రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌కు 1700 దరఖాస్తులు

ABN , First Publish Date - 2022-06-24T07:53:29+05:30 IST

పదో తరగతి ఫలితాలకు సంబంధించి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నారు.

రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌కు 1700 దరఖాస్తులు

చిత్తూరు (సెంట్రల్‌), జూన్‌ 23: పదో తరగతి ఫలితాలకు సంబంధించి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నారు. తక్కువ మార్కులు వచ్చిన సబ్జెక్టుల్లో విద్యార్థులు తమ అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు అనుమతించింది. ప్రతి సబ్జెక్టుకు రీకౌంటింగ్‌ చేయడానికి రూ.500, రీవెరిఫికేషన్‌కు రూ.వెయ్యి ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించి, హార్డు కాపీలను విద్యాశాఖలోని పరీక్షల విభాగంలో సమర్పించారు. వీటి గడువు ఈనెల 20వ తేది ముగిసేనాటికి జిల్లాకు 1200 దరఖాస్తులు రాగా, సకాలంలో ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి ఆపై వచ్చిన దరఖాస్తుల లెక్కలు కడితే మొత్తం 1700 వచ్చినట్లు పరీక్షల సహాయ కమిషనరు ప్రభావతి తెలిపారు. దరఖాస్తుల్లో ఎక్కువగా సోషియల్‌, హిందీ సబ్జెక్టులు ఉన్నాయి. తక్కువగా తెలుగు, మ్యాథ్స్‌ సబ్జెక్టులు ఉన్నాయు. ఇంగ్లీషు, సైన్స్‌ సబ్జెక్టుల్లోనూ రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ దరఖాస్తులు వచ్చాయి. వీటిని రాష్ట్ర విద్యాశాఖకు ఆన్‌లైన్‌ ద్వారా తెలియజేయడంతో పాటు దరఖాస్తులను విజయవాడకు పంపుతున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల నుంచి వివిధ సబ్జెక్టుల్లో రీవెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ చేయడానికి ఇండెంట్‌ 2400 జిల్లాకు వచ్చాయి. వీటిని త్రీమెన్‌ కమిటీ ద్వారా పరిశీలించి, నోట్‌ఫైల్‌ తయారు అనంతరం వాటిని రాష్ట్ర విద్యాశాఖ పరీక్షల విభాగానికి పంపనున్నారు. త్రీమెన్‌ కమిటీ రిపోర్టు ఆధారంగా రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలించి రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌లో సవరణలు చేసి, వివరాలను (సబ్జెక్టు తుది ఫలితాలు) విద్యార్థుల స్వీయ చిరునామాకు పంపనున్నారు.


Updated Date - 2022-06-24T07:53:29+05:30 IST