు నర్సీపట్నంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబంలో ఒకరికి వైరస్‌ నిర్ధారణ జరిగి, హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ, మిగిలిన వారికి వైరస్‌ వేగంగా సోకుతుండడం, ఆస్పత్రికి చేరి తేరుకునేలోగా ఒకరిద్దరు మృతి చెందుతుండడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొంటున్నాయి. 

 



Updated Date - 2021-05-05T05:23:26+05:30 IST