Abn logo
Sep 5 2021 @ 01:33AM

కాబూల్‌లో 17 మంది మృతి

 • తాలిబాన్ల విజయోత్సవ కాల్పులు..
 • మరో 41 మందికి గాయాలు
 • ఆందోళన చేసిన మహిళలపైనా దౌర్జన్యం!
 • పంజ్‌షీర్‌లో హోరాహోరీ పోరు
 • మానవ కవచాలను వాడుతున్న తాలిబాన్లు
 • కడదాకా పోరాడతామన్న మసూద్‌, సలేహ్‌
 • తాలిబాన్ల సర్కారు ఏర్పాటు వాయిదా
 • తాలిబాన్‌, హక్కానీ గ్రూపు విభేదాలే కారణం!
 • మళ్లీ శుక్రవారమే అధికారిక ప్రకటన
 • అంతర్జాతీయ సమాజం మెచ్చేలా కూర్పు
 • జబియుల్లాకు సమాచార మంత్రిగా చాన్స్‌!
 • ఘనీ సోదరుడు, గుల్బుద్దీన్‌కూ అవకాశం

కాబూల్‌, సెప్టెంబరు 4: అఫ్ఘానిస్థాన్‌ రాజధాని నగరం కాబూల్‌ మళ్లీ రక్తమోడింది. ‘‘దేవుడి దయతో అఫ్ఘాన్‌ మొత్తం మన నియంత్రణలోకి వచ్చింది. పంజ్‌షీర్‌పైనా మనం పట్టు సాధించాం’’ అని తాలిబాన్‌ కమాండర్‌ ఒకరు శుక్రవారం ప్రకటించడంతో.. కాబూల్‌, నంగర్హార్‌ నగరాల్లో తాలిబాన్లు విజయోత్సవంతో తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాబూల్‌లో 17 మంది మృతిచెందగా.. 41 మంది గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. నంగర్హార్‌లోనూ తాలిబాన్లు కాల్పులు జరిపిన ఘటనలో 14 మంది గాయపడ్డట్లు అఫ్ఘాన్‌ అధికార టీవీ చానల్‌ టోలో న్యూస్‌ వెల్లడించింది. అయితే.. తాలిబాన్లు గాల్లోకి కాల్పులు జరిపారంటూ కథనాలు ప్రసారం చేసింది. ఈ ఘటనలపై తాలిబాన్ల అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ తీవ్రంగా స్పందించారు. ‘‘తుపాకులు, బుల్లెట్లు ప్రభుత్వ ఆస్తులు. వాటిని వృథాగా కాల్చడం.. గాల్లోకి పేల్చడం సరికాదు. ఇకపై అలా చేసే కంటే.. దేవుడికి ధన్యవాదాలు తెలిపి ఆనందాన్ని వ్యక్తం చేయండి’’ అని తమ సేనలకు సూచించారు. అటు ప్రభుత్వంలో తమకూ స్థానం కల్పించాలంటూ కొందరు మహిళలు అధ్యక్ష భవనం వద్ద ఆందోళన చేసిన సందర్భంలోనూ తమపై తాలిబాన్లు దాడి జరిపారని వారు ఆరోపించారు. టియర్‌గ్యాస్‌ ప్రయోగించారని, తాలిబాన్ల దాడిలో తన తలకు తీవ్ర గాయమైందని నర్గీస్‌ సాదత్‌ అనే మహిళా హక్కుల కార్యకర్త ఆరోపించారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పంజ్‌షీర్‌ను స్వాధీనం చేసుకోలేకపోవడం తాలిబాన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తొలుత ఒకట్రెండు జిల్లాలను ఆక్రమించుకున్నా మళ్లీ రెబెల్స్‌(ఉత్తర కూటమి దళాలు) వాటిని స్వాధీనం చేసుకోవడంతో హోరాహోరీగా పోరు సాగుతోంది. తాలిబాన్ల వైపు ఎక్కువ ప్రాణనష్టం నమోదైనట్లు రెబెల్స్‌ తరఫున పోరాడుతున్న మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ తెలిపారు. తాను విదేశాలకు పారిపోయినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. తాలిబాన్లు ప్రాణనష్టాన్ని నివారించడానికి పరిసర గ్రామాల ప్రజలను మానవ కవచాలు(హ్యూమన్‌ షీల్డ్‌)గా వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు కఠినంగా ఉన్నాయని, అయినా.. తాము కడదాకా పోరాడతామని సలేహ్‌, పంజ్‌షీర్‌ నేత అబ్దుల్లా మసూద్‌ వెల్లడించారు.


ప్రభుత్వ ప్రకటన మళ్లీ వాయిదా..

అఫ్ఘానిస్థాన్‌లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వ ప్రకటన మళ్లీ వాయిదా పడింది. నిజానికి శుక్రవారమే ప్రమాణ స్వీకారాలు జరగాల్సి ఉండగా.. శనివారం ప్రభు త్వ ప్రకటన ఉంటుందని తాలిబాన్లు ప్రకటించారు. తాజాగా వచ్చే శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ‘‘అంతర్జాతీయ సమాజం మెచ్చేలా సమ్మిళిత పరిపాలన యంత్రాంగాన్ని రూపొందించడానికే ప్రభుత్వ ప్రకటనను వాయిదా వేస్తున్నాం. వచ్చే వారం ప్రభుత్వం ఏర్పాటవుతుంది’’ అని తాలిబాన్ల అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ శనివారం ప్రకటించారు. తాలిబాన్ల మరో నేత ఖలీల్‌ హక్కానీ కూడా ప్రభుత్వ ప్రకటన వాయిదాను నిర్ధారించారు. మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ సోదరుడు హస్మత్‌ ఘనీకి, మాజీ అధ్యక్షుడు గుల్బుద్దీన్‌ హెక్మతియార్‌కు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఉంటుందన్నారు. కాగా.. కాబూల్‌ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినట్లు ఖతార్‌ వర్గాలు తెలిపాయి. జబియుల్లాకు సమాచార శాఖను అప్పగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.


గ్రూపు వివాదాలు.. ఐఎస్‌ఐ జోక్యం

అఫ్ఘాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో తాలిబాన్లు, హక్కానీ నెట్‌వర్క్‌ నేతల మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. తాలిబాన్‌ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌(ఒంటికన్ను ఒమర్‌) కుమారుడు ముల్లా యాకూబ్‌, కాబోయే అధ్యక్షుడు ముల్లా బరాదర్‌ తమ సర్కారులో మిలటరీ యోధుల్ని నియమించాలని నిర్ణయించగా.. హక్కానీ నెట్‌వర్క్‌ వ్యతిరేకించిందని, తమ వారికి ప్రాధాన్యతనివ్వాలని పట్లుబట్టిందని సమాచారం. హక్కానీ నెట్‌వర్క్‌ ఐక్యరాజ్య సమితి(ఐరాస) ఉగ్ర జాబితాలో ఉండగా.. దాన్ని నడుపుతున్న పాకిస్థాన్‌ నిఘా విభాగం ఐఎ్‌సఐ అనేది బహిరంగ రహస్యమే. ఇప్పుడు ఈ వ్యవహారంలో పాక్‌ తలదూరుస్తోంది. పాక్‌ ఐఎ్‌సఐ చీఫ్‌ హమీద్‌ ఫయాజ్‌ శనివారం కాబూల్‌ చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చే దిశలో హమీద్‌ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.


సహేతుక పరిష్కారం: శ్రింగ్లా

అఫ్ఘాన్‌ గడ్డపై తమకు వ్యతిరేకంగా ఉగ్రకార్యకలాపాలకు తావుండకూడదని భారత్‌ అంటోంది. అఫ్ఘాన్‌ పరిస్థితులను భారత్‌-అమెరికా నిశితంగా పరిశీలిస్తున్నాయని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ వెల్లడించారు. వాషింగ్టన్‌ పర్యటనలో ఉన్న ఆయన అమెరికా విదేశాంగ మంత్రి, ఇతర అధికారులతో భేటీ అయ్యారు. భారత్‌ ఆందోళనపై తాలిబాన్లు సానుకూలంగా ఉన్నారని, సహేతుక పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామనే సంకేతాలిచ్చారని చెప్పారు. అఫ్ఘాన్‌ పరిస్థితులపై ఐరాస భద్రతామండలి పేర్కొన్న ఉగ్ర సంస్థలు ఐఎ్‌స-కే, జైషే మహమ్మద్‌, లష్కరేతాయిబా ఇప్పుడు స్వేచ్ఛగా అఫ్ఘాన్‌లోకి ప్రవేశిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. గత నెల 26న కాబూల్‌ విమానాశ్రయం వద్ద ఐఎ్‌స-కే మానవబాంబుల దాడి తర్వాత పాకిస్థాన్‌కు అమెరికా పలు సూచనలు చేసిన రహస్య నివేదికలను పాక్‌ పత్రికలు వెలుగులోకి తెచ్చాయి. మరోవైపు అఫ్ఘాన్‌ విషయంలో భారత్‌, అమెరికాలు రాజీ ధోరణితో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ భూభాగం ఉగ్రవాదులకుఅడ్డాగా మారకుంటే తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు ఈ రెండు దేశాలూ వేచి చూసే ధోరణినే కొనసాగించాలని భావిస్తున్నాయని సమాచారం.


తాలిబాన్‌ సర్కారును గుర్తించడమే మంచిది

మంగళ్‌హాట్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తాలిబాన్ల సర్కారును భారత్‌ గుర్తించడమే మంచిదని ‘హిందుస్థాన్‌ హమారా’ సంస్థ ఆధ్వర్యంలో రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీలో జరిగిన వెబినార్‌లో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య, కేంద్ర మాజీ సెక్రటరీలు వివేక్‌ కట్జూ, శక్తిసిన్హా, రచయిత, సినీ ప్రముఖుడు ఇక్బాల్‌ మల్హోత్రా,  తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. తాలిబాన్లలో మార్పు వచ్చిందని, అన్ని వర్గాలకు ప్రభుత్వంలో ప్రాధాన్యమిస్తామని వాగ్దానం చేశారని వారు గుర్తుచేశారు.